ప్రజల సొమ్ము మళ్లీ వారికే

ABN , First Publish Date - 2022-08-16T06:56:49+05:30 IST

‘ఉచితాలు’ అమలు చేయకూడదన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటనకు స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా చేసిన ప్రసంగాల్లో పలువురు విపక్ష..

ప్రజల సొమ్ము మళ్లీ వారికే

వాటిని ‘ఉచిత’ పథకాలు అనడం సరికాదు

ప్రజల సంక్షేమం కోసమే ప్రవేశ పెడుతున్నాం

ప్రధానికి విపక్ష ముఖ్యమంత్రుల సమాధానం


న్యూఢిల్లీ, ఆగస్టు 15: ‘ఉచితాలు’ అమలు చేయకూడదన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటనకు స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా చేసిన ప్రసంగాల్లో పలువురు విపక్ష ముఖ్యమంత్రులు సమాధానాలు ఇచ్చారు. ఇవి సంక్షేమ కార్యక్రమాలని, జనాకర్షక పథకాలు కావని స్పష్టం చేశారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మందికి పింఛన్లు ఇస్తున్నట్టు చెప్పారు. ఇది ప్రధాని చెప్పినట్టు ‘జీడీల సంస్కృతి’ కాదని, సంక్షేమ పథకమని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పేదలు, వృద్ధులకు ప్రతి వారం డబ్బులు చెల్లిస్తారని చెప్పారు. ప్రతి వారికీ  జీవించే హక్కు ఉందని తెలిపారు. ప్రజా సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వ విధి అని చెప్పారు. రాష్ట్రంలో ఉచితంగా మందులు, వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. 


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ ఉచితంగా విద్య, వైద్యం అందించడం ‘జీడీల సంస్కృతి’ కాదని చెప్పారు. దీనివల్ల పేదరిక నిర్మూలన జరుగుతుందని అన్నారు. ఈ రంగాల్లో ఢిల్లీలో అమలు చేస్తున్న విఽధానాలను దేశఽమంతటా విస్తరిస్తే అయిదేళ్లలో మొత్తం పరిస్థితి మారిపోతుందని చెప్పారు. ఆకలితో బాధపడేవారు ఉండకూడదన్నదే తన కల అని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఇందు కోసం ప్రతి రోజూ కృషి చేస్తానని తెలిపారు. మహిళలు భయపడని, విభజన శక్తుల ఆటలు కొనసాగని దేశం ఉండాలని అన్నారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌ మాట్లాడుతూ పన్నుల ద్వారా వసూలయిన సొమ్మును ప్రజలకు ఇవ్వడం ‘జీడీల సంస్కృతి’ కాదని చెప్పారు.


ప్రజల సొమ్ము ప్రజలకే ఇస్తున్నామని తెలిపారు. సన్నిహితుల రుణాల రద్దు చేయడం మాటేమిటని ప్రధానిని ప్రశ్నించారు. బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ ఇచ్చిన హామీ మేరకు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. దీంతో పాటుగా ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో మొత్తం 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించారు. ఏడాదిలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు. ఆర్‌ఎ్‌సఎస్‌ వ్యవస్థాపకుడు హెగ్డేవార్‌ పేరున శాశ్వత చిహ్నాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద ఇళ్లు లభించని వారికి ఇళ్లు ఇస్తామని చెప్పారు. గుజరాత్‌లో ప్రభుత్వ ఉద్యోగుల డీఏను మూడు శాతం పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ ప్రకటించారు. జాతీయ ఆహార భద్రత పథకం కింద సంక్షేమ పథకాలను విస్తరిస్తామని తెలిపారు. అస్సాంలో కోర్టులపై భారం తగ్గించడానికి సుమారు ఒక లక్ష చిన్న కేసులను ఉపసంహరించుకుంటామని ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ ప్రకటించారు. సోషల్‌ మీడియా పోస్టులపై పెట్టిన కేసులూ ఇందులో ఉండనున్నాయి. విద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాల్లో పలు పథకాలను ప్రకటించారు.

Updated Date - 2022-08-16T06:56:49+05:30 IST