రూ. వేయి పింఛను ఏమాత్రం సరిపోదు

ABN , First Publish Date - 2022-03-16T08:04:23+05:30 IST

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎ్‌ఫఓ) కింద నెలకు చెల్లిస్తున్న రూ.వేయి కనీస పెన్షన్‌ ఏ మాత్రం సరిపోదని..

రూ. వేయి పింఛను  ఏమాత్రం సరిపోదు

  పార్లమెంటరీ కమిటీ వ్యాఖ్య

న్యూఢిల్లీ, మార్చి 15: ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎ్‌ఫఓ) కింద నెలకు చెల్లిస్తున్న రూ.వేయి కనీస పెన్షన్‌ ఏ మాత్రం సరిపోదని పార్లమెంటు స్థాయీ సంఘం వ్యాఖ్యానించింది. ఎనిమిదేళ్ల క్రితం దీన్ని నిర్ణయించారని, ప్రస్తుత అవసరాలను ఇది తీర్చలేదని తెలిపింది. దీనిని పెంచేలా చూడాలని కార్మిక శాఖకు సూచించింది. కార్మిక, ఉపాధి శాఖలపై ఏర్పాటయిన ఈ స్థాయీ సంఘం మంగళవారం తన 30వ నివేదికను పార్లమెంటుకు సమర్పించింది. పెన్షన్‌ పెంపుదల కోసం తగిన నిధులు కేటాయించేలా ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరపాల్సిన బాధ్యత కార్మిక శాఖపై ఉందని తెలిపింది. పెన్షన్‌ పథకాల వాస్తవ పరిస్థితులను మదింపు వేసి, సభ్యులకు హేతుబద్ధమైన పింఛను లభించేలా చూడాలని భవిష్య నిధి సంస్థకు కూడా సూచించింది. ఉద్యోగుల పెన్షన్‌ పథకం-1995పై సమీక్ష జరిపేందుకు 2018లో కార్మిక శాఖ నియమించిన ఉన్నత స్థాయి సంఘం కనీస పింఛనును రూ.2,000కు పెంచాలని సిఫార్సు చేసిందని తెలిపింది. అయితే రూ.వేయికి మించి ఇవ్వడానికి ఆర్థిక శాఖ అంగీకరించలేదని గుర్తు చేసింది. అందువల్ల పెన్షన్‌ పథకాలను సమగ్రంగా సమీక్షించి నిధుల వివరాలను తేల్చాల్సి ఉందని అభిప్రాయపడింది.  2015కు ముందు పదవీ విరమణ చేసినవారు ఈ-నామినేషన్లు సమర్పించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ క్లెయిమ్‌ పోర్టల్‌లోనూ ఇబ్బందులు ఉన్నాయని తెలిపింది. ఈ అంశాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధునికీకరించాలని సిఫార్సు చేసింది.  

Updated Date - 2022-03-16T08:04:23+05:30 IST