Modi Vs Congress : కాంగ్రెస్‌తో జాగ్రత్త... బీజేపీ కార్యకర్తలకు మోదీ హెచ్చరిక...

ABN , First Publish Date - 2022-10-11T21:20:16+05:30 IST

గుజరాత్ శాసన సభ ఎన్నికలు (Gujarat Assembly

Modi Vs Congress : కాంగ్రెస్‌తో జాగ్రత్త... బీజేపీ కార్యకర్తలకు మోదీ హెచ్చరిక...

రాజ్‌కోట్ : గుజరాత్ శాసన సభ ఎన్నికలు (Gujarat Assembly Elections) సమీపిస్తున్న తరుణంలో బీజేపీ (BJP) కార్యకర్తలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) హెచ్చరించారు. కాంగ్రెస్ (Congress) పార్టీ తనను దూషించడం మానేసిందని, గ్రామీణ ఓట్లను సొంతం చేసుకోవడం కోసం నిశ్శబ్దంగా పని చేసుకుంటోందని చెప్పారు. ఆ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. 


మోదీ మంగళవారం గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లా, జంకండోర్నాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులను కోరారు. కాంగ్రెస్ పార్టీ తనను దూషించడం మానేసిందని, గ్రామీణ ఓట్లను సొంతం చేసుకోవడం కోసం నిశ్శబ్దంగా పని చేసుకుంటోందని చెప్పారు. గుజరాత్ వ్యతిరేకులు రాష్ట్రాన్ని అపఖ్యాతిపాలు చేయడంలో వచ్చిన ఏ అవకాశాన్నీ గడచిన ఇరవయ్యేళ్ళలో వదులుకోలేదన్నారు. తనను అనేక రకాలుగా దూషించారని, తనను మృత్యు బేహారి అని కూడా అన్నారని చెప్పారు. కాంగ్రెస్ నేతలు అకస్మాత్తుగా నిశ్శబ్దంగా ఉంటున్నారన్నారు. తనను దూషించే పనిని, రభస సృష్టించే పనిని ఇతరులకు కాంట్రాక్టు ఇచ్చారన్నారు. వారు నిశ్శబ్దంగా గ్రామాలకు వెళ్తున్నారని, కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరుతున్నారని చెప్పారు. 


ప్రతిపక్షాలు అనుసరిస్తున్న ఈ నిశ్శబ్ద వ్యూహం గురించి బీజేపీ కార్యకర్తలను హెచ్చరిస్తున్నానని తెలిపారు. ఢిల్లీ (Delhi) నుంచి గుజరాత్‌కు వ్యతిరేకంగా కుట్ర పన్నేవారి నియంత్రణలోనే ఈ వ్యూహం అమలవుతోందన్నారు. మన దేశ తొలి హోం మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్  (Sardar Vallabh Bhai Patel) గౌరవార్థం గుజరాత్‌లో నిర్మించిన స్టాట్యూ ఆఫ్ యూనిటీ (Statue of Unity)ని సందర్శించారా? అని కాంగ్రెస్ నేతలను అడగాలని ప్రజలను కోరారు. ఈ గడ్డపై పుట్టిన భూమి పుత్రుడిని గౌరవించనివారికి గుజరాత్‌లో ఎలాంటి స్థానం ఉండకూడదన్నారు. అవినీతిపరులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, తమకు వ్యతిరేకంగా ఓ బృందం కేకలు పెడుతుందన్నారు. ‘‘ప్రజలను దోచుకునేవారిపై నేను చర్యలు తీసుకోవద్దా?’’ అని ప్రశ్నించారు. 


గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) గ్రామాలకు వెళ్ళి ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నారు. 


Updated Date - 2022-10-11T21:20:16+05:30 IST