మానవ పరిణామంపై పరిశోధనలకు నోబెల్‌

ABN , First Publish Date - 2022-10-04T09:41:00+05:30 IST

మానవ పరిణామంపై విశేష పరిశోధనలు చేసిన స్వీడన్‌ శాస్త్రవేత్త స్వాంటే పాబో 2022 సంవత్సరానికి వైద్య రంగంలో నోబెల్‌ ప్రైజ్‌ దక్కించుకున్నారు.

మానవ పరిణామంపై పరిశోధనలకు నోబెల్‌

  • వైద్య రంగంలో స్వీడన్‌ శాస్త్రవేత్త 
  • స్వాంటే పాబోకు పురస్కారం
  • నియాండర్తల్‌ జాతి డీఎన్‌ఏ విశ్లేషణ
  • ఆధునిక మానవులతో సహజీవనం
  • తద్వారా మన రోగ నిరోధక వ్యవస్థపై
  • నియాండర్తల్‌ జన్యువుల ప్రభావం
  • కరోనాను అర్థం చేసుకోవడంలోనూ 
  • పాత్ర: నోబెల్‌ కమిటీ
  • పాబో తండ్రి సూనె బెర్జ్‌స్ట్రోమ్‌కు 
  • 1982లో వైద్యశాస్త్రంలోనే నోబెల్‌!

స్టాక్‌హోం, అక్టోబరు 3: మానవ పరిణామంపై విశేష పరిశోధనలు చేసిన స్వీడన్‌ శాస్త్రవేత్త స్వాంటే పాబో 2022 సంవత్సరానికి వైద్య రంగంలో నోబెల్‌ ప్రైజ్‌ దక్కించుకున్నారు. లక్షల ఏళ్ల కిందట అంతరించిపోయిన నియాండర్తల్‌ జాతితో ఆధునిక మానవ జాతికున్న సంబంధం, రోగనిరోధక వ్యవస్థపై ఆయన చేసిన పరిశోధనలకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. పాబో తండ్రి సూనె బెర్జ్‌స్ర్టోమ్‌కు 1982లో వైద్యరంగంలోనే నోబెల్‌ దక్కడం విశేషం. నియాండర్తల్‌, డెనిసోవన్‌ జాతుల జన్యువులతో ప్రస్తుత మానవ జాతి జన్యువులను పోల్చుతూ పాబో పరిశోధనలు చేశారు. నియాండర్తల్‌ జాతితో ఆధునిక మానవులు కలిసి జీవించినట్లు ఆయన నిరూపించారు. ఈ క్రమంలో ఇరు జాతుల కలయిక ద్వారా పిల్లలు కూడా పుట్టినట్లు తెలియజేశారు. సుమారు 8 లక్షల ఏళ్ల కిందట ఇది జరిగినట్లు పాబో పరిశోధనల్లో తేలింది. నియాండర్తల్‌  జన్యువుల కలయిక ద్వారా ఆధునిక మానవుల్లో ప్రత్యేక రోగనిరోధక వ్యవస్థ ఏర్పడింది. కరోనా వైరస్‌ లాంటి ఇన్ఫెక్షన్లకు మన రోగ నిరోధక వ్యవస్థ స్పందించిన తీరుపై కూడా ఈ జన్యువుల ప్రభావం ఉందని నోబెల్‌ కమిటీ పేర్కొంది. తన పరిశోధనల్లో భాగంగా జన్యు విశ్లేషణకు సంబంధించి ఆధునిక పద్ధతులను పాబో కనుక్కున్నట్లు నోబెల్‌ కమిటీకి నేతృత్వం వహించిన అనా వెడెల్‌ పేర్కొన్నారు. 67 ఏళ్ల స్వాంటే పాబో జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్‌ మ్యూనిక్‌, మ్యాక్స్‌ ప్లాంక్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఎవొల్యూషనరీ ఆంత్రోపాలజీలో పరిశోధనలు చేశారు.  నోబెల్‌ విజేతలకు సుమారు రూ.7.4 కోట్ల నగదు బహుమతి అందుతుంది. ఈ ఏడాది డిసెంబరు 10న విజేతలకు బహుమతులను ప్రదానం చేస్తారు. స్వీడన్‌కు చెందిన ఆల్ర్ఫెడ్‌ నోబెల్‌ జ్ఞాపకార్థం ఏటా ఈ పురస్కారాలను అందజేస్తారు. 

Read more