Priyanka Appeal: భారత్ జోడో యాత్రకు తరలిరండి...

ABN , First Publish Date - 2022-09-06T23:06:38+05:30 IST

కాంగ్రెస్ పార్టీ బుధవారం నుంచి 150 రోజుల పాటు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన..

Priyanka Appeal: భారత్ జోడో యాత్రకు తరలిరండి...

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ బుధవారం నుంచి 150 రోజుల పాటు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన 'భారత్ జోడో యాత్ర' (Bharat jodo Yatra) ప్రజలంతా పాల్గొనాలని, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి ప్రజా ప్రాధాన్యత కలిగిన అంశాలపై ఏకతాటిపైకి రావాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadhra) పిలుపునిచ్చారు. ''మేము ఆశాహవ (positive) రాజకీయాలు ప్రారంభిస్తున్నాం. మీ సమస్యలు తెలుసుకోవాలని, పరిష్కరించాలని కోరుకుంటున్నాం. మన ప్రియతమ దేశాన్ని ఐక్యంగా ఉంచాలని అభిలషిస్తున్నాం. ఐక్యభారతాన్ని సాధిద్దాం'' అని ఫేస్‌బుక్ వీడియోలో ప్రియాంక అన్నారు.


ప్రజలు, వారి సమస్యలను ఏమాత్రం ఖాతరు చేయని రాజకీయాలు ఇవాళ నడుస్తున్నామని ప్రియాంక విమర్శించారు. ''ఇవాళ రాజకీయ చర్చలన్నీ దేశ ప్రజల సమస్యలు ఏమాత్రం పట్టించుకోని రీతిలో సాగుతున్నాయి. భారత్ జోడో యాత్ర ద్వారా సామాన్య ప్రజానీకం సమస్యలు, ఆందోళనలను తెలుసుకుంటాం'' అని ఆమె అన్నారు. దేశ సౌభాగ్యం కోసం ప్రజలంతా ఏకమై యాత్రలో పాల్గొనాలని కోరారు. భారత్ జోడో యాత్రకు సంబంధించిన వివరాలు www.bharatjodoyatra.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, తద్వారా వివిధ రాష్ట్రాల మీదుగా ఏఏ సమయాల్లో యాత్ర ముందుకు సాగుతుందనే సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చని ప్రియాంక సూచించారు. ఎవరైనా పాట, కవిత, స్లోగన్ వంటివి జోడించాలనుకుంటే హ్యాష్‌ట్యాగ్ 'భారత్ జోడో యాత్ర' (Bharat Jodo Yatra)తో అప్‌లోడ్ చేయవచ్చని అన్నారు. కాగా, భారత్ జోడో యాత్ర ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగనున్న హిమాచల్ ప్రదేశ్ సహా 12 రాష్ట్రాల మీదుగా వెళ్తుంది.

Updated Date - 2022-09-06T23:06:38+05:30 IST