క్వాంటమ్‌ సైన్స్‌లో పరిశోధనలకు నోబెల్‌

ABN , First Publish Date - 2022-10-05T09:40:56+05:30 IST

భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి ముగ్గురిని వరించింది. ఫ్రాన్స్‌, అమెరికా, ఆస్ట్రియాకు చెందిన శాస్త్రవేత్తలు అలెన్‌ ఆస్పెక్ట్‌, జాన్‌ ఎఫ్‌ క్లాసర్‌, ఆంటోన్‌ జెలింగర్‌లకు సంయుక్తంగా ఈ పురస్కారం దక్కింది. క్వాంటమ్‌ ఇన్ఫర్మేషన్‌

క్వాంటమ్‌ సైన్స్‌లో పరిశోధనలకు నోబెల్‌

భౌతిక శాస్త్రంలో ముగ్గురికి పురస్కారం

ఫ్రాన్స్‌, అమెరికా, ఆస్ట్రియా శాస్త్రవేత్తలు

ఆస్పెక్ట్‌, క్లాసర్‌, జెలింగర్‌కు సంయుక్తంగా..

వీరి పరిశోధనలు మరో ప్రపంచానికి 

మార్గం చూపాయి: నోబెల్‌ కమిటీ

ఫ్రాన్స్‌, అమెరికా, ఆస్ట్రియా శాస్త్రవేత్తలకు సంయుక్తంగా అవార్డు


స్టాక్‌హోం, అక్టోబరు 4: భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి ముగ్గురిని వరించింది. ఫ్రాన్స్‌, అమెరికా, ఆస్ట్రియాకు చెందిన శాస్త్రవేత్తలు అలెన్‌ ఆస్పెక్ట్‌, జాన్‌ ఎఫ్‌ క్లాసర్‌, ఆంటోన్‌ జెలింగర్‌లకు సంయుక్తంగా ఈ పురస్కారం దక్కింది. క్వాంటమ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌లో చేసిన కృషికి గాను వీరికి అవార్డును అందజేస్తున్నట్లు నోబెల్‌ కమిటీ సభ్యురాలు ఎవా ఓల్సన్‌ మంగళవారం తెలిపారు. ఫోటాన్లలో చిక్కుముడులపై, క్వాంటమ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌పై చేసిన అద్భుత ప్రయోగాలకు గాను వీరిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. రెండు కణాలు విడిపోయి, చాలా దూరంలో ఉన్నప్పుడు కూడా అవి అనుసంధానమై పనిచేస్తాయన్న విషయాన్ని వీరు కనుగొన్నారు. ‘‘క్వాంటమ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ అనేది వేగంగా అభివృద్ధి చెందుతున్న అంశం.


భద్రంగా సమాచారాన్ని బదిలీ చేయడం, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, సెన్సింగ్‌ టెక్నాలజీలో అపార అవకాశాలు ఉన్నాయి. తాజా పరిశోధనా ఫలితాలు మరో ప్రపంచానికి మార్గం చూపాయి’’ అని ఎవా ఓల్సన్‌  కొనియాడారు. కాగా, తనకు నోబెల్‌ పురస్కారం వచ్చినట్లు తెలుసుకొని ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు లోనైనట్లు వియన్నా వర్సిటీకి చెందిన జెలింగర్‌ తెలిపారు. క్లాసర్‌ (79) క్వాంటమ్‌ సిద్ధాంతాలను అభివృద్ధి చేశారని ఆ సిద్ధాంతాలను ఆస్పెక్ట్‌ (75) సరి చేశారని జెలింగర్‌ (77) క్వాంటమ్‌ టెలిపోర్టేషన్‌ పేరిట సుదూర ప్రాంతాలకు సమాచారాన్ని అత్యంత భద్రంగా ఎలా చేరవేయవచ్చో చూపారని నోబెల్‌ కమిటీ వివరించింది. ఇక గత ఏడాది కూడా భౌతికశాస్త్రంలో నోబెల్‌ను ముగ్గురు శాస్త్రవేత్తలకు అందజేయడం విశేషం. సుకురో మనాబే, క్లాస్‌ హాసిల్‌మన్‌, జార్జియో పారిసీలు సంయుక్తంగా ఈ బహుమతి అందుకున్నారు. పారిసీకి సగం పురస్కారాన్ని ఇవ్వగా.. మిగతా సగాన్ని సుకురో, హాసిల్‌మన్‌ పంచుకున్నారు.

Read more