తదుపరి టార్గెట్‌ కవితే?

ABN , First Publish Date - 2022-10-11T10:16:56+05:30 IST

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బోయినపల్లి అభిషేక్‌రావు అరెస్టు నేపథ్యంలో తదుపరి టార్గెట్‌ ఎవరనే చర్చ ఊపందుకుంది.

తదుపరి టార్గెట్‌ కవితే?

ఢిల్లీలో ఊపందుకున్న ప్రచారం

అభిషేక్‌ ద్వారా వివరాలు రాబట్టనున్న సీబీఐ!

అప్రూవర్‌గా మారనున్న రామచంద్ర పిళ్లై?

అతనిచ్చే సమాచారంతో టీఆర్‌ఎస్‌ నేతల గుట్టురట్టు?


న్యూఢిల్లీ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బోయినపల్లి అభిషేక్‌రావు అరెస్టు నేపథ్యంలో తదుపరి టార్గెట్‌ ఎవరనే చర్చ ఊపందుకుంది. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమెపై బీజేపీ నేతలు ఢిల్లీలో విలేకరుల సమావేశం పెట్టి మరీ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో అభిషేక్‌రావును సీబీఐ అరెస్టు చేయడంతో తదుపరి టార్గెట్‌ కవితేనన్న చర్చ ఢిల్లీలో జరుగుతోంది. సీబీఐ కస్డడీలో ఉన్న అభిషేక్‌..


అధికారుల విచారణలో ఇచ్చే సమాధానాల ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగనుంది. కవిత ప్రమేయం గురించి అభిషేక్‌ ద్వారా సీబీఐ వాంగ్మూలాన్ని రికార్డు చేసే అవకాశం ఉందని న్యాయవాద వర్గాలు భావిస్తున్నాయి. తద్వారా కవితతో పాటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె బంధువు శరణ్‌రెడ్డి తదుపరి టార్గెట్‌ అయ్యే అవకాశముంది. వారికి కూడా నోటీసులు జారీ చేసి, విచారించే అవకాశాలు లేకపోలేదని న్యాయవర్గాలు చెబుతున్నాయి. పిళ్లై సీబీఐకి అప్రూవర్‌గా మారే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అతని ద్వారా కవితతో పాటు పలువురు టీఆర్‌ఎస్‌ నేతల గుట్టురట్టు చేయాలని సీబీఐ భావిస్తున్నట్లు సమాచారం. అభిషేక్‌రావు కవిత తరఫున ఢిల్లీలో లావాదేవీలు నిర్వహించారని, ఎవరెవరికి డబ్బులు ముట్టాయన్న సమాచారం ఆయనకు స్పష్టంగా తెలుసునని సీబీఐ వర్గాలు అంటున్నాయి. కవితపై ఆరోపణలు వస్తున్నా.. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌తో పాటు టీఆర్‌ఎ్‌సలో ఇతర ముఖ్యులెరూ ఎందుకు స్పందించడం లేదన్న చర్చ జరుగుతోంది. ఈ కేసులో టీఆర్‌ఎస్‌ నేతలే కాకుండా ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ సహా నేతలు కేంద్రం తీరుపై ధ్వజమెత్తుతున్నారు. కానీ, టీఆర్‌ఎస్‌ వర్గాల నుంచి కనీస స్పందన రాకపోవడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీజేపీపై యుద్ధం ప్రకటించానంటున్న సీఎం కేసీఆర్‌.. నేరుగా కవితపైనే ఆరోపణలు వచ్చినా ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదని, ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-10-11T10:16:56+05:30 IST