మానవ హక్కుల పరిరక్షకులకు శాంతి నోబెల్‌

ABN , First Publish Date - 2022-10-08T08:54:14+05:30 IST

యూరప్‌ ఖండంలో చివరి నియంతగా పేరొందిన బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న మానవ హక్కుల కార్యకర్త అలెస్‌ బియాలియాట్స్కి (60)తో పాటు..

మానవ హక్కుల పరిరక్షకులకు శాంతి నోబెల్‌

పౌర హక్కుల కోసం కృషి చేస్తున్న బెలారస్‌వాసి అలెస్‌కు, 

రష్యా, ఉక్రెయిన్‌ హక్కుల సంస్థలకు ప్రకటించిన కమిటీ


స్టాక్‌హోం, అక్టోబరు 7: యూరప్‌ ఖండంలో చివరి నియంతగా పేరొందిన బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న మానవ హక్కుల కార్యకర్త అలెస్‌ బియాలియాట్స్కి (60)తో పాటు.. రష్యా, ఉక్రెయిన్‌ దేశాలకు చెందిన హక్కుల సంస్థలు మెమోరియల్‌, సెంటర్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీ్‌సను ఈ ఏటి శాంతి నోబెల్‌ పురస్కారం వరించింది. ‘‘ఇరుగుపొరుగు దేశాలైన బెలారస్‌, రష్యా, ఉక్రెయిన్‌లో మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, శాంతియుత సహజీవనం కోసం కృషి చేస్తున్న ముగ్గురు అద్భుతమైన చాంపియన్లను ఈ పురస్కారంతో గౌరవించాలని నిర్ణయించాం’’ అని నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీ చైర్‌ బెరిట్‌ రీస్‌ ఆండెర్సెన్‌ తెలిపారు.


మానవ విలువలు, సైనిక వ్యతిరేకత, న్యాయసూత్రాలకు అనుకూలంగా అలెస్‌, ఆ రెండు సంస్థలు చేసిన కృషి.. దేశాల మధ్య శాంతి, సౌభ్రాతృత్వాలు వెల్లివిరియాలన్న అల్ర్ఫెడ్‌ నోబెల్‌ దార్శనికతకు కొత్త చైతన్యాన్ని ఇచ్చేలా, గౌరవించేలా ఉందని ఆమె కొనియాడారు. ‘‘బెలారస్‌ ప్రభుత్వ వర్గాలు అలెస్‌ నోరు మూయించడానికి పదేపదే ప్రయత్నించాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా, మానవహక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన అంగుళమైనా వెనక్కి తగ్గలేదు’’ అని ప్రశంసించారు. అలె్‌సను ఇప్పటికైనా జైలు నుంచి విడుదల చేయాలని బెలారస్‌ ప్రభుత్వానికి బెరిట్‌ విజ్ఞప్తి చేశారు. బెలారస్‌ సర్కారు తమ విజ్ఞప్తిని మన్నించి ఆయన్ను విడుదల చేస్తుందని.. ఆయన ఓస్లోకు వచ్చి నోబెల్‌ శాంతి పురస్కారాన్ని తీసుకుంటారని ఆమె ఆకాంక్షించారు. ఈ నోబెల్‌ అలెస్‌ ఒక్కరికే కాక.. బెలార్‌సలో జైల్లో మగ్గిపోతున్న రాజకీయ ఖైదీలందరికీ ఇచ్చినట్టుగా భావిస్తున్నామని  విపక్ష నేత పావెల్‌ లతుష్కో పేర్కొన్నారు. అలెగ్జాండర్‌ లుకషెంకో (బెలారస్‌ అధ్యక్షుడు) నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడి, కచ్చితంగా గెలిచే స్ఫూర్తిని తమకు ఈ పురస్కారం ఇస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక.. తన భర్తకు శాంతి నోబెల్‌ ప్రకటించడం పట్ల అలెస్‌ భార్య నటాలియా సంతోషం వ్యక్తం చేశారు. 


ఎవరికీ వ్యతిరేకం కాదు..

ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై పుతిన్‌ మొదలుపెట్టిన యుద్ధం నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్‌ దేశాలకు చెందిన హక్కుల సంస్థలకు.. ఈ యుద్ధంలో పుతిన్‌కు సహకరిస్తున్న లుకషెంకోను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న హక్కుల కార్యకర్తకు నోబెల్‌ కమిటీ ఈ పురస్కారాన్ని ప్రకటించడం గమనార్హం. అందునా పుతిన్‌ 70వ పుట్టినరోజునాడు ప్రకటించడమంటే నోబెల్‌ కమిటీ ఆయన చర్యలను తీవ్రంగా ఖండించడమేనని కొందరు అభివర్ణిస్తున్నారు. అయితే, ఆయా సంస్థలకు నోబెల్‌ ప్రకటించడమంటే అది పుతిన్‌ను వ్యతిరేకించడం కాదని బెరిట్‌ స్పష్టం చేశారు. ‘‘మేమెప్పుడూ ఒక లక్ష్యం కోసం కృషి చేసినవారికి ఇస్తాం తప్ప.. ఒకరికి వ్యతిరేకంగా ఇవ్వం’’ అని స్పష్టం చేశారు. కాగా.. హక్కుల కార్యకర్తల అణచివేతను ఆపాలని నోబెల్‌ కమిటీ పుతిన్‌కు సూచించింది. 


ఎవరీ అలెస్‌ బియాలియాట్స్కి?

1994 నుంచి బెలార్‌సను ఉక్కుపిడికిట బంధించి పాలిస్తున్న అలెగ్జాండర్‌ లుకషెంకో నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న హక్కుల కార్యకర్త అలెస్‌ బియాలియాట్స్కి (60). నియంత పాలనలో బాధితులకు అండగా నిలిచేందుకు 1996లో ‘వియాస్నా హ్యూమన్‌ రైట్స్‌ సెంటర్‌’ను అలెస్‌ బియాలియాట్స్కి స్థాపించారు. జైలుపాలైన హక్కుల కార్యకర్తలకు, వారి కుటుంబాలకు సాయం అందించారు. రాజకీయ ఖైదీలపై హింసను ఎప్పటికప్పుడు ఆధారాలతో సహా అక్షరబద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో 2011లో ఆయన్ను అరెస్టు చేసి మూడేళ్లపాటు ఖైదులో ఉంచారు. మళ్లీ, గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికలను లుకషెంకో రిగ్గింగ్‌ చేశారంటూ ప్రజాస్వామికవాదులంతా పోరాటాలు చేసినప్పుడు వారికి అండగా నిలిచిన అలె్‌సను గత ఏడాది జైల్లో పెట్టారు. ప్రస్తుతం కారాగారంలోనే ఉన్నారు. 

Read more