నితీశ్‌ను రాష్ట్రపతి అభ్యర్థిని చేస్తాం

ABN , First Publish Date - 2022-02-23T08:16:49+05:30 IST

రానున్న రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌ కీలక వ్యాఖ్యలు చేశారు...

నితీశ్‌ను రాష్ట్రపతి అభ్యర్థిని చేస్తాం

బీజేపీతో  ఆయన బంధం తెంచుకుంటేనే: ఎన్సీపీనేత నవాబ్‌

ముంబై, ఫిబ్రవరి 22: రానున్న రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధినేత నితీశ్‌ కుమార్‌.. బీజేపీతో బంధం తెంచుకుంటే ఆయన్ను విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. ఈ అంశంలో వివిధ పార్టీలు ఉమ్మడిగా ఓ నిర్ణయం తీసుకుంటాయని స్పష్టం చేశారు. ఇక.. 2024లో బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలన్ని కలిసి ఓ ఫ్రంట్‌గా ఏర్పడేందుకు ఇప్పటికే అడుగులు పడ్డాయన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, మహా వికాస్‌ అగాధీ కూటమి నేతలతో చర్చలు జరిపారన్నారు.  కాంగ్రెస్‌ లేకుండా బీజేపీ వ్యతిరేక కూటమి సాధ్యం కాదని తెలిపారు. మరోవైపు.. మాలిక్‌ వ్యాఖ్యలు బిహార్‌ రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. తన మనసులో ప్రస్తుతం అటువంటి ఉద్దేశం ఏమీ లేదని నితీశ్‌ చెప్పినప్పటికీ.. రాష్ట్రపతి పదవికి ఆయన అర్హుడా కాదా అన్న అంశంపై వివిధ పార్టీలు స్పందించాయి. ఓ హత్యానేరంలో నిందితుడు రాష్ట్రపతి ఎలా అవుతారని ఆర్జేడీ నేత, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తనయుడు తేజస్వి యాదవ్‌ ప్రశ్నించారు. ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ తివారీ మాత్రం.. ఒక బిహరీ దేశ అత్యున్నత పదవిని చేపడితే తాను చాలా సంతోషిస్తామన్నారు. రాష్ట్రపతి పదవికి నితీశ్‌ యోగ్యుడని బిహార్‌ మాజీ సీఎం జతిన్‌ రాం మాంఝీ కితాబిచారు.

Updated Date - 2022-02-23T08:16:49+05:30 IST