Vande Bharat Express: విమాన ప్రయాణం అనుభూతినిచ్చే రైలును ప్రారంభించిన మోదీ

ABN , First Publish Date - 2022-09-30T21:23:05+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శుక్రవారం

Vande Bharat Express: విమాన ప్రయాణం అనుభూతినిచ్చే రైలును ప్రారంభించిన మోదీ

అహ్మదాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శుక్రవారం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. ఆయన ఈ రైలులో గాంధీ నగర్ నుంచి అహ్మదాబాద్‌లోని కాలుపూర్ రైల్వే స్టేషన్ వరకు ప్రయాణించారు. గుజరాత్, మహారాష్ట్ర రాజధాని నగరాలను కలుపుతూ నడిచే ఈ రైలులో ప్రయాణించేవారికి విమానంలో ప్రయాణించిన అనుభూతి కలుగుతుంది. 


గుజరాత్ రాజధాని గాంధీ నగర్ కేపిటల్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఆకుపచ్చ జెండాను ఊపి మోదీ ఈ రైలును ప్రారంభించారు. ఇది సెమీ హై స్పీడ్ రైలు. మన దేశంలో నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఇది మూడోది. మొదటి రైలును న్యూఢిల్లీ-వారణాసి మధ్య నడుపుతున్నారు. మరో రైలును న్యూఢిల్లీ-శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా రూట్‌లో నడుపుతున్నారు. 


రైల్వే మంత్రిత్వ శాఖ ఇచ్చిన ట్వీట్‌లో, భావి తరం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. 


వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెమీ హై స్పీడ్ రైలులో ప్రయాణించేవారికి విమానంలో ప్రయాణించిన అనుభూతి కలుగుతుంది. భద్రత కూడా కట్టుదిట్టంగా ఉంటుంది. కవచ్ టెక్నాలజీ సహా అత్యాధునిక భద్రతా సాధనాలు దీనిలో ఉన్నాయి. కవచ్ టెక్నాలజీని మన దేశంలోనే అభివృద్ధి చేయడం మరో విశేషం. ఇది రైళ్లు ఢీకొనడాన్ని నివారించే సాంకేతిక పరిజ్ఞానం.


గాంధీ నగర్ - ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైలు ప్రయాణికులకు అక్టోబరు ఒకటి నుంచి అందుబాటులో ఉంటుంది. ఆదివారాల్లో దీని సేవలు అందుబాటులో ఉండవు. షెడ్యూలు ప్రకారం ఈ రైలు ముంబై సెంట్రల్ స్టేషన్‌ నుంచి ఉదయం 6.10 గంటలకు బయల్దేరుతుంది. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు గాంధీ నగర్ చేరుకుంటుంది. గాంధీ నగర్‌లో మధ్యాహ్నం 2.05 గంటలకు బయల్దేరి, రాత్రి 8.35 గంటలకు ముంబై సెంట్రల్ స్టేషన్‌కు చేరుతుంది. సూరత్, వడోదర, అహ్మదాబాద్ స్టేషన్లలో ఆగుతుంది.


టికెట్ ఛార్జీలు

ముంబై నుంచి అహ్మదాబాద్ ఎగ్జిక్యూటివ్ చైర్‌ కార్‌ ప్రయాణానికి ఒక్కొక్కరికి రూ.2,505; చైర్ కార్‌కు రూ.1,385 వసూలు చేస్తారు. ఈ రైలులో 16 బోగీలు ఉంటాయి. 


ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును మన దేశంలోనే డిజైన్ చేశారు. కేవలం 140 సెకండ్లలోనే గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. బోగీల్లో ఎయిర్ కండిషనింగ్ పర్యవేక్షణ కోసం కోచ్ కంట్రోల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. జీఎస్ఎం/జీపీఆర్ఎస్ ద్వారా కంట్రోల్ సెంటర్/మెయింటెనెన్స్ స్టాఫ్ మధ్య కమ్యూనికేషన్, ఫీడ్‌బ్యాక్ కోసం ఈ సిస్టమ్ ఉపయోగపడుతుంది. ప్రతి కోచ్‌లోనూ దీనిని పాసింజర్ ఇన్ఫర్మేషన్, ఇన్ఫోటెయిన్‌మెంట్ సిస్టమ్‌కు అమర్చుతారు. 


స్లైడింగ్ ఫుట్‌స్టెప్స్‌తో కూడిన ఆటోమేటిక్ ప్లగ్ డోర్స్, టచ్-ఫ్రీ స్లైడింగ్ డోర్స్ ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ కోచ్‌లో రివాల్వింగ్ చైర్స్ ఉంటాయి. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మరుగుదొడ్డి ఉంటుంది. విమానంలో ఉండే బయోవాక్యూమ్ టాయ్‌లెట్స్, టచ్-ఫ్రీ అమెనిటీస్ గల మొదటి రైలు ఇదే. అంధులు తమ సీట్ల నెంబర్లను గుర్తించడానికి వీలుగా  సీట్ల నంబర్లను బ్రెయిలీ లిపిలో రాశారు. 




Updated Date - 2022-09-30T21:23:05+05:30 IST