Online Rummy: మళ్లీ ఆన్‌లైన్‌ రమ్మీ?

ABN , First Publish Date - 2022-11-29T08:23:25+05:30 IST

ఆన్‌లైన్‌ రమ్మీ(Online Rummy) వంటి జూదాలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అత్యవసర చట్టం (ఆర్డినెన్స్‌)కు ఆదివారంతో కాలం చెల్లింది. ఈ పరిస్థితుల్లో శాసనసభలో చేసిన చేసిన ముసాయిదా బిల్లుపై గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తీసుకో

Online Rummy: మళ్లీ ఆన్‌లైన్‌ రమ్మీ?

- ఆర్డినెన్స్‌కు చెల్లిన కాలం

- స్పందించని గవర్నర్‌

- ఇక అసెంబ్లీ బిల్లుపైనే ఆధారం

- రమ్మీ ఆత్మహత్యలకు గవర్నర్‌దే బాధ్యత: పీఎంకే

చెన్నై, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ రమ్మీ(Online Rummy) వంటి జూదాలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అత్యవసర చట్టం (ఆర్డినెన్స్‌)కు ఆదివారంతో కాలం చెల్లింది. ఈ పరిస్థితుల్లో శాసనసభలో చేసిన చేసిన ముసాయిదా బిల్లుపై గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తీసుకోనున్న నిర్ణయం కోసం అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీ వంటి జూదాలకు యువకులు, విద్యార్థులు, వ్యాపారులు బానిసలుగా మారి లక్షలాది రూపాయల అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. దీంతో డీఎంకే(DMK) సహా అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆన్‌లైన్‌ రమ్మీ వంటి జూదాలను నిషేధిస్తూ ప్రత్యేక చట్టం చేయాలని అన్ని పార్టీలు డిమాండ్‌ చేశాయి. ఆ మేరకు డీఎంకే ప్రభుత్వం గత నెల ఒకటిన ఆన్‌లైన్‌ రమ్మీని నిషేధిస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఆ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ ఆమోదానికి అదే రోజు పంపింది. గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) ఆర్డినెన్స్‌ పరిశీలించి వెంటనే ఆమోదం తెలిపారు. ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆర్డినెన్స్‌కు శాశ్వత చట్టం రూపం కల్పించే దిశగా చర్యలు చేపట్టింది. గత నెలలో జరిగిన శాసనసభ సమావేశాల్లో ‘ఆన్‌లైన్‌ క్రీడల నిషేధ నియంత్రణ బిల్లు 2022’ను ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదింపజేసింది. గత నెల 28న ఆ బిల్లును గవర్నర్‌ ఆమోదానికి పంపింది. ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపినట్లే ఈ శాశ్వత చట్టానికి కూడా గవర్నర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారని అధికార వర్గాలు భావించాయి. అయితే శాసనసభలో చేసిన బిల్లుకు సంబంధించి అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేస్తూ గవర్నర్‌ ప్రభుత్వం వివరణ కోరారు. ఈ నెల 24న గవర్నర్‌ నుంచి లేఖ వచ్చిన వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. 24 గంటల్లోపే ఆ సందేహాలకు సమాధానమిచ్చింది. ఇదిలా ఉండగా రాజ్యంగ ధర్మాసనం సెక్షన్‌ 213 (2) ఎ ప్రకారం ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసిన తర్వాత శాసనసభ సమావేశమైన రోజునుంచి ఆరువారాల్లోగా ఆ ఆర్డినెన్స్‌ గడువు ముగిసి చెల్లకుండా పోతుంది. ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ ఆర్డినెన్స్‌ గత నెల ఒకటిన జారీ కావటం, శాసనసభ గత నెల 17 సమావేశం కావటంతో ఆర్డినెన్స్‌కు ఉన్న కాలపరిమితి కాస్తా ఆదివారంతో ముగిసిపోయింది. ఆర్డినెన్స్‌ చెల్లకుండా పోవడంతో రాష్ట్రంలో మళ్ళీ ఆన్‌లైన్‌ రమ్మీ వంటి జూదాలు మళ్ళీ పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. శాసనసభ రూపొందించిన నిషేధ ముసాయిదాను గవర్నర్‌ ఆమోదిస్తే మినహా రాష్ట్రంలో మళ్లీ ఆన్‌లైన్‌ రమ్మీ వంటి క్రీడలు విజృంభించే అవకాశముందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో శాసనసభలో చేసిన ‘ఆన్‌లైన్‌ క్రీడల నిషేధ నియంత్రణ బిల్లు 2022’కు సంబంధించి గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అధికార డీఎంకే సహా అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఎదురుచూస్తున్నారు.

గవర్నర్‌ బాధ్యత వహించాల్సి ఉంటుంది

- పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ చట్టాన్ని తక్షణం ఆమోదించకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని పీఎంకే అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌ రమ్మీ వల్ల నష్టపోయి బాధితులు ఆత్మహత్య చేసుకుంటే అందుకు గవర్నర్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ రమ్మీ వంటి జూదాల వల్ల యువతీ యువకులు లక్షలాది రూపాయలు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఈ విషయంలో గవర్నర్‌ జాప్యం వహించడం భావ్యం కాదన్నారు.

ఆయన రాజకీయాలు చేయడం సరి కాదు: దురైమురుగన్‌

శాసనసభ రూపొందించిన బిల్లుల్ని ఆమోదించకుండా ఆలస్యం చేయడం గవర్నర్‌ హోదాకు ఏమాత్రం సరి కాదని రాష్ట్ర సీనియర్‌ మంత్రి దురైమురుగన్‌ వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం వేలూరులతో విలేఖరులతో మాట్లాడుతూ.. ఆర్డినెన్స్‌ కాలం ముగిసినందున గవర్నర్‌ తక్షణమే బిల్లుకు ఆమోదం తెలపాలని, లేకుంటే ఆన్‌లైన్‌ ఆటలు విజృంభిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా ఆయన స్పందించి ఆయన తగిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌ రాజ్యాంగాధిపతిగా కన్నా రాజకీయ వ్యక్తిగా వ్యవహరించడం వ్యవస్థలకు ఏమాత్రం సరి కాదని దురైమురుగన్‌ హితవు పలికారు.


Updated Date - 2022-11-29T08:25:04+05:30 IST