Ukraine War : పాశ్చాత్య దేశాలకు పుతిన్ హెచ్చరిక

ABN , First Publish Date - 2022-09-21T20:01:42+05:30 IST

ఉక్రెయిన్ (Ukraine)పై యుద్ధంలో పెద్ద ఎత్తున ఎదురు దెబ్బలు తగలడంతో

Ukraine War : పాశ్చాత్య దేశాలకు పుతిన్ హెచ్చరిక

మాస్కో : ఉక్రెయిన్ (Ukraine)పై యుద్ధంలో పెద్ద ఎత్తున ఎదురు దెబ్బలు తగలడంతో పాక్షిక సైనిక సమీకరణ జరపాలని రష్యా (Russia) నిర్ణయించింది. ప్రస్తుతం రిజర్వులో ఉన్నవారిని, రక్షణ దళాల్లో పని చేసిన అనుభవంగలవారిని, సైనికపరమైన ప్రత్యేక నైపుణ్యాలుగలవారిని సైన్యంలో చేర్చుకోబోతున్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్‌కు మద్దతిస్తున్న పాశ్చాత్య దేశాలను గట్టిగా హెచ్చరించింది. పాశ్చాత్య దేశాలు హద్దు మీరాయని స్పష్టం చేసింది. 


రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ (Vladimir Putin) బుధవారం జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమై ఏడు నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో 2 మిలియన్ల మిలిటరీ రిజర్వ్‌స్ నుంచి పాక్షిక సమీకరణకు డిక్రీని జారీ చేసినట్లు తెలిపారు. మాతృభూమి, దాని సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలను కాపాడుకోవడం కోసం ఈ డిక్రీని జారీ చేసినట్లు తెలిపారు. 


‘‘పాక్షిక సమీకరణ గురించి చెప్తున్నాం. అంటే, ప్రస్తుతం రిజర్వులో ఉన్నవారిని మాత్రమే సైన్యంలోకి తీసుకుంటాం. అంతేకాకుండా రక్షణ దళాల్లో సేవలందించి, సైనిక సంబంధిత ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారిని, సంబంధిత అనుభవంగలవారిని తీసుకుంటాం’’ అని పుతిన్ చెప్పారు. విముక్తి పొందిన ప్రాంతాల్లోని ప్రజలను కాపాడవలసిన అవసరం ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 


తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతాలు ప్రస్తుతం రష్యా నియంత్రణలో ఉన్నాయి. రష్యాలో అంతర్భాగం కావడం కోసం ఈ ప్రాంతాల్లో రిఫరెండంలను నిర్వహించి, ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తామని వేర్పాటువాదులు  మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. రష్యాలో భాగమయ్యేందుకు ఇక్కడి ప్రజలు ఇష్టపడుతున్నారో, లేదో తెలుసుకోవడానికి ఈ రిఫరెండంలను నిర్వహిస్తామని ఈ ప్రకటన తెలిపింది. 


ఈ ప్రకటనను పుతిన్ ప్రస్తావిస్తూ, ఇక్కడి ప్రజలకు తాము మద్దతిస్తున్నామని, అందువల్లే రిఫరెండంలను నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. ఈ ప్రాంతాలను విముక్తి చేయాలని రష్యా లక్ష్యంగా పెట్టుకున్నందువల్ల డోన్‌బాస్‌లో పోరాడే వలంటీర్లకు చట్టబద్ధ హోదా కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. (ఉక్రెయిన్‌లోని) ప్రజలను వదిలిపెట్టే నైతిక హక్కు మనకు లేదన్నారు. 


పాశ్చాత్య దేశాలకు హెచ్చరిక

ఉక్రెయిన్‌కు మద్దతిస్తున్న పాశ్చాత్య దేశాలను వ్లదిమిర్ పుతిన్ గట్టిగా హెచ్చరించారు. రష్యాను బలహీనపరచాలని, విభజించాలని, నాశనం చేయాలని పాశ్చాత్య దేశాలు కోరుకుంటున్నాయని పుతిన్ అన్నారు. ఆ దేశాలు హద్దులు మీరిపోయాయని మండిపడ్డారు. పాశ్చాత్య దేశాల నుంచి ఎదురయ్యే ముప్పును తిప్పికొట్టడానికి రష్యా వద్ద చాలా ఆయుధాలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయంలో తాను ఎవరినీ మభ్యపెట్టడం లేదన్నారు. తమ దేశ ప్రాదేశిక సమగ్రత, అఖండతలకు ముప్పు ఎదురైతే, తాము తమ ప్రజలను కాపాడుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటామని తెలిపారు. 


తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్‌బాస్ ప్రాంతాన్ని విముక్తి చేయడమే తన లక్ష్యమని పుతిన్ చెప్పారు. ఇక్కడి ప్రజలు ఉక్రెయిన్ పాలనలో ఉండాలని కోరుకోవడం లేదన్నారు. 


Updated Date - 2022-09-21T20:01:42+05:30 IST