4 నెలల్లో రిటైర్మెంట్..కెనడాలో కొడుకును చూసేందుకు ప్లాన్...ఇంతలోనే..!

ABN , First Publish Date - 2022-07-20T21:28:47+05:30 IST

మరో నాలుగు నెలల్లో ఆయన పదవీ కాలం పూర్తి కానుంది. ఆ వెంటనే కెనడా వెళ్లి అక్కడి స్థిరపడిన తన కొడుకు, మనుమలతో కాలక్షేపం చేయాలని..

4 నెలల్లో రిటైర్మెంట్..కెనడాలో కొడుకును చూసేందుకు ప్లాన్...ఇంతలోనే..!

గురుగావ్: మరో నాలుగు నెలల్లో ఆయన పదవీ కాలం పూర్తి కానుంది. ఆ వెంటనే కెనడా వెళ్లి అక్కడి స్థిరపడిన తన కొడుకు, మనుమలతో కాలక్షేపం చేయాలని ఆయన అనుకున్నారు. ఇంతలోనే మృత్యువు మాఫియా ముఠా రూపంలో ఆయనను కబళించింది. అక్రమ రాయి రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో ఆయనపై మాఫియా ముఠా  ట్రక్కు నడిపి ప్రాణాలు తీసింది. 57 ఏళ్ల పంజాబ్ డిప్యూటీ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ (DSP) సురేందర్ సింగ్ బిష్ణోయ్ (Surender Singh Bishnoi) విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఘటన కుటుంబసభ్యులతో పాటు హర్యానా పోలీసు శాఖ సిబ్బంది, ఆయన సన్నిహితులను కలిచివేసింది.


హిసార్‌లోని సారంగపూర్ గ్రామానికి చెందిన సురేందర్ సింగ్ 1994లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా చేరారు. విధి నిర్వహణలో భాగంగా ఆదివారంనాడు నుహ్ గ్రామంలోని పచగామ్ వద్ద అక్రమ మైనింగ్ జరుగుతున్న విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లారు. ఒక వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా ట్రక్కు డ్రైవర్ ఆపకుండా ఆయన పైనుంచి దూసుకుపోయాడు. దాంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. నుహ్‌లోని తౌరు (సిటీ) పోలీస్ స్టేషన్‌లో మూడు నెలలుగా ఆయనతో ఎంతో సన్నిహితంగా మెలిగిన ఇన్‌స్పెక్టర్ జనరల్ ధరమ్ సింగ్ ఆయనతో గడిపిన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. సింగ్ ఎంతో ఉల్లాసంగా, నవ్వుతూ నవ్విస్తూ ఉండేవారని గుర్తుచేసుకున్నారు. ''ఆయన (సురేందర్ సింగ్) చాలా జాలీగా ఆయన కనిపించేవారు. వృత్తి పట్ల ఎంతో అంకితభావం చూపించేవారు. ఎక్కడకు వెళ్లినా ఆయన ఒక్కడే వెళ్లేవారు. అంతటి ధైర్యవంతుడు'' అని ధరమ్ సింగ్ చెప్పారు. నుహ్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు సురేందర్ సింగ్ భౌతికకాయాన్ని తరలిస్తున్నారు.


సురేందర్ సింగ్ కెనడా వెళ్లి తన కొడుకు, మనుమలను చూసుకోవాలని అనుకున్నారని, శేష జీవితాన్ని తన స్వగ్రామమైన హిసార్‌లో గడపాలని తన సన్నిహితులకు చెప్పేవారని ఆయన మేనల్లుడు దినేష్ తెలిపారు. నిరంతరం వృత్తికి అంకితమై పనిచేసేవారని, అయినా పని గురించి ఎప్పుడూ మాట్లాడకుండా జోక్స్‌ విసురుతూ తన చుట్టుపక్కల ఉన్న వారిని ఎప్పుడూ ఆనందపరచేవారని చెప్పారు. సురేందర్ భౌతిక కాయాన్ని రిసీప్ చేసుకునేందుకు దినేష్ వచ్చారు. సురేందర్ సింగ్ మరో మేనల్లుడు సునీల్ మాట్లాడుతూ, అంకుల్‌తో సోమవారమే మాట్లాడానని, రెండు మూడు రోజుల్లో ఇంటికి వస్తానని తనతో చెప్పారని తెలిపారు. ''ఇక ఎప్పటికీ తిరిగిరాని లోకానికి ఆయన వెళ్లిపోయారు. కుటుంబానికి ఆయనే పెద్ద దిక్కు'' అంటూ సునీల్ కంటతడిపెట్టాడు.


సురేందర్ సింగ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన కుమార్తె బెంగళూరులోని ఓ బ్యాంకులో పనిచేస్తుండగా, కుమారుడు సిద్ధార్ధ కెనడాలో ఉన్నారు. సిద్ధార్ధ సోమవారంనాడు తనకు ఫోన్ చేసి నాన్నగారి రిటైర్‌మెంట్ సెలబ్రేషన్ కోసం తాను వస్తున్నానని, టిక్కెట్లు బుక్ చేశానని, ఆ విషయం ఎవరికీ చెప్పవద్దని, సర్‌ప్రైజ్ చేద్దామని చెప్పినట్టు సునీల్ తెలిపారు. సురేందర్‌ సింగ్ మరణవార్తను సిద్ధార్ధకు చెప్పానని, ఆయన వెంటనే బయలుదేరాడని అన్నారు. కాగా, డీఎస్‌పీ సురేందర్‌ను మాఫియా ముఠా పొట్టనపెట్టుకున్న ఘటనకు నిరసనగా తౌరు గ్రామస్థులు బంద్‌కు పిలుపునిచ్చారు. సంఘీభావంగా అన్ని పాఠశాలలు, కార్యాలయాలను మూసివేశారు.

Read more