విపక్ష నేతలపైనే ఈడీ పడగ

ABN , First Publish Date - 2022-07-28T08:01:27+05:30 IST

నాటి బీజేపీ ఆక్రందనలైనా.. ఇప్పుడు కాంగ్రెస్‌, సహా 15 పార్టీల ఆగ్రహమైనా..

విపక్ష నేతలపైనే ఈడీ పడగ

అధికార పార్టీలో ఉంటే పరిశుద్ధులే!

కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా ఇదే తీరు

యూపీఏ హయాంలో రాజకీయ కేసులు

ప్రతిపక్షాల్లోని కీలక నేతలపైనే కన్ను

యూపీఏ హయాంతో పోలిస్తే మోదీ

పాలనలో 5 రెట్లు పెరిగిన ఫెమా కేసులు

దీన్ని ప్రశ్నిస్తూ సుప్రీంలో 250 పిటిషన్లు


అధికార పార్టీలో ఉంటే పరిశుద్ధులే!.. కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా ఇదే తీరు


ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఎన్‌ఐఏ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దారుణంగా దుర్వినియోగం చేస్తోంది. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం.

- 2011లో నాటి యూపీఏ సర్కారుపై అప్పటి 

బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్‌ ప్రసాద్‌ ఆగ్రహం

రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని వారిపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి, వాటిని దుర్వినియోగం చేయడం ద్వారా మోదీ సర్కారు కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోంది.

- దేశంలోని విపక్ష పార్టీల ఆగ్రహం

నగదు అక్రమ చలామణీని నిరోధక చట్టాన్ని (పీఎంఎల్‌ఏ) విచక్షణరహితంగా వాడుతున్నారు. మరీ రూ.వంద, వెయ్యి అక్రమాలకు కూడా ఈ చట్టాన్ని ప్రయోగిస్తూ పోతే దాని విలువ నీరుగారిపోతుంది.

- గత డిసెంబరులో ఈడీపై సీజేఐ జస్టిస్‌ రమణ వ్యాఖ్యలు


నాటి బీజేపీ ఆక్రందనలైనా.. ఇప్పుడు కాంగ్రెస్‌, సహా 15 పార్టీల ఆగ్రహమైనా.. గత ఏడాది చివర్లో సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలైనా.. చెప్పే విషయం ఒక్కటే! వ్యవస్థల దుర్వినియోగం!! సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం విషయంలో ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్న తేడాఏమీ లేదు. అన్నింటిదీ అదే దారి. 2004-2014 నడుమ యూపీఏ సర్కారు విపక్ష నేతలను ఇబ్బంది పెట్టడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తే.. ‘అతడి కంటె ఘనుడు ఆచంట మల్లన్న’ అన్నట్టు మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ఆ దుర్వినియోగాన్ని పరాకాష్టకు తీసుకెళ్లిందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు ఇటీవలే లిఖిత పూర్వకంగా సమర్పించిన గణాంకాలే ఇందుకు నిదర్శనం. ఈడీ కేసులకు సంబంధించి జనతాదళ్‌ (యునైటెడ్‌) నేత, ఎంపీ రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ అడిగిన ఒక ప్రశ్నకు..  కేంద్ర ఆర్థిక శాఖ సమాధానం ఇచ్చింది. దాని ప్రకారం.. గడిచిన పదేళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఫెమా (విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం, 1999) కింద 24,893 కేసులు.. నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ, 2022) కింద 3,985 కేసులు నమోదు చేసింది. 2014-15లో ఫెమా చట్టం కింద దర్యాప్తునకు స్వీకరించిన కేసులు 915 ఉండగా.. 2021-22లో  ఆ కేసుల సంఖ్య 5,313కు చేరాయి. పీఎంఎల్‌ఏ కింద దర్యాప్తు చేసిన కేసులు 2014-15 ఆర్థిక సంవత్సరంలో 178 మాత్రమే ఉండగా.. 2021-22లో ఆ సంఖ్య 1180కి చేరింది. మొత్తంగా ఈడీ దర్యాప్తు చేసిన కేసులు 2014-15లో 1,093 ఉండగా.. 2021-22లో ఆ సంఖ్య 5,493కు చేరింది. మరీ ముఖ్యంగా.. మోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చి, అమిత్‌ షా కేంద్ర హోం మంత్రిగా పగ్గాలు చేపట్టాక పీఎంఎల్‌ఏ కేసులు ఆరు రెట్లు పెరిగాయి. 2018-19లో పీఎంఎల్‌ఏ కింద 195 కేసులు నమోదు కాగా.. 2021-22 నాటికి ఆ సంఖ్య 1180కి చేరింది. 


నేర నియంత్రణ మంచిదే.. కానీ..

నగదు అక్రమ చలామణీని, విదేశీ మారకద్రవ్య చట్టాల ఉల్లంఘనలను మాత్రమే కాదు.. ఎలాంటి నేరాన్నైనా అడ్డుకోవడం.. నేరాలకు పాల్పడేవారిని ఉక్కుపాదంతో అణచివేయడం మంచిదే. ఏ ప్రభుత్వం అలా చేసినా అభినందించాల్సిందే. కానీ.. ఏ ప్రభుత్వమూ ఈ విషయంలో నిష్పక్షపాతంగా ఉండకపోవడమే అసలు సమస్య. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా.. అధికార పక్ష నేతల విషయంలో ఈ వ్యవస్థలన్నీ చూసీ చూడనట్టు వ్యవహరించడం, అధికార పార్టీ నేతల రాజకీయ ప్రత్యర్థుల విషయంలో మాత్రం దర్యాప్తు సంస్థలు ఎక్కడ లేని ఉత్సాహంతో, వేగంతో పనిచేయడం పరిపాటిగా మారింది. ఉదాహరణకు.. యూపీఏ హయాంలో మధు కోడా కేసు, 2జీ కుంభకోణం, ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ కేసు, కామన్‌వెల్త్‌ క్రీడల కుంభకోణం, సహారా కేసు వంటివాటిలో ఈడీ చురుగ్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అలాగే.. 2010లో నాటి బీజేపీ నేత అమిత్‌ షా విషయంలో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తే.. ఇప్పుడు ఈడీ నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియా, రాహుల్‌ గాంధీ వెంట పడుతోంది.


అలాగే.. 16 కోట్ల మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి ఢిల్లీ మంత్రి సత్యేంద్రజైన్‌ను ఈడీ అరెస్టు కూడా చేసింది. ఈ సత్యేంద్రజైన్‌.. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎలక్షన్‌ ఇన్‌చార్జ్‌. ఈ ఏడాది చివర్లో ఆ రాష్ట్రశాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ చుక్కలన్నీ కలుపుకొంటూ పోతే.. సత్యేంద్రజైన్‌ అరెస్టు వెనుక పైకి కనపడని ఎజెండాలేవో ఉన్నాయని ఎవరైనా అనుమానిస్తే తప్పు లేదు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలోనూ.. కాంగ్రెస్‌ సంపన్న నేత డీకే శివకుమార్‌ ఈడీ నిఘాలోనే ఉన్నారు. అయితే.. ఈడీ వర్గాలు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నాయి. అధికారపార్టీకి చెందినవారు తప్పు చేసినా తాము రంగంలోకి దిగుతామని చెబుతున్నాయి. 2020లో సూరత్‌లో బీజేపీ నేత పీవీఎస్‌ శర్మను రూ.2.7 కోట్ల కుంభకోణంలో అరెస్టు చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నాయి. అయితే, అలాంటివి చాలా అరుదని.. దాడులన్నీ ఎక్కువగా విపక్ష నేతలపైనే జరుగుతున్నాయని, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు బీజేపీలో చేరితే ఈడీ వారి జోలికి వెళ్లట్లేదని విమర్శకులు అంటున్నారు. శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముకుల్‌రాయ్‌, హిమంత విశ్వ శర్మ బీజేపీలోకి చేరంగానే పరిశుద్ధులైపోయినట్టు..


ఈడీ వారివైపు చూడడమే మానేసిందని గుర్తుచేస్తున్నారు. వ్యాపం కుంభకోణాన్ని బయటపెట్టిన విజిల్‌ బ్లోయర్స్‌లో 40 మంది అంతుచిక్కని రీతిలో మరణించారు. కానీ.. ఆ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌చౌహాన్‌కు సీబీఐ క్లీన్‌చిట్‌ ఇచ్చేయడం గమనార్హం.  యూపీఏ హయాంలో బాబా రాందేవ్‌పై ఫెమా ఉల్లంఘన కింద కేసులు పెట్టిన ఈడీ.. 2014లో మోదీ సర్కారు వచ్చిన ఆర్నెల్లలోపే వాటిని మూసేయడం కాకతాళీయం కాదు.


కస్టడీపైనే దృష్టి..

నిందితులపై అభియోగాలను నిరూపించడం మీద కన్నా, వారిని కస్టడీలోకి తీసుకోవడం మీదే ఈడీ ఎక్కువగా దృష్టిసారిస్తోందన్నది విమర్శకులు చేస్తున్న మరో ఆరోపణ. ఎన్సీపీ నేతలు అనిల్‌ దేశ్‌ముఖ్‌, నవాబ్‌ మాలిక్‌, పంజాబ్‌లో చరణ్‌ జిత్‌ చన్నీ మేనల్లుడు భూపీందర్‌ సింగ్‌ హనీ, కాంగ్రెస్‌ నేతలు చిదంబరం (100 రోజులకు పైగా ఈడీ కస్టడీలో ఉన్నారు), డీకే శివకుమార్‌ (దాదాపు 80 రోజులు ఈడీ కస్టడీలో ఉన్నారు), మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఛగన్‌ భుజ్‌బల్‌ (రెండేళ్లకుపైగా) వంటివారే ఇందుకు ఉదాహరణ. ఈ క్రమంలోనే.. పీఎంఎల్‌ఏ కింద ఈడీ అధికారాలను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో దాదాపు 250 పిటిషన్లు దాఖలయ్యాయి. 

- సెంట్రల్‌ డెస్క్‌


15 ఏళ్లలో ఇద్దరు.. 8 నెలల్లో 9 మంది!


పీఎంఎల్‌ఏ కింద వేలాది కేసులు నమోదు చేసినా.. ఈడీ ఈ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్నవారిని దోషులుగా నిరూపించింది చాలా తక్కువ. ఇలాంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొనేవారు హైప్రొఫైల్‌ వ్యక్తులు కావడం.. న్యాయప్రక్రియ సుదీర్ఘంగా ఉండడమే ఇందుకు కారణం. గణాంకాల ప్రకారం.. పీఎంఎల్‌ఏ అమల్లోకి వచ్చిన 2002 నుంచి 2017 నడుమ నమోదైన కేసుల్లో దోషులుగా తేలినవారు కేవలం ఇద్దరు. ఆ ఇద్దరూ కూడా 2017లో దోషులుగా తేలినవారే. వారిలో ఒకరు ఝార్ఖండ్‌ మంత్రి హరినారాయణ్‌రాయ్‌. ఆయనకు ఏడేళ్ల జైలు, రూ.3.7 కోట్ల జరిమానా కోర్టు విధించింది. రెండో వ్యక్తి కోల్‌కతాకు చెందిన అల్లావుద్దీన్‌. ఒక మాదకద్రవ్యాల కేసులో అతడికి కోర్టు ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించింది. కానీ.. 2019లో ఏప్రిల్‌- నవంబరు నడుమ ఎనిమిది నెలల్లో ఈడీ 9 మందిని దోషులుగా నిరూపించడం గమనార్హం.

Read more