Website: పట్టా మార్పిడికి ప్రత్యేక వెబ్‌సైట్‌

ABN , First Publish Date - 2022-09-24T13:45:25+05:30 IST

భూ పట్టా మార్పిడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌(Website) రూపొందించింది. ఈ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుంటే పట్టా మార్పిడి

Website: పట్టా మార్పిడికి ప్రత్యేక వెబ్‌సైట్‌

                                          - ప్రారంభించిన సీఎం


చెన్నై, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): భూ పట్టా మార్పిడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌(Website) రూపొందించింది. ఈ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుంటే పట్టా మార్పిడి సులువుగా పూర్తవుతుంది. పట్టా మార్పిడి జరిగిన తర్వాత దానికి సంబంధించిన ఉత్తర్వులను సులువుగా ఎలాంటి రుసుం చెల్లించకుండా డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలుంది. దీంతో పట్టాదారులు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. సచివాలయంలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ‘ఎంగిరుందాలుమ్‌- ఎన్నేరత్తిలుమ్‌’ (ఎక్కడనుంచైనా- ఏ సమయంలోనైనా) అనే పేరిట ఆన్‌లైన్‌ సేవకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శ్రీకారం చుట్టారు. ఈ సేవలకుగాను రూపొందించిన https://tamilnilam.tn.gov.in/citizen అనే  ప్రత్యేక వెబ్‌సైట్‌ను లాంఛనంగా ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా స్టాలిన్‌ మాట్లాడుతూ... ఇప్పటివరకూ పట్టా మార్పిడి కోసం స్థలం సొంతదారులు సాధారణ సేవా కేంద్రాలు (కామన్‌ సర్వీస్‌ సెంటర్స్‌),  రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలలో దరఖాస్తు చేసుకుంటే, వాటిని ఇంటర్‌నెట్‌లో పరిశీలించి పట్టా మార్పిడి ఉత్తర్వులను ఆన్‌లైన్‌లో పెట్టేవారని, ఈ పద్ధతిలో ఉన్న ఇబ్బందులు గుర్తించి ఇకపై ఎక్కడనుంచైనా ఏ సమయంలోనై వారు పట్టా మార్పిడిని సులువు గా చేసుకునేరీతిలో ఈ వెబ్‌సైట్‌ తీసుకువచ్చామన్నారు. ఇకపై పట్టా మార్పిడి కోసం ఈ వెబ్‌సైట్‌లో తెలిపిన ప్రకారమే తగిన రుసుం చెల్లించవచ్చన్నారు. రాష్ట్రాల్లో నగర ప్రాంతాలకు సంబంధించిన స్థలాల రిజిస్ట్రేషన్‌ వివరాలన్నీ 2014 నుంచి 2017 వరకూ కంప్యూటర్లలో పొందుపరచి వున్నాయని, వీటికి సంబంధించి పట్టాదారులు తమ స్థలాలకు సంబంధించిన ప్లానులు, వాటి వివరాలను 

https://eservices. tn.gov.in అనే వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడు చేసుకునే సదుపాయం ఉందని సీఎం వివరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి కేకేఎస్ఎస్ఆర్‌ రామచంద్రన్‌, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ జయంత్‌, సర్వేల శాఖ భూమిపన్నుల పథకం సంచాలకులు డాక్టర్‌ టీజీ వినయన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-24T13:45:25+05:30 IST