Cong president poll campaign: పెద్ద నాయకుల మద్దతు ఎప్పుడూ కోరుకోలేదు: శిశథరూర్

ABN , First Publish Date - 2022-10-04T22:23:58+05:30 IST

కాంగ్రెస్ పెద్ద నాయకులు తనకు మద్దతు ఇవ్వాలని ఎప్పుడూ అనుకోలేదని, ఇప్పటికీ అనుకోవడం లేదని ..

Cong president poll campaign: పెద్ద నాయకుల మద్దతు ఎప్పుడూ కోరుకోలేదు: శిశథరూర్

తిరువనంతపురం: కాంగ్రెస్ పెద్ద నాయకులు తనకు మద్దతు ఇవ్వాలని ఎప్పుడూ అనుకోలేదని, ఇప్పటికీ అనుకోవడం లేదని ఆ పార్టీ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ (Shashi tharoor) అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ పడుతున్న శశిథరూర్ ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రచారం సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన కేరళలో ప్రచారం సాగిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడి పదవిలో ఉన్న మల్లికార్జున్ ఖర్గేకు తాను మద్దతిస్తున్నట్టు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు కె.సుధాకరన్ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో శశిథరూర్ కేరళ పర్యటన  ప్రాధాన్యం సంతరించుకుంది.


''పార్టీ పెద్ద నాయకులు నాకు మద్దతు ఇవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పడూ అంతే. నాగపూర్, వార్దా, హైదరాబాద్‌లో పార్టీ కార్యకర్తలను కలుసుకున్నారు. వాళ్లంతా ఒకప్పుడు నన్ను పోటీ చేయమన్నారు. వెనకడుగు వేయవద్దని చెప్పారు. నేను కూడా వెనక్కి తగ్గేది లేదని వారికి హామీ ఇచ్చారు. నాకు సపోర్ట్‌గా నిలిచిన వారి నమ్మకాన్ని నేను ఇంతవరకూ వమ్ము చేయలేదు. నామీద వారికున్న ఆ నమ్మకమే నా బలం కూడా''అని శశిథరూర్ అన్నారు. తనకు మద్దతిస్తున్న వారిలో యువకులు, పార్టీ కార్యకర్తలు ఎక్కువగా ఉన్నారని, అయినప్పటికీ తనకు అందరి మద్దతు అవసరమని చెప్పారు.


ఖర్గేకు బహిరంగంగా కె.సుధాకరన్ మద్దతివ్వడంపై అడిగినప్పుడు, జనం మనసుల్లో ఏముందో తనకు తెలియదని, అయితే ఎవరు బహిరంగంగా చెప్పినా, రహస్యంగా చెప్పినా సీక్రెట్ బ్యాలెట్ ద్వారానే ఎన్నుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఎవరు ఎవరికి ఓటు వేస్తారో ఎవరికీ తెలియదని, జనం వారివారి నమ్మకాలు, ఆలోచనలను బట్టే ఓటు వేస్తారని అన్నారు. ఎవరైతే పార్టీని పటిష్టం చేయగలరని అనుకుంటారో, ఎవరైతే పార్టీ ఎదుర్కొనే భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోగలరని అనుకుంటారో వారికే జనం ఓటు వేస్తారని అన్నారు. అభ్యర్థుల ప్రచారంలో పాల్గొనరాదని పార్టీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రచారం చేయాలనుకున్న వ్యక్తులు తమ సంస్థాగత పదవులకు రాజీనామా  చేయాలని పార్టీ ఎన్నికల అథారిటీ స్పష్టం చేసిందని చెప్పారు.


కాగా, అక్టోబర్ 17న పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు పోలింగ్  జరుగుతుంది. 19న కౌంటింగ్ జరిపి అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. 9,000 మందికి పైగా పీసీసీ డెలిగేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Updated Date - 2022-10-04T22:23:58+05:30 IST