PFI plan : 2047నాటికి ఇస్లామిక్ దేశం : మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్

ABN , First Publish Date - 2022-09-30T01:03:18+05:30 IST

భారత దేశాన్ని 2047నాటికి ఇస్లామిక్ దేశంగా మార్చాలని

PFI plan : 2047నాటికి ఇస్లామిక్ దేశం : మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్

ముంబై : భారత దేశాన్ని 2047నాటికి ఇస్లామిక్ దేశంగా మార్చాలని నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) లక్ష్యంగా పెట్టుకుందని మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ATS) చీఫ్ వినీత్ అగర్వాల్ (Vineet Agarwal) చెప్పారు. విద్వేషపూరిత నేరాలకు పాల్పడాలని ఈ సంస్థ తన సభ్యులను ప్రేరేపించిందని చెప్పారు. 


వినీత్ అగర్వాల్ గురువారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, భారత దేశాన్ని 2047 నాటికి ఇస్లామిక్ దేశంగా మార్చాలనేది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా లక్ష్యమని తెలిపారు. దీనికోసం ఆ సంస్థ ఓ ప్రణాళికను రచించి, అమలు చేస్తోందన్నారు. తన సభ్యులను రెచ్చగొట్టేందుకు ఈ సంస్థ పెద్దలు ఉపన్యాసాలు ఇచ్చేవారన్నారు. విద్వేషపూరిత నేరాలకు పాల్పడాలని ప్రేరేపించేవారని తెలిపారు. స్వీయ రక్షణ కోసం ఇళ్ళ పై కప్పులపై రాళ్ళు, ఇటుకలు, ఇతర పదునైన వస్తువులను పెట్టుకోవాలని చెప్పేవారని తెలిపారు. 


తాము సాంఘికాభివృద్ధి కార్యకర్తలమని, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లమని పీఎఫ్ఐ నాయకులు ఆ సంస్థ సభ్యులకు  చెప్పేవారని, వారిని రెచ్చగొట్టేవారని తెలిపారు. 


పీఎఫ్ఐ నేతలు, కార్యకర్తల సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. నిర్దిష్టంగా కొందరిని ఎంపిక చేసుకుని చంపడం వీరు నేరాలకు పాల్పడే విధానమని తెలిపారు. వీరి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తామని చెప్పారు. 


పీఎఫ్ఐపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిందని, ఆ తర్వాత ఈ సంస్థ రద్దయిందని తెలిపారు. ఈ సంస్థ సభ్యులు మళ్లీ మరొక సంస్థను ఏర్పాటు చేయరాదన్నారు. చట్టబద్ధ వేదిక ద్వారా మినహా ఇతర విధాల్లో నిరసనలు తెలియజేయడానికి అవకాశం ఉండదని చెప్పారు. 


కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలను నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థలు చట్ట వ్యతిరేక సంఘాలని ప్రకటించింది. పీఎఫ్ఐకి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడించింది. 


ఈ నేపథ్యంలో పీఎఫ్ఐ కార్యకలాపాలపై చర్యలు తీసుకునేందుకు పోలీస్ కమిషనర్లకు, జిల్లా మేజిస్ట్రేట్లకు అధికారాలు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. కేరళ, తమిళనాడు సహా ఇతర రాష్ట్రాలు కూడా ఇటువంటి ఆదేశాలను జారీ చేశాయి. 


Updated Date - 2022-09-30T01:03:18+05:30 IST