Suu Kyi: అవినీతి కేసులో ఆంగ్‌సాన్ సూకీకి ఆరేళ్ల జైలు

ABN , First Publish Date - 2022-08-16T02:17:14+05:30 IST

నోబెల్ బహుమతి గ్రహీత, మయన్మార్ నేత ఆంగ్‌సాన్ సూకీ (Aung San Suu Kyi)కి మిలటరీ కోర్టు ఆరేళ్ల జైలుశిక్ష విధించింది

Suu Kyi: అవినీతి కేసులో ఆంగ్‌సాన్ సూకీకి ఆరేళ్ల జైలు

నేపిటా: నోబెల్ బహుమతి గ్రహీత, మయన్మార్ నేత ఆంగ్‌సాన్ సూకీ (Aung San Suu Kyi)కి మిలటరీ కోర్టు ఆరేళ్ల జైలుశిక్ష విధించింది. మిలటరీ ప్రభుత్వం ఆమెపై నమోదు చేసిన నాలుగు అవినీతి కేసుల్లో సూకీని దోషిగా తేల్చిన కోర్టు జైలు శిక్షను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో గతేడాది తిరుగుబాటు చేసిన సైన్యం సూకీ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసి గద్దెనెక్కింది. అనంతరం ఆమెను అరెస్ట్ చేసి ఎన్నికల ఉల్లంఘన తదితర 18 కేసులు నమోదు చేసింది. వీటన్నింటికీ కలిపి గరిష్టంగా 190 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే, సైన్యం తనపై మోపిన ఆరోపణలను సూకీ ఖండించారు. 


దేశంలో ఆరోగ్యం, విద్యను ప్రోత్సహించేందుకు స్థాపించిన ‘డా ఖిన్ క్యీ ఫౌండేషన్‌’ నిధులను దుర్వినియోగం చేశారన్న కేసులో సోమవారం మిలటరీ కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. ఇంటిని నిర్మించుకునేందుకు, ప్రభుత్వ స్థలాన్ని రాయితీపై తక్కువ ధరకే లీజుకు తీసుకున్నట్టు తేల్చిన న్యాయస్థానం ఆమెకు శిక్షను ఖరారు చేసింది. 77 ఏళ్ల సూకీ ప్రస్తుతం నేపిటాలోని జైలులో ఏకాత నిర్బంధంలో ఉన్నారు. ఇతర కేసుల్లో ఇప్పటికే ఆమెకు 11 ఏళ్ల శిక్ష పడింది. 


ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసి సైన్యం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మయన్మార్‌(Myanmar) రగులుతూనే ఉంది. వేలాదిమందిని జైల్లో పెట్టిన సైన్యం మరెంతోమందిని చిత్రహింసలకు గురిచేసింది. ఇంకెంతోమందిని చంపేసింది. మయన్మార్‌లో జరుగుతున్న ఈ హింసపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు, మయన్మార్‌పై అంతర్జాతీయ సమాజం ఆంక్షలు విధించింది.


సూకీని రహ్యంగా విచారించడాన్ని తప్పుబట్టింది. మయన్మార్‌ను ఐదేళ్లపాటు పాలించిన సూకీ ఆ సమయంలో ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చారు. కాగా, సూకీ 1989-2010 మధ్య దాదాపు పదిహేనేళ్లపాటు సూకీని సైన్యం గృహ నిర్బంధంలో ఉంచింది. ఆమెపై నమోదైన మిగిలిన కేసుల్లోనూ దోషిగా తేలితే సూకీ ఇక జీవితాంతం జైలులోనే గడపాల్సి ఉంది.

Updated Date - 2022-08-16T02:17:14+05:30 IST