UP: ప్రభుత్వ భూమిలో యోగి ఆదిత్యనాథ్ ఆలయం... తాళం వేసిన అధికారులు

ABN , First Publish Date - 2022-09-26T22:48:07+05:30 IST

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరుతో ఏర్పాటైన ఆలయం ప్రభుత్వ భూమిలో..

UP: ప్రభుత్వ భూమిలో యోగి ఆదిత్యనాథ్ ఆలయం... తాళం వేసిన అధికారులు

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) పేరుతో ఏర్పాటైన ఆలయం (Temple) ప్రభుత్వ భూమిలో నిర్మించినట్టు ప్రాథమిక విచారణలో (Initial investigation) తేలింది. దీంతో ఆ ఆలయానికి జిల్లా అధికార యంత్రాంగం తాళం వేసింది. ఈ ఏడాది జూలైలో ప్రభాకర్ మౌర్య (32) అనే వ్యక్తి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆదిత్యనాథ్ ప్రచారకర్తగా చెప్పుకునే మౌర్య తన ఇష్టదైవం (యోగి)పై పలు పాటలు కూడా రికార్డు చేశారు. కల్యాణ్ భదర్సా గ్రామానికి  చెందిన మౌర్య ఆలయ నిర్మాణం కోసం భూమిని ఆక్రమించినట్టు ఫిర్యాదు రావడంతో అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు.


కాగా, తాను భగవంతుడిగా భావించే వ్యక్తిని ఆరాధించడం కొందరికి గిట్టటం లేదని, అందుకే తనను టార్గెట్ చేస్తున్నారని, ఇది అనుచితమని మౌర్య చెప్పినట్టు ఒక పత్రిక తెలిపింది. యోగి ఆదిత్యనాథ్ వేలాది అభిమానులు తనకు మద్దతుగా ఉన్నారని, వారంతా అయోధ్యకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆలయ నిర్మాణ విషయం సెప్టెంబర్ 21న వెలుగులోకి వచ్చింది. దీంతో మౌర్యపై ఆయన అంకుల్ రామ్‌నాథ్ నేరుగా సీఎంకు ఫిర్యాదు చేశారు. మామిడి చెట్లు ఉన్న చోట తన మేనల్లుడు ఆలయం కట్టాడని, ఎలాంటి అనుమతి లేకుండా చెట్టు కొమ్మలు కత్తిరించాడని, ఆక్రమించుకున్న భూమిలో నిర్మాణ జరిగిందని ఆ ఫిర్యాదులో రామ్‌నాథ్ పేర్కొన్నారు.


అఖిలేష్‌కు మౌర్య కౌంటర్

కాగా, భూమిపై యాజమాన్య హక్కుల విషయంలో మౌర్య నేరుగా స్పందించనప్పటికీ.. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చేసిన ట్వీట్‌కు మాత్రం ఘాటుగా స్పందించారు. అఖిలేష్ యాదవ్ హయాంలో యాదవులు తమ గ్రామంలోనూ,  పరిసరాల్లోనూ అక్రమంగా భూములు స్వాధీనం చేసుకున్నారని, ఆ భూములను విముక్తిపై అఖిలేష్ దృష్టి సారిస్తే బాగుంటుందని సూచించారు. జైపూర్ ‌నుంచి విగ్రహం తెప్పించానని మొదట్లో మౌర్య చెప్పినప్పటికీ అది బారాబంకీ నుంచి తెప్పించినట్టు తేలింది. దీనిపై కూడా మౌర్య సూటిగా  స్పందించలేదు. కాగా, సీఎంను కలుసుకునే అవకాశం కల్పిస్తాననే వాగ్దానం మినహాయిస్తే తనకు పైసా కూడా మౌర్య ఇవ్వలేదని విగ్రహాన్ని  చెక్కిన శిల్పి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఆదివారంనాడు విచారణ జరిపిన జిల్లా యంత్రాగం, ఆలయ భూమి ప్రభుత్వానికి చెందినదని, ఒక వ్యవసాయ యూనివర్శిటీకి దానిని కేటాయించారని గుర్తించింది. ఆలయానికి తాళం వేసింది.


Updated Date - 2022-09-26T22:48:07+05:30 IST