Twin Towers: కూల్చివేత ఆదేశాలపై పిల్ వేస్తారా?...నిప్పులు చెరిగిన సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2022-08-01T20:12:14+05:30 IST

నొయిడాలో సూపర్‌టెక్ లిమిటెడ్ నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేత ఆదేశాలకు..

Twin Towers: కూల్చివేత ఆదేశాలపై పిల్ వేస్తారా?...నిప్పులు చెరిగిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: నొయిడాలో సూపర్‌టెక్ లిమిటెడ్ (supertech limited) నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్స్ (Twin towers) కూల్చివేత ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని (PIL) సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారంనాడు తోసిపుచ్చింది. పిటిషనర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడటంతో పాటు 5 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని కోవిడ్‌తో మరణించిన లాయర్ల కుటుంబాల సంక్షేమానికి ఇవ్వాలని ఆదేశిచింది. ''సెంటర్ ఫర్ లా అండ్ గుడ్ గవర్నన్స్'' అనే సంస్థ ఈ పిటిషన్ వేసింది.


నొయిడా ట్విన్ టవర్ల కూల్చివేతపై తామిచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ పిటిషన్ వేయడం ''దురుద్దేశపూరితం'' అని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సుధాన్షు ధుల్లియాతో కూడిన ధర్మాసనం మందలించింది. ''ఈ దశలో మీరు పిల్ ఎలా వేస్తారు?'' అని పిటిషనర్‌ను నిలదీసింది. పిటిషన్ ఉద్దేశం ఈ అంశంలో తాము (ధర్మాసనం) ఇచ్చిన తీర్పుకు పూర్తి విరుద్ధంగా ఉందని కోర్టు నిశ్చితాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.


ట్విన్ టవర్ల వ్యవహారం ఇలా సాగింది..

యూపీ పరిధిలో నొయిడాలోని సెక్టార్ 93 ప్రాంతంలో సూపర్ టెక్ లిమిటెడ్ కంపెనీ 2009లో భారీ ప్రాజెక్టు చేపట్టింది. భవన నిర్మాణ విషయంలో నిబంధనలను బిల్టర్ ఉల్లంఘించారు. భవన నిర్మాణ విషయంలో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు ప్రణాళికను చూపాలన్న నిబంధనలను అధికారులతో సంస్థ కుమ్మక్కై  తుంగలో తొక్కింది. దీనిపై నలుగురు స్థానికులు లీగల్ కమిటీగా ఏర్పడి సూపర్‌టెక్‌కు వ్యతిరేకంగా కోర్టును అశ్రయించారు. దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం గత ఏడాది ఆగస్టు 31న 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేయాలని ఆదేశాలిచ్చింది. ఇందులో 915 ఫ్లాట్లు, 21 దుకాణాలు ఉన్నాయి. ట్విన్ టవర్ల కూల్చివేతతో పాటు, 12 శాతం వడ్డీతో ట్విన్ టవర్స్ ఫ్లాట్ యజమానులకు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కూడా సూపర్‌టెక్‌ను ఆదేశించింది. కూల్చివేత ఖర్చును కూడా సుపర్‌టెక్ భరించాలని ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించాలని సూపర్‌టెక్ ఆ తరువాత పిటిషన్ వేయగా, దానిని కోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.

Updated Date - 2022-08-01T20:12:14+05:30 IST