ఈ నెలాఖరులోనే కార్పొరేషన్‌ Elections నోటిఫికేషన్‌?

ABN , First Publish Date - 2022-01-20T15:31:34+05:30 IST

రాష్ట్రంలో కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ ఈ నెలాఖరున విడుదల చేయాలని బుధవారం ఉదయం ఎన్నికల అధికారి పళనికుమార్‌ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో పార్టీల ప్రతినిధులు

ఈ నెలాఖరులోనే కార్పొరేషన్‌ Elections నోటిఫికేషన్‌?

- మోగనున్న నగారా!

- అఖిలపక్షంతో ఎన్నికల అధికారి సమీక్ష


చెన్నై: రాష్ట్రంలో కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ ఈ నెలాఖరున విడుదల చేయాలని బుధవారం ఉదయం ఎన్నికల అధికారి పళనికుమార్‌ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో పార్టీల ప్రతినిధులు సూచించారు. ఈ ఎన్నికలను రెండు విడతలుగా కాకుండా ఒకే విడతగా జరపాలని అన్నాడీఎంకే సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. స్థానిక కోయం బేడులోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లపై జరిగిన చర్చల్లో గుర్తింపు కలిగిన 11 పార్టీల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారు. రెండు రోజుల క్రితం కార్పొరేషన్‌, మునిసిపాలిటీ ఎన్నికల వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఏర్పాట్లపై ఇదివరకే రాష్ట్ర ఎన్నికల అధికారి పళనికుమార్‌ జిల్లా కలెక్టర్లతో ఐదు విడతలుగా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలోగా ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండటంతో బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికార డీఎంకే పార్టీ తరఫున న్యాయవాది గిరిరాజన్‌, శాసనసభ్యుడు సుందర్‌, అన్నాడీఎంకే తరఫున ఆ పార్టీ వ్యవస్థాపక కార్యదర్శి పొల్లాచ్చి జయరామన్‌, శాసనసభ్యుడు మనోజ్‌ పాండ్యన్‌, న్యాయవిభాగం నేత బాబు మురుగవేల్‌, కాంగ్రెస్‌ తరఫున ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్‌.దామోదరన్‌, న్యాయవాది నవాజ్‌, బీజేపీ తరఫున కరునాగరాజన్‌, కరాటే ఆర్‌.త్యాగరాజన్‌, సీసీఐ తరఫున ఆ పార్టీ డిప్యూటీ కార్యదర్శి వీరపాండి, జిల్లా కార్యదర్శి ఏళుమలై,, సీపీఎం తరఫున ఆ పార్టీ నేతలు గుణశేఖరన్‌, ఆరుముగం, డీఎండీకే తరఫున మాజీ శాసనసభ్యుడు నల్లతంబి, బాలాజీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున మణిశంకర్‌, అకిమ్స్‌ హాజరయ్యారు. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌ దీప్‌ సింగ్‌బేదీ తదితర అధికారులు పాల్గొన్నారు. డీఎంకే, అన్నాడీఎంకే, సీపీఐ, సీపీఎం, బీజేపీ తదితర ప్రదాన పార్టీలకు చెందిన ప్రతినిధులు కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో పోలింగ్‌ కేంద్రాల సంఖ్య పెంచాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల అధికారి పళనికుమార్‌ మాట్లాడుతూ కార్పొరేషన్‌, మున్సిపాలిటీ ఎన్నికల ఏర్పాట్లను పూర్తి చేశామని, ఓటర్ల జాబితా విడుదల చేశామని, జిల్లాల వారీగా స్థానిక ఎన్నికల నిర్వహణాధికారుల నియామకం కూడా పూర్తయ్యిందని తెలిపారు. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అన్ని పార్టీలూ ఈ ఎన్నికలను కరోనా నిరోధక నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ జరిపేందుకు సహ కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం అనంతరం ప్రధాన పార్టీల ప్రతినిధులు కొందరు మీడియాతో మాట్లాడుతూ కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ ఈ నెల 21, 22 తేదీల్లో వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలను ఫిబ్రవరి రెండో వారంలో రెండు విడతలుగా నిర్వహించాలనే ఆలోచనలో ఉందని వివరించారు.

Read more