హైకోర్టుల్లో స్థానిక భాషల అమలుకు అడ్డంకులు

ABN , First Publish Date - 2022-04-24T07:52:56+05:30 IST

భాషాపరమైన అడ్డంకులు తొలగించడం, న్యాయస్థానాల్లో ఖాళీల భర్తీ, మౌలిక సదుపాయాలు కల్పనకు తాను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చర్యలు చేపడుతున్నానని జస్టిస్‌ రమణ అన్నా రు.

హైకోర్టుల్లో స్థానిక భాషల అమలుకు అడ్డంకులు

ఈ సమస్యకు త్వరలో పరిష్కారం.. సామాన్యులకు సత్వర న్యాయం.. సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ ఆకాంక్ష


చెన్నై, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): భాషాపరమైన అడ్డంకులు తొలగించడం, న్యాయస్థానాల్లో ఖాళీల భర్తీ, మౌలిక సదుపాయాలు కల్పనకు తాను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చర్యలు చేపడుతున్నానని జస్టిస్‌ రమణ అన్నా రు. హైకోర్టుల విచారణలో స్థానిక భాషలను స్వీకరించకుండా కొన్ని అడ్డంకులున్నాయని, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు పురోగతితో, ఈ సమస్యలకు సమీప భవిష్యత్తులో కచ్చితంగా పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నానన్నారు. మద్రాసు హైకోర్టులో నిర్మించే 9 అంతస్థుల పరిపాలనా భవన సముదాయానికి ఎన్వీ రమణ శనివారం శంకుస్థాపన చేశారు. నామక్కల్‌ జిల్లాలో ఉమ్మడి న్యాయస్థాన భవనాలను, జ్యూడీషియల్‌ ఆఫీసర్స్‌ క్వార్టర్స్‌ను, విల్లుపు రం జిల్లా శంకరాపురంలో నిర్మించిన ఉమ్మడి న్యాయస్థానాల భవనాలు జ్యుడీషియల్‌ ఆఫీసర్స్‌ క్వార్టర్స్‌ను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. సామాన్యులకు సైతం సత్వర న్యాయం అందించడమే న్యాయమూర్తుల ప్రధాన కర్తవ్యమన్నా రు. అవసరమైతే సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాంతీయ భాషలను కూడా ఉపయోగించుకోవచ్చన్నారు. ఆపద సమయంలో ప్రజలు న్యాయవ్యవస్థ వైపు చూస్తారని, న్యాయస్థానాల ద్వారా తమ హక్కులకు పరిరక్షణ లభిస్తుందని వారు బలంగా విశ్వసిస్తున్నారని వ్యాఖ్యానించారు. అందుకే న్యాయవ్యవస్థ పనితీరును ఎలా మెరుగుపరచుకోవాలి? ప్రజలకు ఎలా చేరువవ్వాలి? వారి న్యాయ అవసరాలను ఎలా తీర్చాలనే విషయాలను ఆలోచించడం అవసరమన్నారు.

మద్రాసు హైకోర్టు వెలువరించే తీర్పులు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ న్యాయస్థానాలపై ప్రభావం చూపుతుంటాయన్నారు. సుప్రీంకోర్టు బెంచ్‌ను చెన్నైలో ఏర్పాటు చేయాలని తమిళనాడు సీఎం స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు. ఏపీలోని ఓ కుగ్రామంలో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించినా, నేడు దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయాధిపతిగా దేశ ప్రజల మనసాక్షికి ప్రతీకగా ఎన్వీ రమణ నిలిచారని కొనియాడారు. అందుకే ఆయన తీర్పులు గుర్తింపు తెచ్చుకున్నాయన్నారు. 


ఆన్‌లైన్‌ విచారణలు కొనసాగిస్తాం 

దేశంలోని సుదూర ప్రాంతాలకు చెందిన న్యాయవాదుల సౌలభ్యం కోసం సుప్రీంకోర్టులో ఆన్‌లైన్‌ విచారణలు కొనసాగించాలని నిర్ణయించినట్లు జస్టిస్‌ ఎన్వీ రమణ చెప్పారు. అత్యున్నత న్యాయస్థానంలోని సహచర న్యాయవాదులతో చర్చించిన తర్వాత సోమ, శుక్రవారాల్లో ఆన్‌లైన్‌ విచారణల కొనసాగింపుపై నిర్ణయం తీసుకున్నామన్నారు.   


తెలుగువారు మూలాలను మర్చిపోవద్దు 

మాతృభాషతో సహా ఏదో ఒక భాషను నేర్చుకోవడం వ్యక్తి అభివృద్ధికి దోహదపడుతుందని జస్టిస్‌ రమణ అన్నారు. చెన్నైలో శనివారం నిర్వహించిన ప్రపంచ తెలుగు సమాఖ్య (డబ్ల్యూటీఎఫ్‌) 29వ వార్షికోత్సవంలో ఆయన ప్రసంగించారు. తెలుగు నేర్చుకొని, మాట్లాడాలని, మాతృభాషను నేర్చుకున్నా జీవితంలో పైకి రావచ్చన్నారు. 


తాత్కాలిక ఉద్యోగి పోస్టులో మళ్లీ అలాంటి వారే వద్దు: సుప్రీంకోర్టు

తాత్కాలిక ఉద్యోగి పోస్టులో మరో తాత్కాలిక ఉద్యోగిని నియమించడానికి వీల్లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆ పోస్టులో నియామక ప్రక్రియ ద్వారా ఎంపికైన శాశ్వత ఉద్యోగినే తప్ప మరొకరిని నియమించాల్సిన అవసరం లేదని జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ల ధర్మాసనం తీర్పు చెప్పింది. వారినే కొనసాగించాల్సి ఉంటుందని తెలిపింది. ‘‘టెస్ట్‌ మ్యాచ్‌ నుంచి 20-20 ఫార్మాట్‌కు మారాం. 3గంటల నిడివి ఉన్న సినిమా కంటే తక్కువ వ్యవధి వినోదాన్ని ఇష్టపడుతున్నాం. ఫిల్టర్‌ కాఫీ నుంచి ఇన్‌స్టెంట్‌ కాఫీకి మారాం. ప్రస్తుత ఇన్‌స్టెంట్‌ నూడుల్స్‌ యుగంలో ప్రజలు తక్షణ న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే తక్షణ న్యాయం కోసం ప్రయత్నించే క్రమంలో నిజమైన న్యాయం ప్రమాదంలో పడుతుందని వారు గుర్తించడం లేదు.’’ 

- సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

Read more