Aatmanirbhar Bharat : మోదీ తీవ్ర ఆవేదన

ABN , First Publish Date - 2022-10-01T18:59:27+05:30 IST

ప్రతి ఇంటికీ సాంకేతిక పరిజ్ఞానం చేరగలదనే నమ్మకం

Aatmanirbhar Bharat : మోదీ తీవ్ర ఆవేదన

న్యూఢిల్లీ : ప్రతి ఇంటికీ సాంకేతిక పరిజ్ఞానం చేరగలదనే నమ్మకం తనకు గట్టిగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు. స్వయం సమృద్ధ భారత దేశం (Atma Nirbhar Bharat) కోసం తాను కన్న కలలను కొందరు ఎగతాళి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 5జీ సేవలను శనివారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ విజన్‌లో ఇది అత్యంత గొప్ప ముందడుగు అని చెప్పారు. 


"స్వయం సమృద్ధ భారత దేశం కోసం నా దార్శనికతను చాలా మంది ఎగతాళి చేశారు. అయినప్పటికీ ప్రతి ఇంటికీ సాంకేతిక పరిజ్ఞానం చేరగలదనే దృఢ నమ్మకం నాకు ఉంది. డిజిటల్ డివైస్ ధర, కనెక్టివిటీ, డేటా ధర, డిజిటల్ ఫస్ట్ విజన్ చాలా ముఖ్యమని నొక్కి వక్కాణించాను’’ అని మోదీ తెలిపారు. డిజిటల్ ఇండియాకు ఈ నాలుగు మూల స్తంభాలనే విషయం తెలిసిందే. 


5జీ టెక్నాలజీ (5G technology) వల్ల టలికాం రంగంలో విప్లవం వస్తుందని, అందువల్ల 5జీ సర్వీసులు ప్రారంభమైన రోజు 21వ శతాబ్దపు భారత దేశానికి చరిత్రాత్మక దినమని తెలిపారు. ఇది డిజిటల్ ఇండియా సాధించిన విజయమని చెప్పారు. 5జీ సేవల ప్రారంభ కార్యక్రమంలో గ్రామాలు కూడా పాల్గొనడం సంతోషాన్నిస్తోందన్నారు. 


బిచ్చగాళ్లు సైతం పారదర్శక లావాదేవీలు

భారత దేశం సాంకేతిక పరిజ్ఞానానికి వినియోగదారుగా మాత్రమే కాకుండా దాని అభివృద్ధిలో చురుకైన, గొప్ప పాత్ర పోషిస్తుందని తెలిపారు. వైర్‌లెస్ టెక్నాలజీ డిజైనింగ్‌లో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఓ బిచ్చగాడు డిజిటల్ పేమెంట్ స్వీకరిస్తున్నట్లు కనిపిస్తున్న ఓ వీడియోను తాను చూశానని చెప్పారు. ‘‘ఆయన (బిచ్చగాడు) పారదర్శకతను చూడండి’’ అన్నారు. చిన్న వ్యాపారులు కూడా డిజిటల్ లావాదేవీలు జరుపుతున్నారని చెప్పారు. 


అదే తేడా 

మన దేశంలో 2014లో మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు కేవలం రెండు మాత్రమే ఉండేవని చెప్పారు. ఇప్పుడు ఈ సంఖ్య 200 దాటిందని చెప్పారు. భారత దేశం స్వయం సమృద్ధం అవుతుండటంతో డేటా కోసం ఖర్చు చేయవలసిన సొమ్ము కూడా తగ్గుతోందన్నారు. 2014లో 1జీబీ డేటా ధర రూ.300 ఉండేదన్నారు. ఇప్పుడు ఇది రూ.10కి తగ్గిందని చెప్పారు. ఇంటర్నెట్ యూజర్లు ఇప్పుడు నెలకు 14 జీబీ డేటా వాడుతున్నారని చెప్పారు. దీని ధర 2014లో రూ.4,200 ఉండేదని, ఇప్పుడు రూ.125 నుంచి రూ.150 వరకు ఉంటోందని చెప్పారు. 


Updated Date - 2022-10-01T18:59:27+05:30 IST