Sri Lanka New President: ‘ఓల్డ్ ఫాక్స్’ కోరుకున్నట్లే రణిల్ విక్రమసింఘే దేశాధ్యక్షుడయ్యారు!

ABN , First Publish Date - 2022-07-20T23:04:35+05:30 IST

శ్రీలంక నూతన అధ్యక్షునిగా రణిల్ విక్రమసింఘే విజయం సాధించారు

Sri Lanka New President: ‘ఓల్డ్ ఫాక్స్’ కోరుకున్నట్లే రణిల్ విక్రమసింఘే దేశాధ్యక్షుడయ్యారు!

కొలంబో : శ్రీలంక నూతన అధ్యక్షునిగా రణిల్ విక్రమసింఘే విజయం సాధించారు. ఆయన దేశాధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించడంతో ఓ ‘ఓల్డ్ ఫాక్స్’ కల నిజం అయింది. ఆయన కనీసం ఒక రోజు అయినా దేశాధ్యక్షునిగా పరిపాలన చేయాలని ఆ ఓల్డ్ ఫాక్స్ బలంగా కోరుకుంది. ఆ ఓల్డ్ ఫాక్స్ ఎవరో కాదు ఆయన అంకుల్, మాజీ దేశాధ్యక్షుడు జూనియస్ రిచర్డ్ జయవర్దనే. 


శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని, ప్రజలకు నిత్యావసరాలు సైతం అందుబాటులో లేని దుస్థితి ఎదురవడంతో పెద్ద ఎత్తున నిరసనలు పెల్లుబికాయి. చిట్టచివరికి దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స నివాసంలోకి నిరసనకారులు చొచ్చుకెళ్ళడంతో ఆయన దేశం విడిచి పారిపోయి, తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం దేశాధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రణిల్ విక్రమసింఘే విజయం సాధించారు. గొటబయ నేతృత్వంలోని శ్రీలంక పొదుజన పెరమున (ఎస్ఎల్‌పీపీ) మద్దతుతో ఆయన గెలిచారు.


శ్రీలంక అధ్యక్ష పదవిని అలంకరించాలని రణిల్ విక్రమసింఘే అనేక దశాబ్దాల నుంచి కోరుకుంటున్నారు. అదేవిధంగా ‘ఓల్డ్ ఫాక్స్’గా పేరు పొందిన మాజీ దేశాధ్యక్షుడు జూనియస్ రిచర్డ్ జయవర్దనే కూడా రణిల్‌ను కనీసం ఒక రోజు అయినా దేశాధ్యక్షునిగా చూడాలని కోరుకునేవారు. 


జూనియస్ జయవర్దనే  1978 నుంచి 1989 వరకు శ్రీలంక అధ్యక్షునిగా వ్యవహరించారు. ఆయన జిత్తులమారితనానికి పెట్టింది పేరు అని అంటూ ఉంటారు. అందుకే ఆయనను ‘ఓల్డ్ ఫాక్స్’ అని అంటారు. ఆయన మేనల్లుడు, ప్రస్తుత దేశాధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ఆయన కన్నా గొప్ప చతురుడు, నేర్పరి అని విమర్శకులు చెప్తున్నారు. అంతర్గతంగా ఘర్షణల్లో చిక్కుకున్న అధికార నెట్‌వర్క్‌లను ఒడుపుగా నడిపించగలరని అంటున్నారు. 


రణిల్ విక్రమసింఘేను రాజకీయాల్లోకి తీసుకొచ్చినవారు జేఆర్ జయవర్దనే (Junius Richard Jayavadane). 1977లో డిప్యూటీ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్‌ పదవిని విక్రమసింఘేకు జయవర్దనే ఇచ్చారు. వీరి పార్టీ పేరు యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ). అయితే దీనిని అంకుల్ అండ్ నెవ్యూ పార్టీ అని కామెంటేటర్లు జోకులు వేసేవారు. ఇదిలావుండగా, జయవర్దనే కుటుంబ సభ్యులు తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, విక్రమసింఘే కనీసం ఒక రోజు అయినా దేశాధ్యక్షుడు కావాలని జయవర్దనే అనేవారని చెప్పారు. 


శ్రీలంకలో తాజా సంక్షోభం ముదరడంతో ప్రధాన మంత్రి పదవికి మహీంద రాజపక్స (Mahinda Rajapaksa) రాజీనామా చేసిన అనంతరం రణిల్ విక్రమసింఘేను ప్రధాన మంత్రి పదవిలో గొటబయ రాజపక్స మే నెలలో నియమించారు. రాజపక్స కుటుంబీకులు గత రెండు దశాబ్దాల్లో అత్యధిక కాలం అధికారంలో ఉన్నారు. 


పార్టీకి ఉన్న ఏకైక ఎంపీ దేశాధ్యక్షుడయ్యారు

విక్రమసింఘే 1999లోనూ, 2005లోనూ జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూశారు. 2020లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ఆయన పార్టీ యూఎన్‌పీ  ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది. కేవలం ఆయన మాత్రమే ఎంపీగా గెలిచారు. అయినప్పటికీ సంక్షోభం నుంచి అవకాశాలను సృష్టించుకుంటూ, దేశాధ్యక్ష పీఠాన్ని అధిష్టించారు. 


గొటబయతో కుమ్మక్కు

విక్రమసింఘేకు గొటబయ రాజపక్స (Gotabaya Rajapaksa) నేతృత్వంలోని ఎస్ఎల్‌పీపీ మద్దతిచ్చిన నేపథ్యంలో నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ కుమ్మక్కు అయిపోయి, గొటబయ కుటుంబ ప్రయోజనాలను కాపాడుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే నిరసనకారులు మళ్లీ వీథుల్లోకి వస్తే విక్రమసింఘే విరుచుకుపడతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 


ఆస్తులు పాఠశాలలకు విరాళం

విక్రమసింఘేపై పాశ్చాత్య సంస్కృతి ప్రభావం ఉంది. ఆయన మైత్రి అనే ఇంగ్లిష్ లెక్చరర్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి సంతానం లేదు. తమ ఆస్తులు తాము చదువుకున్న పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకు చెందాలని వీలునామా రాశారు. ఆయన నివాసంలో 2,500కుపైగా పుస్తకాలు ఉండేవి. ఇదే తన అతి పెద్ద సంపద అని ఆయన అంటూ ఉంటారు. గొటబయ రాజపక్స నివాసంలోకి చొచ్చుకెళ్లినట్లుగానే ఆయన నివాసాన్ని కూడా నిరసనకారులు తగులబెట్టారు. దీంతో ఆ పుస్తకాలు కూడా కాలిపోయాయి. 


రూకీ రిపోర్టర్‌గా 

విక్రమసింఘే రాజకీయ సంబంధాలుగల, పుస్తక ప్రచురణలు, ప్లాంటేషన్స్ వంటి వ్యాపారాల్లో పాతుకుపోయిన సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆ కుటుంబం నడిపే పత్రికల్లో ఒకదానిలో రూకీ రిపోర్టర్‌గా తన జీవితాన్ని ప్రారంభించారు. 


ప్రపంచంలో తొలి మహిళా ప్రధాన మంత్రిగా రికార్డు సృష్టించిన సిరిమా బండారనాయికే (Sirima Bandarunaike) నేతృత్వంలోని ప్రభుత్వం 1973లో విక్రమసింఘే కుటుంబ సంస్థను జాతీయం చేసింది. అనంతరం ఆయన లీగల్ కెరీర్‌ను ప్రారంభించారు. ఆయన ఓసారి ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, లేక్ హౌస్‌ను స్వాధీనం చేసుకుని ఉండకపోతే, తాను పాత్రికేయుడిని అయి ఉండేవాడినని తెలిపారు. కాబట్టి తనను రాజకీయాల్లోకి పంపించినది బండారునాయికేయేనని అన్నారు. 


1993 మేలో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు రణసింఘే ప్రేమదాస (Ranasinghe Premadasa) ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయారు. అనంతరం విక్రమసింఘే ప్రధాన మంత్రి పదవిని చేపట్టారు. అప్పటి ప్రధాన మంత్రి డింగిరి బండ విజేతుంగ దేశాధ్యక్షుడయ్యారు. అప్పట్లో విక్రమసింఘే పరిశ్రమలు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా ఉండేవారు. 


సానుభూతి ఓట్లతో...

1999లో జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో విక్రమసింఘే ప్రధాన ప్రత్యర్థి చంద్రిక కుమారతుంగ (Chandrika Kumaratunga)పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఆమె తాను కోల్పోయిన కుడి కంటిపై కట్టుతో టీవీలో కనిపించి, సానుభూతి ఓట్లు సంపాదించారు. దీంతో ఆమె విజయం సాధించారు. అసలు ఈ ఎన్నికల్లో గెలుపు విక్రమసింఘేదేనని చాలా మంది ఊహించారు. కానీ అలా జరగలేదు. 


నిష్కళంకుడే కానీ...

శ్రీలంక రాజకీయాలు అవినీతిమయం. అయితే విక్రమసింఘే దాదాపు నిష్కళంక చరితుడే. కానీ 2015-19 మధ్య ఆయన ప్రధాన మంత్రిగా పని చేసిన కాలంలో సెంట్రల్ బ్యాంక్ బాండ్స్‌ (Central Bank Bonds)కు సంబంధించిన ఇన్‌సైడర్ ట్రేడింగ్ కుంభకోణం జరిగింది. అప్పట్లో సెంట్రల్ బ్యాంక్ చీఫ్ ఆయనకు అత్యంత సన్నిహితుడే. మరోవైపు అవినీతి, నిధుల దుర్వినియోగం ఆరోపణల్లో చిక్కుకున్న రాజపక్స కుటుంబీకులను విక్రమసింఘే కాపాడారని కూడా ఆరోపణలు ఉన్నాయి. 


మరిన్ని కష్టాలు రాబోతున్నాయి

ప్రస్తుతం దివాలా తీసిన దేశానికి నాయకత్వ బాధ్యతలను విక్రమసింఘే చేపట్టారు. నిత్యావసరాలను దిగుమతి చేసుకోవడానికి సైతం నిధులు అందుబాటులో లేని పరిస్థితులు ఉన్నాయి. ఆయన పాశ్చాత్య విధానాలకు అనుకూలుడని, స్వేచ్ఛా మార్కెట్ సంస్కణవాది అని పేరు తెచ్చుకున్నారు. ఇది ఈ సమయంలో ఉపయోగపడే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF), విదేశీ రుణదాతలతో ఉద్దీపన ప్యాకేజీల కోసం చర్చల్లో ఉపయోగపడుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. కానీ ఆయన మాత్రం ఇప్పటికే ఓ హెచ్చరిక చేశారు. మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నందువల్ల ఇప్పటికిప్పుడు సత్వర పరిష్కారం రాబోదని ఇటీవల పార్లమెంటుకు స్పష్టం చేశారు. మరింత దయనీయ పరిస్థితి రాబోతోందని చెప్పారు. మనం దివాలా తీశామని, అత్యధిక ద్రవ్యోల్బణం ఉందని, మరింత దారుణమైన ద్రవ్యోల్బణం రాబోతోందని హెచ్చరించారు. 


Updated Date - 2022-07-20T23:04:35+05:30 IST