Punjab: సీఎం నివాసం వెలుపల నిరనన, రైతులపై విరిగిన లాఠీ

ABN , First Publish Date - 2022-11-30T18:45:26+05:30 IST

తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ నివాసం వెలుపల రైతులు బుధవారం చేపట్టిన శాంతియుత నిరసన..

Punjab: సీఎం నివాసం వెలుపల నిరనన, రైతులపై విరిగిన లాఠీ

సంగ్రూర్: తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ (Bhagwant singh Mann) నివాసం వెలుపల రైతులు (Farmers) బుధవారం చేపట్టిన శాంతియుత నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది. రైతులపై పోలీసులు లాఠీలతో (Lathicharge) విరుచుకుపడ్డారు. పలువురిని నిర్బంధంలోకి తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం భగవంత్ మాన్ ప్రస్తుతం గుజరాత్‌లో ఉన్నారు.

రైతులు తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ హైవేపై శాంతియుత నిరసనలకు దిగడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీచార్జి చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద కనీన వేతనాలను రూ.700కు పెంచాలని, గ్రామీణ సహకార సంఘాల్లో దళితులకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పించాలని, భూ సేకరణ రిలీఫ్‌ను పెంచాలని, లంపీస్కిన్ వ్యాధితో మరణించిన పశువులకు పరిహారం చెల్లించాలని, పాడైన పంటలకు రీఇంబర్స్‌మెంట్ విడుదల చేయాలని, పంట తగులబెట్టిన వారిపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను రద్దు చేయాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.

లాఠీచార్జి దురదృష్టకరం: సాద్

రైతులపై పోలీసు చర్యను శిరోమణి అకాలీ దళ్ నేత మహేషిందర్ సింగ్ గ్రేవాల్ ఖండించారు. లాఠీచార్జి దురదష్టకరమని, ఆప్ వంచనకు ఇది అద్దంపడుతుందని ఆయన అన్నారు. పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వాన్ని బీజేపీ తప్పుపట్టింది. పంజాబ్ సొమ్మంతా గుజరాత్ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఖర్చుపెడుతున్నారని బీజేపీ నేత మంజిందర్ సింగ్ సిర్సా ఆరోపించారు. కేజ్రీవాల్ అన్యాయానికి పంజాబీలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

Updated Date - 2022-11-30T18:45:28+05:30 IST