ప్రతిపక్షాల ఐక్యత ప్రయత్నాలు కాంగ్రెస్‌ సంస్థాగత ఎన్నికల తర్వాతే

ABN , First Publish Date - 2022-09-26T07:49:22+05:30 IST

జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేసే ప్రయత్నాలను కాంగ్రెస్‌ సంస్థాగత ఎన్నికల తర్వాత చేపట్టాలని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌లకు చెప్పారు.

ప్రతిపక్షాల ఐక్యత ప్రయత్నాలు కాంగ్రెస్‌ సంస్థాగత ఎన్నికల తర్వాతే

నితీశ్‌, లాలూప్రసాద్‌కు స్పష్టం చేసిన సోనియా

కాంగ్రెస్‌, కమ్యూనిస్టులతో కలిసి ప్రతిపక్ష కూటమి

కాంగ్రెస్‌ వ్యతిరేక పార్టీలు కూడా కలిసిరావాలి

ఐఎన్‌ఎల్‌డీ సభలో నితీశ్‌ ఎన్సీపీ, ఆర్జేడీ, అకాలీదళ్‌, సేన, 

సీపీఎం, ఎన్సీ నేతల హాజరు

కేసీఆర్‌, మమత గైర్హాజరు


న్యూఢిల్లీ, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేసే ప్రయత్నాలను కాంగ్రెస్‌ సంస్థాగత ఎన్నికల తర్వాత చేపట్టాలని ఆ పార్టీ అధ్యక్షురాలు  సోనియాగాంధీ బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌లకు చెప్పారు. అక్టోబరు రెండో వారంతో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఎన్నికలు పూర్తవుతాయని, ఆ తరువాత కొత్త అధ్యక్షుడితో ప్రతిపక్షాల ఐక్యత గురించి చర్చించాలని సూచించారు. నితీశ్‌, లాలూప్రసాద్‌ ఆదివారం సాయంత్రం సోనియాను ఆమె నివాసంలో కలుసుకున్నారు. దాదాపు గంటకు పైగా ఈ విషయంపై ఆమెతో చర్చించారు. అనంతరం నితీశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలన్నీ కలిసి పనిచేయాలనే అంశంపై సోనియాతో ఒక అవగాహన కుదిరిందని చెప్పారు. దేశానికి బీజేపీ నుంచి విముక్తి కల్పించాల్సిన అవసరం ఉందని లాలూ ప్రసాద్‌ అన్నారు. అంతకుముందు ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్‌డీ) వ్యవస్థాపకుడు చౌదరి దేవీలాల్‌ 109వ జయంతిని పురస్కరించుకొని హరియాణా మాజీ సీఎం ఓంప్రకాశ్‌ చౌతాలా ఆధ్వర్యంలో ఫతేహాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభకు నితీశ్‌తోపాటు పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నితీశ్‌ మాట్లాడుతూ.. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు సహా  విపక్షాలన్నీ కలిసి ప్రధాన ప్రతిపక్ష కూటమిగా ఏర్పడాలన్నారు. 


అన్ని పార్టీలూ కలిసిరావాలి..

బీజేపీ రాజకీయ లబ్ధి కోసం దేశంలో హిందూ, ముస్లింల మధ్య సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని నితీశ్‌ ఆరోపించారు. వీటికి అడ్డుకట్ట వేసి దేశ సమైక్యతను కాపాడేందుకు కాంగ్రెస్‌ వ్యతిరేక పార్టీలు కూడా కూటమిలో భాగంగా కాంగ్రె్‌సతో చేతులు కలపాల్సిన అవసరం ఉందన్నారు. అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ మాట్లాడుతూ.. ఎన్‌డీఏను శివసేన, జేడీయూ, తమ పార్టీ కలిసి ఏర్పాటు చేశామని అన్నారు. నిజమైన ఎన్‌డీఏ తమదేనని ప్రకటించారు. ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌, సీపీఎం కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్జేడీ నేత, బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వియాదవ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గైర్హాజరయ్యారు. 


కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో.. బెంగళూరులో రాహుల్‌ ఓటు

బెంగళూరు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ బెంగళూరులో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ‘భారత్‌ జోడో యాత్ర’ అక్టోబరులో మూడు వారాలపాటు కర్ణాటకలో కొనసాగనుంది. పోలింగ్‌ రోజైన 17న ఆయన యాత్రకు విరామం ఇవ్వనున్నారు. బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయంలో ఓటేస్తారు.  పాదయాత్ర మధ్యలో ఢిల్లీ వెళ్లేందుకు రాహుల్‌ సుముఖత చూపలేదని తెలుస్తోంది. 

Read more