మునుగోడుపై మరింత ఫోకస్‌

ABN , First Publish Date - 2022-09-12T07:58:44+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్‌ మరింత పెంచింది.

మునుగోడుపై మరింత ఫోకస్‌

బీజేపీ అధిష్ఠానం చర్యలు షురూ

రాజగోపాల్‌ వెంట పూర్తి స్థాయిలో రాని కాంగ్రెస్‌ క్యాడర్‌ 

బీజేపీ శ్రేణుల మద్దతూ అంతంతే!

రంగంలోకి దిగిన సునీల్‌ బన్సల్‌


న్యూఢిల్లీ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్‌ మరింత పెంచింది. ఈ ఉప ఎన్నికలో విజయం సాధిస్తే రాష్ట్రమంతటా తమ ప్రభంజనం వీచే అవకాశం ఉందని భావిస్తున్న కమలం నేతలు.. ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. ఈ మేరకు పార్టీలో స్థానికంగా ఉన్న సమస్యలపై తొలుత దృష్టి పెట్టారు. ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వెంట నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ క్యాడర్‌ పూర్తి స్థాయిలో రాలేదని అంచనా వేస్తున్నారు. వీరితోపాటు స్థానిక బీజేపీ క్యాడర్‌ కూడా రాజగోపాల్‌రెడ్డికి సరిగా సహకరించడం లేదని భావిస్తున్నారు. దీంతో ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు బీజేపీ అధిష్ఠానం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌ను రాష్ట్రానికి పంపింది. ఈ మేరకు తన కార్యాచరణ ప్రారంభించిన బన్సల్‌ స్థానిక నేతలతో మంతనాలు జరిపారని బీజేపీ వర్గాలు తెలిపాయి. మునుగోడులో తమకు ప్రధానంగా టీఆర్‌ఎ్‌సతోనే పోటీ ఉంటుందని, దానిని అధిగమించాలంటే మరింత పకడ్బందీగా వ్యూహరచన చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. సునీల్‌ బన్సల్‌ తెలంగాణ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన నివేదికను బట్టి భవిష్యత్తు వ్యూహరచన నిర్ణయించాలని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నట్లు సమాచారం. సునీల్‌ బన్సల్‌ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి విజయాలు సాధించిపెట్టిన నేపథ్యంలో.. మునుగోడులో ఆయన ఎటువంటి వ్యూహం అవలంబిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. 

Updated Date - 2022-09-12T07:58:44+05:30 IST