శ్రీలంక నూతన ఆర్థిక మంత్రి రాజీనామా

ABN , First Publish Date - 2022-04-05T19:32:59+05:30 IST

శ్రీలంక ఆర్థిక మంత్రిగా సోమవారం బాధ్యతలు చేపట్టిన అలీ సబ్రీ మంగళవారం

శ్రీలంక నూతన ఆర్థిక మంత్రి రాజీనామా

కొలంబో : శ్రీలంక ఆర్థిక మంత్రిగా సోమవారం బాధ్యతలు చేపట్టిన అలీ సబ్రీ మంగళవారం రాజీనామా చేశారు. దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స సోదరుడు బసిల్ రాజపక్స స్థానంలో సబ్రీ ఈ పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే. సోమవారం మంత్రివర్గంలో చేరినవారిలో దినేశ్ గుణవర్దన, జాన్‌స్టన్ ఫెర్నాండో, జీఎల్ పెయిరిస్ ఉన్నారు. 


వీరిలో దినేశ్ గుణవర్దనకు విద్యా శాఖ, జాన్‌స్టన్‌కు హైవేలు, పెయిరిస్‌కు విదేశీ వ్యవహారాల శాఖలను అప్పగించారు. శ్రీలంక కేబినెట్ ఆదివారం మూకుమ్మడిగా రాజీనామా చేసింది. కొద్ది గంటల్లోనే ఈ నలుగురు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన మంత్రి మహీంద రాజపక్స కుమారుడు నమల్ రాజపక్స కూడా యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి పదవికి రాజీనామా చేశారు. 


శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అజిత్ నివార్డ్ కబ్రాల్ సోమవారం తన పదవికి రాజీనామా సమర్పించారు. ఈ బ్యాంక్ తదుపరి గవర్నర్‌గా పీ నందలాల్ వీరసింఘేను నియమించాలని రాజపక్స నిర్ణయించారు. ఈ ఆఫర్‌ను నందలాల్ అంగీకరించారు. 


శ్రీలంకలో అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో సమైక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రతిపక్షాలను సోమవారం ఆహ్వానించారు. మంత్రి పదవులు స్వీకరించి, ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి కలిసికట్టుగా కృషి చేద్దామని చెప్పారు. దేశాధ్యక్షుని మీడియా డివిజన్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ప్రస్తుత సంక్షోభానికి కారణాలను వివరించారు. అనేక ఆర్థిక, అంతర్జాతీయ అంశాల వల్ల సంక్షోభం ఏర్పడిందని తెలిపారు. ఆసియాలో ప్రధాన ప్రజాస్వామిక దేశంగా శ్రీలంక ఈ సమస్యను ప్రజాస్వామ్యబద్ధంగానే పరిష్కరించుకోవాలని పేర్కొంది. 


అయితే సమైక్య ప్రభుత్వంలో చేరేందుకు ప్రతిపక్షాలు సోమవారం తిరస్కరించాయి. ఇది అర్థం లేని ప్రతిపాదన అని, వట్టి బూటకమని ఆరోపించాయి. రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. 



Updated Date - 2022-04-05T19:32:59+05:30 IST