ములాయం అంత్యక్రియలు పూర్తి

ABN , First Publish Date - 2022-10-12T07:31:36+05:30 IST

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ అంత్యక్రియలు మంగళవారం ముగిశాయి.

ములాయం అంత్యక్రియలు పూర్తి

హాజరైన సీఎం కేసీఆర్‌, 

టీడీపీ అధినేత చంద్రబాబు


సైఫయీ/న్యూఢిల్లీ, అక్టోబరు 11: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ అంత్యక్రియలు మంగళవారం ముగిశాయి. ఆయన స్వగ్రామమైన సైఫయీలో అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కుమారుడు అఖిలేశ్‌ యాదవ్‌ ములాయం చితికి నిప్పంటించారు. అభిమానులు ‘నేతాజీ అమర్‌ రహే’ అంటూ అశ్రు నయనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు. ములాయం అంత్యక్రియలకు సీఎం కేసీఆర్‌, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీలకతీతంగా జాతీయ స్థాయి నేతలు, పలు రాష్ట్రాల సీఎంలు, భిన్న రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌, బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌, యోగా గురువు రాందేవ్‌ బాబా తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నవారిలో ఉన్నారు. 


ప్రత్యేక విమానంలో వెళ్లిన కేసీఆర్‌

సోమవారం కేసీఆర్‌ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ నుంచి నేరుగా సైఫయీ వెళ్లారు.  ములాయం పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. కేసీఆర్‌ వెంట మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎంపీలు సంతోష్‌ కుమార్‌, బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. చంద్రబాబు ఢిల్లీ మీదుగా సైఫయీ చేరుకొని ములాయంకు నివాళులర్పించారు. చంద్రబాబు వెంట ఎంపీలు గల్లా జయదేవ్‌, కనకమేడల రవీంద్ర కుమార్‌, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌ రావు ఉన్నారు.

Updated Date - 2022-10-12T07:31:36+05:30 IST