Covid Restrictions: 6 దేశాల ప్రయాణికులపై భారత్‌ కొవిడ్‌ ఆంక్షలు

ABN , First Publish Date - 2022-12-30T00:47:57+05:30 IST

కొవిడ్‌-19 కేసులు ఉధృతమవుతున్న ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై భారత్‌ ఆంక్షలు విధించింది. చైనా, హాంకాంగ్‌, జపాన్‌, దక్షిణ కొరియా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌ దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.

 Covid Restrictions: 6 దేశాల ప్రయాణికులపై   భారత్‌ కొవిడ్‌ ఆంక్షలు

చైనా, హాంకాంగ్‌, జపాన్‌, కొరియా, థాయ్‌లాండ్‌.. సింగపూర్‌

ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్‌ తప్పనిసరి

ప్రయాణానికి 72 గంటల ముందు టెస్ట్‌ చేయించాలి: కేంద్ర మంత్రి మాండవీయ

న్యూఢిల్లీ, డిసెంబరు 29: కొవిడ్‌-19 కేసులు ఉధృతమవుతున్న ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై భారత్‌ ఆంక్షలు విధించింది. చైనా, హాంకాంగ్‌, జపాన్‌, దక్షిణ కొరియా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌ దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు కొవిడ్‌-19 నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ గురువారం తెలిపారు. జనవరి1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందన్నారు. ‘‘ఈ ఆరు దేశాల నుంచి వచ్చే వారు ప్రయాణానికి 72 గంటల ముందు కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలి. నెగెటివ్‌ రిపోర్టును ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి’’ అన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ర్యాండమ్‌గా 2శాతం మందికి విమానాశ్రయాల్లోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. కాగా.. భారత్‌లో గురువారం ఉదయానికి (గడిచిన 24 గంటల్లో) 2.37 లక్షల పరీక్షలు నిర్వహించగా, 268 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయిందని.. పాజిటివిటీ రేటు 0.11శాతం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. బుధవారంతో పోలిస్తే 84 కేసు లు పెరిగాయని పేర్కొంది. గురువారం కేరళ, మహారాష్ట్రలకు చెందిన ఇద్దరు కొవిడ్‌తో మరణించినట్టు తెలి పింది. ప్రస్తుతం 3,552 యాక్టివ్‌ కేసులున్నట్లు పేర్కొం ది. బిహార్‌లో కరోనా కేసులు 10రెట్లు పెరిగాయని గత వారాంతంతో పోలిస్తే గురువారం 14 కేసులు నమోదైనట్లు అధికారులు వివరించారు. తాజ్‌మహల్‌ను సందర్శించిన ఓ విదేశీ టూరిస్టుకు కొవిడ్‌ పరీక్ష లో పాజిటివ్‌గాతేలింది. అతను పత్తాలేకుండా పోయాడని అధికారులు తెలిపారు.

చైనా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా

చెన్నై, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): చైనా నుంచి సింగపూర్‌ విమానం ద్వారా కోయంబత్తూర్‌కు వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సేలంకు చెందిన ఆ వ్యక్తి ఈ నెల 27న కోయంబత్తూర్‌ విమానాశ్రయానికి వచ్చాడు. కరోనా పరీక్షలు నిర్వహించగా లక్షణాలు కనిపించకపోవడంతో విమానాశ్రయ సి బ్బంది బయటకు పంపించారు. అయితే గురువారం వెలువడిన ఫలితాల్లో ఆ వ్యక్తికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది.

ఇతర దేశాల్లో..

చైనాలో కరోనా ఉధృతి కొనసాగుతుండగా.. జపాన్‌లో ఒక్కరోజులో 415 మరణాలు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే 2,16,219 కొత్త కేసులు రికార్డయ్యాయని, పాజిటివిటీ రేటు 4ుగా ఉందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే భారత్‌ సహా.. జపాన్‌, అమెరికా, తైవాన్‌, మలేసియా, సింగపూర్‌ దేశాలు చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్‌-19 నెగటివ్‌ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేశాయి. తాజాగా గురువారం ఇటలీ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ఐరోపా సమాఖ్య(ఈయూ) కూడా ఆంక్షలకు సిద్ధమవ్వాలని ఇటలీ కోరింది. దీనిపై ఈయూలో చర్చ జరిగినా.. చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు అక్కర్లేదని ప్రాథమికంగా నిర్ణయించాయి. ఇప్పటికే ఒమిక్రాన్‌, బీఎఫ్‌.7 వేరియంట్లు ఐరోపాలో ఉన్నాయని, వాటి ప్రభావం పెద్దగా లేనందునే ఆంక్షల యోచన చేయడం లేదని ఈయూ ప్రతినిధులు స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-30T02:06:06+05:30 IST