మోదీజీ.. appointment ప్లీజ్‌ !

ABN , First Publish Date - 2022-07-21T13:29:48+05:30 IST

చెస్‌ ఒలంపియాడ్‌ ప్రారంభోత్సవం కోసం ఈ నెల 27న నగరానికి రానున్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యేందుకు అన్నాడీఎంకే

మోదీజీ.. appointment ప్లీజ్‌ !

- పీఎంవోకు ఓపీఎస్‌, ఈపీఎస్‌ లేఖలు 

- వారి బాటలో శశికళ 

- ప్రధానికి మొరపెట్టుకునేందుకు ముగ్గురు నేతల ముమ్మర యత్నం?


చెన్నై, జూలై 20 (ఆంధ్రజ్యోతి): చెస్‌ ఒలంపియాడ్‌ ప్రారంభోత్సవం కోసం ఈ నెల 27న నగరానికి రానున్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యేందుకు అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌), బహిష్కృత నేత ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌) ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ మేరకు వారు మోదీ అపాయింట్‌మెంట్‌ కోసం ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసారు. అన్నాడీఎంకేలో నెలకొన్న సంక్షోభం, దానిని అధిగమించి తాను బయటపడిన వైనం గురించి తెలియజేయడంతో పాటు తనకే ఆశీస్సులివ్వాలని మోదీని అభ్యర్థించేందుకు ఈపీఎస్‌ సిద్ధమైనట్లు తెలిసింది. అదే విధంగా ద్వంద్వ నాయకత్వం కోసం కృషి చేసిన తనను పార్టీ నుంచి గెంటేసిన తీరును, ఈపీఎస్‌ పోకడల్ని ఏకరువు పెట్టుకునేందుకు ఓపీఎస్‌ కూడా మోదీని కలవాలని ప్రయత్నిస్తున్నారు. నిజానికి మోదీ వీరిద్దరితోనూ సన్నిహితంగానే వున్నారు. అన్నాడీఎంకే సాధారణ సభ్య సమావేశంలో సమన్వయకర్తగా ఓపీఎ్‌సను తొలించాక ఆయన ఢిల్లీ వెళ్లారు. ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడు కూడా బీజేపీ నేతలు ఆయన్ని సాదరంగానే ఆహ్వానించారు. అయితే మోదీ, అమిత్‌షాలతో భేటీ కోసం చేసిన ప్రయత్నాలు మాత్రం విఫలమయ్యాయి. అంతకు ముందు మోదీ చెన్నై వచ్చినప్పుడు ఓపీఎస్‌, ఈపీఎ్‌స భేటీ అయ్యారు. కానీ ఈపీఎ్‌సతో ఆప్యాయంగా మాట్లాడిన మోదీ.. ఓపీఎ్‌సతో ముభావంగా వ్యవహరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీరిద్దరు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయి, ఎవరు విజయం సాధిస్తారన్నదానిపై రాజకీయవర్గాలు ఉత్కంఠతో గమనిస్తున్నాయి.


చిన్నమ్మ కూడా ప్రయత్నాలు...

అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ కూడా మోదీని కలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. నిజానికి ఈపీఎస్‌, ఓపీఎస్‌, శశికళ, దినకరన్‌ కలిసి వుంటేనే అన్నాడీఎంకేకు భవిష్యత్తు వుందని, మున్ముందు ఆ పార్టీ మరింత బలపడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తదితరులు గట్టిగా తలపోస్తున్నారు. ఆ మేరకు ఆయన ప్రయత్నాలు కూడా చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మోదీతో భేటీ అయ్యేందుకు అన్నామలై ద్వారా శశికళ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. జయ హయాం నుంచి పార్టీ కోసం తాను చేసిన కృషి, తనకు జరిగిన అన్యాయం గురించి వివరించి, మోదీ సాయం అభ్యర్థించాలని శశికళ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ముగ్గురిలో మోదీ ఎవరిని దరి చేర్చుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

Read more