Monkeypox: ప్రజలు ఆందోళన చెందకండి.. మంకీపాక్స్‌పై కేంద్ర ప్రభుత్వం తాజాగా ఏం చెప్పిందంటే..

ABN , First Publish Date - 2022-07-27T05:21:36+05:30 IST

మంకీపాక్స్‌పై దేశ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం మంకీపాక్స్ వ్యాప్తిపై అప్రమత్తంగానే ఉందని..

Monkeypox: ప్రజలు ఆందోళన చెందకండి.. మంకీపాక్స్‌పై కేంద్ర ప్రభుత్వం తాజాగా ఏం చెప్పిందంటే..

న్యూఢిల్లీ: మంకీపాక్స్‌పై దేశ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం మంకీపాక్స్ వ్యాప్తిపై అప్రమత్తంగానే ఉందని నీతి ఆయోగ్ సభ్యులు వీకే పాల్ చెప్పారు. భారత్‌లో ఇప్పటివరకూ నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదు కావడంతో ప్రజలు ఈ వ్యాధి గురించి భయానికి లోనవుతున్న ప్రస్తుత తరుణంలో వీకే పాల్ ఈ ప్రకటన చేశారు. అయితే.. ఎవరిలోనైనా మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే రిపోర్ట్ చేయాలని ఆయన సూచించారు. అమెరికాలో మంకీపాక్స్ మహమ్మారి కలవరపాటుకు గురిచేస్తోంది. ఇప్పటివరకూ అమెరికాలో 3,487 మంకీపాక్స్ కేసులు నమోదు కావడం గమనార్హం. విదేశాల నుంచి వచ్చేవారిలో మంకీపాక్స్ లక్షణాలు ఉన్నాయో, లేవో గుర్తించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు వీకే పాల్ తెలిపారు. దేశవ్యాప్తంగా మంకీపాక్స్‌ కేసులను నిర్ధారించేందుకు 15 లాబొరేటరీలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. 


ఇదిలా ఉండగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా కూడా ప్రకటించింది. మంకీ పాక్స్‌ అంత ప్రమాదకరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి ఇతరులకు వ్యాపించే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత రోగిని నాలుగు వారాల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలని సూచించారు.



వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే ప్రమాదముందని, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయని వివరించారు. ఇవే లక్షణాలు మంకీపాక్స్‌ ఉన్న వారిలో ఉంటాయని తెలిపారు. మెడ భాగం, చంకలు, గజ్జల్లో బిళ్లలు కట్టడమనేది ఈ వ్యాధి ప్రత్యేకతని వెల్లడించారు. రోగికి అతి దగ్గరగా ఉన్న వారికి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు తెలిపారు. వ్యాధి సోకిన వ్యక్తి నోటి నుంచి వచ్చే తుంపర్లు, దుస్తులు, వాడే వస్తువులను నుంచి ఈ వ్యాధి సోకుతుందని వెల్లడించారు. చిన్నపిల్లలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, గర్భిణులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. స్మాల్‌ పాక్స్‌ వ్యాధికి, మంకీపాక్స్‌ వ్యాధికి దగ్గర సారూప్యత ఉందని తెలిపారు.


వ్యాధి లక్షణాలు

మంకీపాక్స్‌ సోకిన వ్యక్తికి 1 నుంచి 2 వారాలు జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, అలసిపోవడం లాంటి లక్షణాలు ఉంటాయి. చంకలు, మెడ భాగం, గజ్జల్లో బిళ్లలు కట్టడం ఈ వ్యాధి ప్రత్యేక లక్షణం రోగికి లక్షణాలు పెరిగేకొద్ది ముఖం, చేతులు, ఛాతీ భాగాల్లో చిన్న చిన్న పొక్కులు కనిపిస్తాయి. తర్వాత వాటి స్థానంలో గోతులు ఏర్పడతాయి.


మంకీపాక్స్‌ అంత ప్రమాదకరం కాదు

ఈ వ్యాధి అంత ప్రమాదకరం కాదు. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత రోగిని నాలుగు వారాల పాటు ఐసొలేషన్‌లో ఉంచాలి. పీపీఈ కిట్లు, మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. ఈ వ్యాధికి సంబంధించి మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. వైద్యుల పర్యవేక్షణలో ఉండి మందులు వాడితే తొందరగా కోలుకుంటారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు వ్యాధి లక్షణాలు ఉంటే దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవడం మంచిది.

Updated Date - 2022-07-27T05:21:36+05:30 IST