సీఎంలుగా సావంత్, బీరేన్‌కు రెండోసారి అవకాశం

ABN , First Publish Date - 2022-03-16T23:05:41+05:30 IST

గోవా, మణిపూర్ ముఖ్యమంత్రి పగ్గాలను ప్రమోద్ సావంత్, ఎన్.బీరేన్ సింగ్‌ తిరిగి..

సీఎంలుగా సావంత్, బీరేన్‌కు రెండోసారి అవకాశం

న్యూఢిల్లీ: గోవా, మణిపూర్ ముఖ్యమంత్రి పగ్గాలను ప్రమోద్ సావంత్, ఎన్.బీరేన్ సింగ్‌ తిరిగి చేపట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతం గోవా సీఎంగా ప్రమోద్ సావంత్, మణిపూర్ సీఎంగా బీరేన్ సింగ్ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాల్లోనూ  బీజేపీ తిరిగి గెలుపొందడంతో వీరినే మరోసారి సీఎంలుగా కొనసాగించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్టు సమాచారం. నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటుపై న్యూఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో మంగళవారం జరిగిన సమావేశంలో సావంత్, బీరేన్‌లకు పార్టీ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నిల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.


కాగా, బుధవారం ఉదయం ప్రమోద్ సావంత్, బీరేన్ సింగ్‌లు ప్రధాని నరేంద్ర మోదీని కులసుకున్నారు. గోవాలో బీజేపీ వరుసగా మూడోసారి నెగ్గగా, మణిపూర్‌లో బీజేపీ పూర్తి మెజారిటీతో గెలుపొందడం ఇదే మొదటిసారి. ప్రమోద్ సావంత్, ఆయన టీమ్ తనను కలిసినట్టు మోదీ ఒక ట్వీట్‌లో తెలిపారు. రాష్ట్రానికి తిరిగి సేవలందించాలంటూ తీర్పునిచ్చిన గోవా ప్రజలకు కృతజ్ఞతలని, ప్రగతిపథంలో గోవాను నడిపేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. బీరేన్ సింగ్ సైతం తనను కలిసారని, మణిపూర్‌లో బీజేపీ సాధించిన ఘన విజయంపై ఆయనకు అభినందనలు తెలిపానని మోదీ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. మణిపూర్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మరింత కష్టపడి పనిచేస్తామని చెప్పారు.

Read more