Rajasthan: నాయకత్వ మార్పు ఊహాగానాలపై గెహ్లాట్ ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2022-09-26T01:41:18+05:30 IST

రాజస్థాన్‌లో నాయకత్వ మార్పు ఊహాగానాలపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆదివారంనాడు పరోక్ష..

Rajasthan: నాయకత్వ మార్పు ఊహాగానాలపై గెహ్లాట్ ఏమన్నారంటే..

జైపూర్: రాజస్థాన్‌లో నాయకత్వ మార్పు ఊహాగానాలపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆదివారంనాడు పరోక్ష సంకేతాలిచ్చారు. ''కొత్త జనరేషన్‌కు అవకాశాలు లభించాలి'' అని జైసల్మేర్‌లో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. 40 ఏళ్లుగా రాజ్యంగ పదవులు నిర్వహిస్తూ వచ్చానని చెబుతూ నాయకత్వ మార్పు అనివార్యమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. గెహ్లాట్ వారసుడిగా సచిన్ పైలట్‌ను రాజస్థాన్ సీపీఎం కాంగ్రెస్ ఎంపిక చేయనుందనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో గెహ్లాట్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


జైసల్మేర్‌లో తనోత్ మాతా ఆలయంలో గెహ్లాట్ ఆదివారంనాడు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో కూడా తాను ఒక మాట చెప్పాననీ, 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ 40 ఏళ్లుగా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో పని చేశానని, ఇంతకంటే కావాల్సినది ఏమీ లేదని చెప్పారు. ఫలానా పదవే కావాలనే కోరికేమీ తనకు లేదన్నారు. కొత్త జనరేషన్‌కు అవకాశాలు రావాలని, అందరూ కలిసి దేశానికి మంచి నాయకత్వం ఇవ్వాలని అన్నారు. కాంగ్రెస్ చేతుల్లో ఉన్న పెద్ద రాష్ట్రం రాజస్థాన్ అని, వచ్చే ఎన్నికల్లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ గెలుపు చాలా ముఖ్యమని, ఆ విషయాన్ని కూడా తాను గత ఆగస్టులో అధిష్ఠానం దృష్టికి తెచ్చారని చెప్పారు. రాష్ట్ర తదుపరి బడ్జెట్‌పై అడిగినప్పుడు, తదుపరి సీఎం ఎవరైనప్పటికీ యువత, విద్యార్థులపై దృష్టిసారించే విధంగా బడ్జెట్ ఉంటుందని ఆయన సమాధానమిచ్చారు.


పైలట్ వెర్సస్ జోషి

గెహ్లాట్ స్థానంలో ముఖ్యమంత్రి పదవికి సచిన్ పైలట్ ప్రధాన పోటీదారుగా ఉన్నారు. అయితే, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు జోషి పేరు కూడా ప్రచారంలో ఉంది. 2008లో సీపీం పదవిని జోషి ఆశించినప్పటికీ కేవలం ఒక్క ఓటు తేడాతో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కాగా, ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని గెహ్లాట్ తొలిసారిగా గత శుక్రవారం ప్రకటించారు. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పార్టీ చీఫ్ పదవికి పోటీ చేసేది లేదని రాహుల్ గాంధీ తనకు చాలా స్పష్టంగా చెప్పినట్టు ఆయన తెలిపారు. రాజస్థాన్ సీఎంగా తన వారసుడెవరనేది సోనియాగాంధీనే నిర్ణయిస్తారని కూడా గెహ్లాట్ తెలిపారు.


Read more