SCO Summit : గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా భారత్ : మోదీ

ABN , First Publish Date - 2022-09-16T20:10:06+05:30 IST

ప్రపంచంలో షాంఘై సహకార సంఘం (Shanghai Cooperation Organisation) పాత్ర

SCO Summit : గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా భారత్ : మోదీ

సమర్కండ్ (ఉజ్బెకిస్థాన్) : ప్రపంచంలో షాంఘై సహకార సంఘం (Shanghai Cooperation Organisation) పాత్ర ప్రాధాన్యం పెరుగుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శుక్రవారం చెప్పారు. దేశాల మధ్య సహకారం మరింత పెరగవలసిన అవసరం ఉందని తెలిపారు. భారత దేశాన్ని గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. 


ఎస్‌సీవో సదస్సులో మోదీ శుక్రవారం మాట్లాడుతూ, నేడు ప్రపంచం కోవిడ్-19 మహమ్మారిని అధిగమిస్తోందని, ఈ సమయంలో ఎస్‌సీఓ పాత్ర చాలా ముఖ్యమైనదని తెలిపారు. ఎస్‌సీఓ సభ్య దేశాల్లో ప్రపంచ జనాభాలో 40 శాతం నివసిస్తోందన్నారు. ప్రపంచ జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)లో 30 శాతం వాటా ఈ దేశాలదేనని చెప్పారు. 


ఎస్‌సీఓ సభ్య దేశాల మధ్య సహకారాన్ని భారత్ సమర్థిస్తుందన్నారు. కోవిడ్-19 మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచ సరఫరా వ్యవస్థలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. దీనివల్ల ప్రపంచం మునుపెన్నడూ లేని స్థాయిలో ఇంధనం, ఆహార సంక్షోభాలను ఎదుర్కొంటోందని చెప్పారు. వైవిద్ధ్యభరితమైన సరఫరా వ్యవస్థలను ఎస్‌సీఓ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. దీని కోసం మెరుగైన అనుసంధానం (Connectivity) మాత్రమే చాలదని, మెరుగైన రవాణా సదుపాయాలు అవసరమని చెప్పారు. 


ప్రజల కేంద్రంగా అభివృద్ధి విధాన్ని అమలు చేయడంపై తాము దృష్టిపెట్టామని తెలిపారు. ప్రతి రంగంలోనూ సృజనాత్మకత, నవకల్పనలకు మద్దతిస్తున్నామని, సహకరిస్తున్నామని చెప్పారు. నేటికి భారత దేశంలో 100కుపైగా యూనికార్న్‌లు, 70,000కుపైగా స్టార్టప్ కంపెనీలు ఉన్నాయని చెప్పారు. 


విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఇచ్చిన ట్వీట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, ఎస్‌సీఓ సభ్య దేశాల అధినేతలతో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. అంశాలవారీగా, ప్రాంతీయ, జాతీయ సమస్యలపై ఈ చర్చలు జరిగాయి. ప్రాంతీయ శాంతి, భద్రతలు, వ్యాపారం, వాణిజ్యం, అనుసంధానం, సంస్కృతి, పర్యాటక రంగాలపై చర్చలు జరిగాయి. 


మోదీ, జిన్‌పింగ్

28 నెలల క్రితం తూర్పు లడఖ్‌లో భారత్-చైనా మధ్య ప్రతిష్టంభన ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, ప్రధాని మోదీ కలుసుకోవడం ఇదే మొదటిసారి. అయితే వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక సమావేశం జరుగుతుందో, లేదో ఇంకా స్పష్టత రాలేదు. ఫొటో సెషన్‌లో వీరిద్దరూ పక్కపక్కనే నిల్చుని, ఎస్‌సీఓ దేశాల నేతలతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ విధంగా నిల్చోవడాన్ని కాంగ్రెస్ గట్టిగా ప్రశ్నించింది. 


Updated Date - 2022-09-16T20:10:06+05:30 IST