చీతాలకు పేర్లు పెట్టండి!

ABN , First Publish Date - 2022-09-26T08:07:14+05:30 IST

నమీబియా నుంచి తీసుకువచ్చిన చీతాలకు పేర్లు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సూచించారు.

చీతాలకు పేర్లు పెట్టండి!

కాంపిటీషన్‌లో పాల్గొనండి.. గెలిస్తే చీతాలను చూసే తొలి చాన్స్‌


‘మన్‌కీ బాత్‌’లో ప్రధాని

న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: నమీబియా నుంచి తీసుకువచ్చిన చీతాలకు పేర్లు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సూచించారు. దీనికిగాను పోటీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇక, ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని తగ్గిద్దామని, ముఖ్యంగా ప్లాస్టిక్‌ సంచుల స్థానంలో ప్రత్యామ్నాయ సంచులను వినియోగిద్దామని.. ప్రస్తుత పండుగల సీజన్‌లో ఆ దిశగా సంకల్పం చెప్పుకొందామని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి నెలా చివరి ఆదివారం తన మనసులోని భావాలను ప్రజలతో పంచుకునే ప్రధాని ‘మన్‌ కీబాత్‌’ కార్యక్రమంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్లాస్టిక్‌ వినియోగానికి నో చెబుదాం. గుడ్డ, జనపనార, వెదురు, అరటితో తయారు చేసిన సంచులను వినియోగించుకుందాం’’ అని పిలుపునిచ్చారు. బహుమతులకు చుట్టే కవర్లను కూడా పర్యావరణానికి అనుకూలమైన వాటినే వినియోగించాలని సూచించారు. కాగా, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లోని విమానాశ్రయానికి షహీద్‌ భగత్‌ సింగ్‌ పేరు పెట్టనున్నట్టు ప్రధాని తెలిపారు. భగత్‌ సింగ్‌కు నివాళిగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. సెప్టెంబరు 28న.. సర్జికల్‌ స్ట్రయిక్‌ వార్షికోత్సవంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. అదేరోజు భగత్‌సింగ్‌ జయంతిని ఘనంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. దేశ క్రీడారంగం అనేక విజయాలను సొంతం చేసుకుని వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు. 


చీతాలు చూసే అవకాశం మీదే..

చీతాలు భారత్‌లో అడు గు పెట్టడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, గర్వంగా భావిస్తున్నారని తెలిపారు. చీతాలు ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్‌ పర్యవేక్షణలో ఉన్నాయని.. ప్రజల సందర్శనపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. చీతాలకు పేరు పెట్టే అవకాశాన్ని ప్రజలకు కల్పిస్తున్నామని ప్రధాని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు తగిన విధంగా చీతాలకు పేర్లు సూచించాలని విజ్ఞప్తి చేశారు. మంచి పేరు సూచించిన వారిని ఎంపిక చేసి.. చీతాలను చూసే తొలి అవకాశం కల్పిస్తామన్నారు. అయితే.. ఇప్పటికే ఈ చీతాలను ఆశా, సియాయా, ఓబాన్‌, సిబిలి, సియాసా, సవన్న, శశా, ఫ్రెడ్డీ అనే ముద్దుపేర్లతో పిలుస్తున్నారు. వీటిలో ‘ఆశా’ పేరు స్వయంగా ప్రధాని మోదీ పెట్టిందే.  

Updated Date - 2022-09-26T08:07:14+05:30 IST