Mumbai: 26/11 దాడులు పునరావృతం చేస్తామంటూ పాక్ నెంబర్ నుంచి బెదిరింపులు

ABN , First Publish Date - 2022-08-20T20:18:51+05:30 IST

దేశ ఆర్థిక రాజధాని ముంబైపై మరోసారి 26/11 తరహాలో దాడులతో విరుచుకుపడనున్నట్టు...

Mumbai: 26/11 దాడులు పునరావృతం చేస్తామంటూ పాక్ నెంబర్ నుంచి బెదిరింపులు

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైపై మరోసారి 26/11 తరహాలో దాడులతో విరుచుకుపడనున్నట్టు ఆ రాష్ట్రపోలీసులకు అజ్ఞాత వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ వచ్చింది. దీంతో పోలీసులు, భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఈ బెదిరింపు కాల్ వచ్చింది. వాట్సాప్‌లో పాకిస్థాన్ నుంచి ఈ ఫోన్ కాల్ వచ్చినట్టు పోలీస్ కంట్రోల్ రూమ్ గుర్తించింది. ముంబైలో ఈ దాడులు జరుపుతామని, ఆరుగురు వ్యక్తులు ఈ ప్లాన్‌ను అమలు చేయనున్నారని ఆ మెసేజ్‌లో అజ్ఞాత వ్యక్తి హెచ్చరించాడు. ''ఒసామా బిన్ లాడెన్, అజ్మల్  కసబ్, అయమాన్ అల్-జవహరిని చంపితే ఏమైంది? ఇంకా చాలా మంది ఉన్నారు'' అని ఆ మెసేజ్‌లో ఉండటంతో ముంబై పోలీసులు, ఇతర భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. రెండ్రోజుల క్రితమే మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఆయుధాలు, పేలుడు పదార్ధాలతో కూడిన పడవను పోలీసులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో తాజాగా ఈ బెదిరింపు లేఖ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.


నాటి వరుస పేలుళ్లు...

2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన వరుస పేలుళ్ల ఘటనలు దేశ ఆర్థిక రాజధానిని వణికించాయి. 10 మంది లష్కరే తొయిబా ఉగ్రవాదులు నాలుగు రోజుల వ్యవధిలో నగరంలోని పలు చోట్ల ఈ పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ మారణకాండలో 166 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు.

Updated Date - 2022-08-20T20:18:51+05:30 IST