JP Nadda : నడ్డా అవుట్‌?

ABN , First Publish Date - 2022-12-10T01:24:14+05:30 IST

హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ ఓటమి.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తలకు చుట్టుకోనుందా? స్వరాష్ట్రంలో తన ప్రత్యర్థి, మాజీ సీఎం ప్రేమ్‌కుమార్‌ ధూమల్‌ను ఆయన ఉద్దేశపూర్వకంగానే పక్కనపెట్టి తిరుగుబాట్లను ఎగదోసి.. పార్టీ పరాజయానికి కారణమయ్యారా..?

 JP Nadda : నడ్డా అవుట్‌?

బీజేపీ కొత్త అధ్యక్షుడిగా హరియాణా సీఎం ఖట్టర్‌!

హిమాచల్‌ ఓటమికి నడ్డాదే బాధ్యత!

ధూమల్‌ను పక్కనపెట్టి తప్పు చేశారు

తిరుగుబాట్లకు చాన్సిచ్చారు

మోదీ, అమిత్‌ షా ఆగ్రహం

అందుకే నడ్డాకు ఉద్వాసన!

రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం

(న్యూఢిల్లీ-ఆంధ్రజ్యోతి)

హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ ఓటమి.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తలకు చుట్టుకోనుందా? స్వరాష్ట్రంలో తన ప్రత్యర్థి, మాజీ సీఎం ప్రేమ్‌కుమార్‌ ధూమల్‌ను ఆయన ఉద్దేశపూర్వకంగానే పక్కనపెట్టి తిరుగుబాట్లను ఎగదోసి.. పార్టీ పరాజయానికి కారణమయ్యారా..? దీనివల్లే ఆయనకు జాతీయ అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసన పలకాలని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా భావిస్తున్నారా..? రాజకీయ వర్గాల్లో అవుననే విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను జాతీయ అధ్యక్షుడిగా నియమించాలని మోదీ, షా ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు బీజేపీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నడ్డా మూడేళ్ల పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 20న ముగియనుంది. రెండో చాన్సు ఇచ్చి 2024 లోక్‌సభ ఎన్నికలకు ఆయన సారథ్యంలోనే వెళ్లాలని తొలుత నిర్ణయించినప్పటికీ.. తాజా పరిణామంతో మోదీ, షా తమ అభిప్రాయం మార్చుకున్నట్లు సమాచారం. హిమాచల్‌కు చెందిన నడ్డా పార్టీ జాతీయ అధ్యక్షుడైనప్పటికీ ఆ రాష్ట్రంలో ముఠా నాయకుడుగా వ్యవహరించారని, ధూమల్‌ వర్గాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టినందునే పెద్ద ఎత్తున తిరుగుబాట్లు జరిగాయని, ఏకంగా 21 మంది రెబెల్స్‌ బరిలోకి దిగి పార్టీ విజయావకాశాలను ఘోరంగా దెబ్బతీశారని ప్రధానికి నిఘా వర్గాలు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. నడ్డా, ధూమల్‌ వర్గాలు ఒకరినొకరు ఓడించుకునే క్రమంలో ఇరువర్గాలకూ నష్టం జరిగిందని.. నడ్డా సొంత ప్రాంతం బిలా్‌సపూర్‌లో చావు తప్పి కన్నులొట్టబోయినట్లు బీజేపీ మూడు సీట్లలో స్వల్ప మెజారిటీతో విజయం సాధించింది. ధూమల్‌ కుమారుడు, కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న హమీర్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో మొత్తం 17 అసెంబ్లీ సీట్లు ఉండగా బీజేపీ నాలుగు చోట్లే గెలిచింది. 13 స్థానాల్లో కాంగ్రెస్‌, రెబెల్స్‌ విజయం సాధించారు. నడ్డా, ఠాకూర్‌, సీఎం జైరాం ఠాకూర్‌ వర్గాలు తమ స్వప్రయోజనాల కోసం పనిచేయడం పార్టీకి నష్టం చేకూర్చిందని ఢిల్లీ పెద్దలు అంచనాకు వచ్చారు. మొత్తం 68 నియోజకవర్గాల్లో 21 నియోజకవర్గాల్లో బీజేపీ రెబెల్స్‌ పోటీ చేయగా.. వీరిలో ముగ్గురు విజయం సాధించారు. మిగతావారు బీజేపీ ఓట్లను గణనీయంగా చీల్చివేసి అధికారిక అభ్యర్థులను మట్టి కరిపించారు. ఫలితంగా బీజేపీ ఆ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది.

ఖట్టర్‌.. మోదీకి సన్నిహితుడు

ఖట్టర్‌ ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడు. హరియాణాలో ఎనిమిదేళ్లుగా సీఎంగా కొనసాగుతున్నారు. ఆయన తీరుతో అక్కడి బీజేపీ-జేజేపీ సంకీర్ణ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత నెలకొంది. అందుకే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 20 నెలల సమయం ఉన్నప్పటికీ.. ఉత్తరాఖండ్‌, గుజరాత్‌లో మాదిరిగా సీఎంను మార్చేస్తే వ్యతిరేకతను అధిగమించవచ్చని.. లేదంటే హిమాచల్‌లో మాదిరిగా దెబ్బతింటామని మోదీ భావిస్తున్నట్లు తెలిసింది. నిజానికి 2019 అక్టోబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాలకు గాను బీజేపీ 41 స్థానాలు మాత్రమే గెలిచింది. దీంతో దుష్యంత్‌ చౌతాలా నేతృత్వంలోని జననాయక్‌ జనతా పార్టీతో కలిసి ఖట్టర్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ప్రధానికి అత్యంత సన్నిహితుడైనందునే ఆయనకు రెండోసారి సీఎం పదవి దక్కింది. వీరి మధ్య సాన్నిహిత్యం ఈనాటిది కాదు. ఇద్దరూ ఆర్‌ఎ్‌సఎస్‌ ప్రచారక్‌లుగా ఉన్నారు. 1996లో మోదీ బీజేపీ హరియాణా ఇన్‌చార్జిగా ఉన్నారు. 2001లో మోదీ ముఖ్యమంత్రి కాగానే భూకంపానికి గురైన కచ్‌ ప్రాంతంలో పార్టీ ని గెలిపించే బాధ్యతను ఖట్టర్‌కు అప్పగించారు. 2014లో మోదీ ప్రధాని అయ్యాక.. హరియాణా ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో ఖట్టర్‌నే ముఖ్యమంత్రిగా నియమించారు.

‘సీఎం’ ఎవరో అధిష్ఠానానిదే నిర్ణయం

తీర్మానించిన హిమాచల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

శిమ్లా, డిసెంబరు 9: రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని నిర్ణయించే అధికారాన్ని పార్టీ అధిష్ఠానానికి అప్పగిస్తూ హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తీర్మానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 68 సీట్లకు గాను 40 స్థానాల్లో గెలిచి విస్పష్ట మెజార్టీ సాధించిన కాంగ్రె్‌సలో సీఎం ఎవరనే దానిపై శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరకు రాత్రి వేళ.. సీఎల్పీ భేటీ అనంతరం నిర్ణయం తీసుకునే బాధ్యతను పార్టీ అధిష్ఠానానికి అప్పగిస్తూ ఏక వాక్య తీర్మానం చేశారు. 39 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్న ఈ సమావేశానికి అధిష్ఠానం పరిశీలకులుగా రాజీవ్‌ శుక్లా, భూపీందర్‌ హుడా, ఛత్తీ్‌సగఢ్‌ సీఎం భూపేష్‌ భగేల్‌ హాజరయ్యారు. దీనికిముందు మాజీ సీఎం వీరభద్రసింగ్‌ భార్య, పీసీసీ చీఫ్‌ ప్రతిభాసింగ్‌ వర్గ ఎమ్మెల్యేలు బల ప్రదర్శనకు దిగారు. ప్రతిభాను సీఎం చేయాలంటూ.. గవర్నర్‌ రాజేంద్ర వద్దకు వెళ్తున్న పరిశీలకుల కారుకు అడ్డు పడ్డారు. కాగా, మొన్నటివరకు ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన ముఖేష్‌ అగ్నిహోత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు సుఖ్వీందర్‌సింగ్‌ సుఖు, సీనియర్‌ నేత హర్షవర్ధన్‌ చౌహాన్‌ కూడా సీఎం పదవికి పోటీ పడుతున్నారు.

Updated Date - 2022-12-10T03:52:00+05:30 IST