CM Stalin: ఆన్‌లైన్‌ రమ్మీపై నిషేధం దిశగా అడుగులు?

ABN , First Publish Date - 2022-08-19T14:13:53+05:30 IST

ఆన్‌లైన్‌ రమ్మీ పని పట్టేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే వివిధ స్థాయిల్లో సమావేశాలు

CM Stalin: ఆన్‌లైన్‌ రమ్మీపై నిషేధం దిశగా అడుగులు?

                               - సీఎం స్టాలిన్‌ సమాలోచన 


అడయార్‌(చెన్నై), ఆగస్టు 18: ఆన్‌లైన్‌ రమ్మీ పని పట్టేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే వివిధ స్థాయిల్లో సమావేశాలు నిర్వహించి, అభిప్రాయసేకరణ చేపట్టిన పోలీసులు.. గురువారం ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొన్నేళ్ళుగా ఆన్‌లైన్‌ రమ్మీ(Online Rummy) కారణంగా అప్పులపాలై అనేక మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్‌ రమ్మీకి బానిసలైన వారు ఆర్థికంగా కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. వారువీరు అని తేడాలేకుండా, పిన్నల నుంచి పెద్దల వరకు ఈ ఆన్‌లైన్‌ రమ్మీ బాధితుల్లో ఉన్నారు. అప్పులబారినపడిన కొందరు పిచ్చివారిగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ రమ్మీపై నిషేధం విధించాలన్న డిమాండ్లు రాష్ట్రంలో వచ్చాయి. అదేసమయంలో గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ఆన్‌లైన్‌ రమ్మీ(Online Rummy)ని నిషేధిస్తూ ఒక చట్టాన్ని తీసుకురాగా, అది సక్రమంగా లేదంటూ మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత ఆ చట్టంలోని లోపాలను గుర్తించి, మరింత పటిష్టంగా రూపొందించేలా న్యాయ సమీక్షను తట్టుకుని నిలబడేలా కొత్త చట్టాన్ని రూపొందించేందుకు వీలుగా ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) హైకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రూ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటుచేశారు. ఈ కమిటీ ఇటీవలే తన నివేదికను సమర్పించగా, అందులో ఆన్‌లైన్‌ రమ్మీని నిషేధించాలని సిఫార్సు చేసినట్టు సమాచారం. అలాగే, రాష్ట్ర ప్రజలు, యువత నుంచి కూడా ప్రభుత్వం అభిప్రాయ సేకరణ జరిపింది.. ఈ పరిస్థితుల్లో గురువారం ఉదయం సచివాలయంలో జరిగిన ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి హోం శాఖ కార్యదర్శి ఫణీంద్ర రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇందులో ఆన్‌లైన్‌ రమ్మీ(Online Rummy)పై నిషేధం విధిస్తూ అత్యవర చట్టాన్ని తీసుకొచ్చేలా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. జస్టిస్‌ చంద్రూ నేతృత్వంలోని కమిటీ సిఫారసు చేసిన సూచనల సాధ్యాసాధ్యాల అమలుపై ఈ సమావేశంలో చర్చించారు. 

Updated Date - 2022-08-19T14:13:53+05:30 IST