రష్యా-ఉక్రెయిన్‌ వివాదం.. పరిస్థితి చేయి దాటితే పెనుముప్పే!

ABN , First Publish Date - 2022-01-28T09:01:42+05:30 IST

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య వాతావరణం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఉక్రెయిన్‌తో సరిహద్దుల్లో రష్యా భారీ గా సైనికులను మోహరించింది.

రష్యా-ఉక్రెయిన్‌ వివాదం.. పరిస్థితి చేయి దాటితే పెనుముప్పే!

ఖతార్‌ గ్యాస్‌ సరఫరాయే కీలకం

భారత్‌లో ఎరువులు, విద్యుదుత్పత్తిపై ప్రభావం


(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య వాతావరణం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఉక్రెయిన్‌తో సరిహద్దుల్లో రష్యా భారీ గా సైనికులను మోహరించింది. ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. రష్యాపై ఆంక్షలు విధిం చే దిశగా అమెరికా, ఐరోపాలు కసరత్తు చేస్తున్నాయి. తన వజ్రాయుధమైన గ్యాస్‌ సరఫరాతో రష్యా ఐరోపా దేశాలను బెదిరించకుండా ఖతార్‌ సహాయం తీసుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ భారత్‌ నిశితంగా గమనిస్తోంది. గల్ఫ్‌, రష్యా, చైనా, అమెరికాతో సంబంధాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.


గ్యాస్‌ ధరలు పెరిగితే ఇబ్బందే..

ఐరోపాలో పరిస్థితులు క్షీణించి గల్ఫ్‌లోని ఖతార్‌ గ్యాస్‌ ధరలు పెంచితే మన దేశంపై తీవ్ర ప్రభావం ఉంటుందని దౌత్యవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన ఎరువుల ఉత్పత్తిపై గ్యాస్‌ ధరల ప్రభావం పడుతుందని, రైతాంగం ఇబ్బందు లు ఎదుర్కొంటుందని చెబుతున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు బడ్జెట్‌ రూ పొందిస్తున్న ప్రస్తుత తరుణంలో గ్యాస్‌ సరఫరా, ధర ల్లో మార్పులు సంభవిస్తే తీవ్ర ఇబ్బందులు తప్పవని పేర్కొంటున్నారు. దేశంలో గ్యాస్‌ ఆధారిత ఎరువులు ప్రత్యేకించి యూరియా ఉత్పత్తి ప్లాంట్లలో ఖతార్‌ నుంచి దిగుమతయ్యే గ్యాస్‌తో నడిచేవే ఎక్కువగా ఉన్నాయి. విద్యుత్తు రం గానికి కూడా కొంత మేరకు అక్క డి నుంచి గ్యాస్‌ అందుతోంది. ఖతార్‌ నుంచి సరసమైన ధరల కు లభించే గ్యాస్‌ భారత్‌లోని ఉత్పాదక రంగానికి కీలకం. ఈ గ్యాస్‌ దిగుమతిలో కేంద్ర ప్రభు త్వం అదానీ గ్రూపును కూడా ప్రోత్సహిస్తోంది. 


రష్యాను అడ్డుకొనే యత్నం

ఉక్రెయిన్‌ సరిహద్దులో రష్యా లక్ష మంది సైనికులను మోహరించి యుద్ధవిన్యాసాలు చేయడంపై అమెరికా మండిపడుతోంది. ఐరోపాలోని మిత్ర దేశాల సహాయంతో రష్యాను అడ్డుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే రష్యాపై ఆంక్షలు విధిస్తే తమకు గ్యాస్‌ సరఫరాలో ఇబ్బందులు సృష్టిస్తుందని ఐరోపా దేశాలు భయపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ గల్ఫ్‌లో తన మిత్ర దేశమైన ఖతార్‌ నుంచి కావాల్సినంత గ్యాస్‌ను ఐరోపా మొత్తానికీ సరఫరా చేసేందుకు కృషి చేస్తానని చెప్పినట్లు వార్తలొస్తున్నా యి. అమెరికా ఖతార్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. భారత్‌, జపాన్‌, చైనా ఇతర ఆసియా దేశాలకు ఖతార్‌తో దీర్ఘకాలిక ఒప్పందం ఉంది. 


కీలక కొనుగోలుదారు..

ఖతార్‌కు భారత్‌ కీలక కొనుగోలుదారు. అలాగే ఆ దేశ రాజు షేక్‌ తమీం, ఆయన తండ్రి హమాద్‌తో ప్రధాని మోదీకి సత్సంబంధాలున్నాయి. ఆసియాలో తమ ఒప్పందాలకు అనుగుణంగా గ్యాస్‌ సరఫరాను కొనసాగిస్తామని ఖతార్‌ ప్రకటించింది. భారత్‌ మాత్రం తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. మరోవైపు చైనా సరిహద్దులో ఉద్రిక్తతలతో అమెరికాపై భారత్‌ అనేక ఆశలు పెట్టుకొంది. ఇక భారత సైనికావసరాలకు ఇప్పటికీ రష్యానే పెద్ద దిక్కు. ఉక్రెయిన్‌లో కూడా దాదాపు 18 వేల మంది భారతీయ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకొని రష్యా-ఉక్రెయిన్‌ వివాదంలో భారత్‌ జాగ్రత్తగా ముందుకు వెళుతోంది.

Read more