Union Minister Goyal : ఉమ్మడి పౌరస్మృతిపై ప్రైవేటు బిల్లు

ABN , First Publish Date - 2022-12-10T01:21:26+05:30 IST

రాజ్యసభలో మళ్లీ ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్‌ కోడ్‌ బిల్లు) తెరపైకి వచ్చింది. బీజేపీ సభ్యుడు కిరోడి లాల్‌ మీనా శుక్రవారం యూనిఫాం సివిల్‌ కోడ్‌పై ప్రైవేటు బిల్లును సభలో ప్రవేశపెట్టారు. మతాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఒకే సివిల్‌ కోడ్‌ను ..

 Union Minister Goyal : ఉమ్మడి పౌరస్మృతిపై ప్రైవేటు బిల్లు

రాజ్యసభలో ప్రవేశపెట్టిన బీజేపీ ఎంపీ.. ఓటింగ్‌లో నెగ్గడంతో బిల్లుకు చైర్మన్‌ అనుమతి

ప్రతిపక్షాల తీవ్ర అభ్యంతరం

అఖిల భారత జ్యుడీషియల్‌ సర్వీసు ఆలోచన ప్రస్తుతానికి లేదు: కేంద్రం

న్యూఢిల్లీ, డిసెంబరు 9: రాజ్యసభలో మళ్లీ ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్‌ కోడ్‌ బిల్లు) తెరపైకి వచ్చింది. బీజేపీ సభ్యుడు కిరోడి లాల్‌ మీనా శుక్రవారం యూనిఫాం సివిల్‌ కోడ్‌పై ప్రైవేటు బిల్లును సభలో ప్రవేశపెట్టారు. మతాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఒకే సివిల్‌ కోడ్‌ను అమలుచేయాలని బిల్లులో పేర్కొన్నారు. అన్ని మతాలకు సంబంధించిన చట్టాలను క్రోడీకరించాలని, వ్యక్తులందరి హక్కులను పరిరక్షించడానికి ఒకే సివిల్‌ కోడ్‌ను రూపొందించాలని తెలిపారు. దీనిపై అన్ని అంశాలను శోధించడానికి ఒక ప్యానెల్‌ను నియమించాలని కోరారు. కాగా... ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ బిల్లు పాసైతే సామాజిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతుందని పలు పార్టీలు ధ్వజమెత్తాయి. కాంగ్రెస్‌ పార్టీతోపాటు తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎండీఎంకే, ఆర్జేడీ, ఎస్పీ, సీపీఐ, సీపీఎం, ముస్లిం లీగ్‌, ఎన్సీపీలు బిల్లును వ్యతిరేకించాయి. దీంతో రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ బిల్లును ప్రవేశపెట్టాలా వద్దా అనే అంశంపై డివిజన్‌ ఓటింగ్‌ నిర్వహించారు. 63 మంది సభ్యులు బిల్లును ప్రవేశపెట్టడానికి అనుకూలంగా, 23మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఛైర్మన్‌ బిల్లును అనుమతించారు. గతంలో కూడా ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. కాగా... ఈ బిల్లు రాజ్యాంగానికి, లౌకికవాదానికి వ్యతిరేకమని, అనైతికమని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆరోపించింది. ఆర్‌ఎ్‌సఎస్‌, బీజేపీలు తమ అజెండాను ఒకదాని తర్వాత మరొకటి అమలుచేస్తున్నాయని ఎండీఎంకే ఎంపీ వైగో విమర్శించారు. ప్రతిపక్షాల విమర్శలను రాజ్యసభలో అధికార పక్ష నేత పీయూష్‌ గోయల్‌ తిప్పికొట్టారు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను అనుసరించి సభ్యులు ఏ అంశాన్నయినా సభలో లేవనెత్తవచ్చని, అది వారి హక్కు అన్నారు.

జ్యుడీషియల్‌ సర్వీసు ఆలోచన లేదు

అఖిల భారత సర్వీసుల తరహాలో ‘అఖిల భారత జ్యుడీషియల్‌ సర్వీసు’ను తీసుకొచ్చే ప్రణాళికలు ఏమీ లేవని కేంద్రం తెలిపింది. దిగువ కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి ఈ సర్వీసును ప్రవేశపెట్టాలని కొన్నాళ్లుగా ప్రతిపాదనలు వస్తున్నాయి. అయితే, భిన్న వర్గాల నుంచి విభిన్న అభిప్రాయాల నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని కేంద్ర న్యాయ మంత్రి కిరెన్‌ రిజిజు శుక్రవారం లోక్‌సభకు తెలిపారు.

దేశంలో క్యాన్సర్‌ కేసులు పెరిగాయి !

దేశంలో క్యాన్సర్‌ రోగుల సంఖ్య అధికమవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ అన్నారు. 2020లోసుమారు 13.92 లక్షల క్యాన్సర్‌ కేసులు నమోదయ్యాయని, ఈ సంఖ్య 12.8 శాతం మేర పెరుగుతుందని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. లోక్‌సభలో శుక్రవారం అడిగిన ఓ ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చారు. క్యాన్సర్‌ తరహా ప్రాణాంతక సమస్యలతో ఆస్పత్రిపాలైన నిరుపేదల వైద్యానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని కేంద్రం అందజేస్తుందని చెప్పారు. ఆయుష్మాన్‌ భారత్‌- ప్రధాన్‌ మంత్రి జన్‌ ఆరోగ్య యోజన(పీఎంజేఏవై) కింద కూడా క్యాన్సర్‌ రోగులకు చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.

దేశంలో ఆకలి చావులు లేవు

ప్రైవేట్‌ సర్వేలు, గణాంకాలను సభలో చర్చకు తెచ్చే ముందు సభ్యులు వాటిని క్షుణ్నంగా అధ్యయనం చేయాలని రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌కఢ్‌ సూచించారు. ఆకలి సూచిలో భారత్‌ 107వ ర్యాంకుకు పడిపోయిందని అంతర్జాతీయ ఆకలి సూచి-2022 వెల్లడించిన వివరాలపై అడిగిన అనుబంధ ప్రశ్నకు కేంద్ర మంత్రి గోయల్‌ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న చైర్మన్‌ పై వ్యాఖ్యలు చేశారు. ఆకలి సూచీని రూపొందించింది పూర్తిగా ప్రయివేటు వ్యక్తులని ఆ గణాంకాలు సరైనవి కావని గోయల్‌ బదులిచ్చారు. గత రెండేళ్ల కాలంలో ఆకలి చావులు నమోదైనట్లు ఏ రాష్ట్రం నుంచి కూడా సమాచారం లేదని గోయల్‌ చెప్పారు.

Updated Date - 2022-12-10T01:21:27+05:30 IST