ప్రధాన మంత్రుల సంగ్రహాలయం దేశానికి గర్వకారణం : మోదీ

ABN , First Publish Date - 2022-04-24T17:44:00+05:30 IST

దేశ రాజధాని నగరంలో ఏర్పాటైన ప్రధాన మంత్రుల సంగ్రహాలయం

ప్రధాన మంత్రుల సంగ్రహాలయం దేశానికి గర్వకారణం : మోదీ

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో ఏర్పాటైన ప్రధాన మంత్రుల సంగ్రహాలయం దేశానికి గర్వకారణమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దీనిని దేశ ప్రజల కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రధాన మంత్రులు చేసిన కృషిని గుర్తు చేసుకోవడం గర్వించదగిన విషయమని చెప్పారు. వారిని ఈ సంగ్రహాలయం దేశ యువతకు అనుసంధానం చేస్తోందన్నారు. 


దేశ ప్రజలను ఉద్దేశించి నిర్వహిస్తున్న రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ఆదివారం మోదీ మాట్లాడుతూ, ప్రధాన మంత్రుల మ్యూజియం దేశానికి గర్వకారణమని చెప్పారు. మన దేశ ప్రధాన మంత్రులు మన దేశం కోసం చేసిన కృషిని యువత తెలుసుకోగలుగుతారని, ఫలితంగా యువత ఆ ప్రధాన మంత్రులతో అనుసంధానమవుతారని అన్నారు. 


ఈ మ్యూజియంను మోదీ ఏప్రిల్ 14న ప్రారంభించారు. మొదటి టిక్కెట్‌ను ఆయన కొని, ఈ సంగ్రహాలయాన్ని సందర్శించారు. భారత దేశానికి ప్రధాన మంత్రిగా పని చేసిన ప్రతి ఒక్కరికీ ఇది ఘనమైన నివాళి అవుతుందని ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధాని మోదీ మార్గదర్శనంలో దీనిని తీర్చిదిద్దినట్లు తెలిపింది. స్వాతంత్ర్యానంతరం మన దేశానికి సేవలందించిన ప్రతి ప్రధాన మంత్రి కృషిని ఈ సంగ్రహాలయంలో ఉంచినట్లు పేర్కొంది. వారి భావజాలాలు, సిద్ధాంతాలు, పదవీ కాలాలతో సంబంధం లేకుండా అందరి కృషిని వివరించినట్లు తెలిపింది.


Updated Date - 2022-04-24T17:44:00+05:30 IST