Chief Minister MK Stalin: నల్లకన్నుకు ‘తంగతగసాలై’ అవార్డు

ABN , First Publish Date - 2022-08-16T13:59:22+05:30 IST

వివిధ రంగాల్లో విశిష్ఠసేవలందించిన ప్రముఖులకు, సేవా సంస్థలకు సోమవారం జార్జ్‌కోట వద్ద జరిగిన స్వాతంత్య్ర దిన వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి

Chief Minister MK Stalin: నల్లకన్నుకు ‘తంగతగసాలై’ అవార్డు

- విశిష్ట సేవా పురస్కారాలు

- ఇలంజిముత్తుకు ‘కలాం అవార్డు’

- ఎళిల్‌ అరసికి ‘కల్పనా చావ్లా’ పురస్కారం


చెన్నై, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): వివిధ రంగాల్లో విశిష్ఠసేవలందించిన ప్రముఖులకు, సేవా సంస్థలకు సోమవారం జార్జ్‌కోట వద్ద జరిగిన స్వాతంత్య్ర దిన వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) అవార్డులను, నగదు పురస్కారాలను అందజేశారు. సీపీఐ సీనియర్‌ నేత నల్లకన్నుకు తంగతగసాలై అవార్డుతో పాటు రూ.10లక్షల చెక్కును, ప్రశంసాపత్రాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ అందజేశారు. నల్లకన్ను ఆ చెక్కు అందుకున్న తర్వాత తాను తీసుకువచ్చిన రూ.5వేల చెక్కు కలిపి మొత్తం రూ.10.లక్షల ఐదు వేలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయడంతో సభికులంతా హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. ఇదే విధంగా పాళయంకోట సెయింట్‌ జేవియర్‌ కళాశాలలోని జేవియర్‌ పరిశోధనా సంస్థ సంచాలకులు ఆచార్య ఎస్‌. ఇలంజిముత్తు(Acharya S. Ilanzimuthu)కు ఏపీజే అబ్దుల్‌కలాం అవార్డును నగదు పురస్కారాన్ని, నాగపట్టినం జిల్లాకు చెందిన పి.ఎళిల్‌ అరసికి కల్పనాచావ్లా అవార్డును, నగదుపురస్కారాన్ని అందజేశారు. 


ఊటీ డాక్టర్‌కు.. 

దివ్యాంగులకు విశిష్ట సేవలందించినందుకుగాను ఊటీకి చెందిన డాక్టర్‌ పి. జయగణేశమూర్తి ప్రత్యేక అవార్డు అందుకున్నారు. సుమారు 800ల మంది దివ్యాంగులకు శస్త్రచికిత్సలందించి వారి జీవితాల్లో వెలుగునింపినందుకుగాను ఈ అవార్డును, ప్రశంసాపత్రాన్ని స్టాలిన్‌ అందజేశారు. ఇదే విధంగా పదహారేళ్లుగా మహిళల సంక్షేమం కోసం పాటుపడుతున్న మదురై(Madurai)కి చెందిన ప్రముఖ సంఘసేవకులు కె.అముదశాంతికి ప్రత్యేక అవార్డు, ప్రశంసాపత్రం అందించారు. దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించినందుకుగాను స్వచ్ఛంద సంస్థ టాపే జే రిహబ్‌సెంటర్‌కు ప్రత్యేక అవార్డు అందజేశారు. మహిళా సంక్షేమం కోసం పాటుపడుతున్న వానవిల్‌ ట్రస్టుకు, ఉత్తమ సంఘసేవకుడి అవార్డును డాక్టర్‌ పంకజంకు అందించారు. అదే విధంగా వివిధ రంగాల్లో సేవలందించిన, నిష్ణాతులైన వారికి, పోలీసులకు సైతం సీఎం అవార్డులను ప్రదానం చేసి సత్కరించారు.

Updated Date - 2022-08-16T13:59:22+05:30 IST