నా వెనక మోదీ, షా

ABN , First Publish Date - 2022-07-05T07:42:22+05:30 IST

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం వెనుక బీజేపీ హస్తం ఉందని.

నా వెనక మోదీ, షా

అతిపెద్ద ‘కళాకారుడు’ దేవేంద్ర ఫడణవీస్‌

నాతోపాటు ఉన్న ఎమ్మెల్యేలు నిద్రించే వేళ నేను ఫడణవీస్‌ను కలుస్తూ ఉండేవాడిని

నిండు సభలో వెల్లడించిన ‘మహా’ సీఎం ఏక్‌నాథ్‌ షిండే

164 ఓట్లతో బలపరీక్షలో సునాయాస విజయం

షిండేకు కొత్తగా మరో ఇద్దరు ‘సేన’ ఎమ్మెల్యేల మద్దతు

గెలిచిన తర్వాత సభలో షిండే భావోద్వేగ ప్రసంగం

ఆర్నెల్లలో మధ్యంతర ఎన్నికలు.. సిద్ధం కండి: పవార్‌

ఎన్నికలు పెట్టండి.. తప్పెవరిదో ప్రజలే తేలుస్తారు: ఠాక్రే


ముంబై, జూలై 4: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం వెనుక బీజేపీ హస్తం ఉందని.. తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండేకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అండవుందని తేలిపోయింది! సాక్షాత్తూ షిండేనే శాసనసభలో సోమవారం ఈ విషయం వెల్లడించారు. సోమవారం నాటి విశ్వాసపరీక్షలో ఆయన 164 ఓట్లతో సునాయాస విజయం సాధించారు. అనంతరం ముఖ్యమంత్రి హోదాలో సభనుద్దేశించి తొలిసారి ప్రసంగింగిస్తూ.. తనవెనుక మోదీ, షా ఉన్న విషయా న్ని భావోద్వేగంలో బయటపెట్టారు. ‘‘పరిణామాలన్నీ ఒక్కరోజులో జరిగినవి కావు. మాకు సంఖ్యా బలం  తక్కువగా ఉన్నప్పుడు ప్రధాని మోదీ మమ్మల్ని ఆశీర్వదించారు. ప్రమాణ స్వీకారానికి ముందు కూడా మాకు అన్ని విధాలుగా సాయం చేస్తామన్నారు. ఇక అమిత్‌షా మా వెనకాల కొండలా నిలబడతానన్నారు. అన్నిటికీ మిం చి కొత్త ప్రభుత్వ ఏర్పాటు వెనుక అతిపెద్ద ‘‘కళాకారు డు దేవేంద్ర ఫడణవీస్‌. మా గ్రూపు ఎమ్మెల్యేలు నిద్రపోయే సమయంలో మేమిద్దరం కలిసేవాళ్లం. వాళ్లు లేచేలోగా సర్దుకునేవాళ్లం’’ అని తెలిపారు. తద్వారా తిరుగుబాటు వెనుక బీజేపీ క్రియాశీల పాత్ర ఉందనే విషయాన్ని ఆయన ప్రపంచానికి స్పష్టం చేశారు. అ యితే, నిండుసభలో షిండే ఈ విషయాలు చెప్పడం తో ఫడణవీస్‌ కొద్దిగా ఇబ్బందిపడ్డారు. కాగా.. బలపరీక్షలో ఊహించినట్లే షిండే విజయం సాధించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో సీట్ల సంఖ్య 288. ఒక సభ్యుడు చనిపోవడంతో ఆ సంఖ్య ప్రస్తుతం 287. షిండే సాధారణ మెజారిటీకి 144 మంది సభ్యుల మద్దతు అవస రం. అయితే.. 263 మంది సభ్యులు మాత్రమే ఓటింగ్‌ లో పాల్గొనగా వారిలో ఏకంగా 164 మంది షిండేకు అనుకూలంగా ఓటు వేశారు. వ్యతిరేకంగా 99 ఓట్లే వచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అబు అజ్మీ, రయీస్‌ షేక్‌, మజ్లిస్‌ పార్టీకి చెందిన షా ఫారుఖ్‌ అన్వర్‌ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.


11 మంది కాం గ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎన్సీపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు, మజ్లిస్‌ ఎమ్మెల్యే ఒకరు విశ్వాసపరీక్షకు గైర్హాజరయ్యారు. ముందురోజు దాకా ఉద్ధవ్‌ ఠాక్రే వర్గంలో ఉన్న 13 మందిలోనూ ఇద్దరు షిండేకు అనుకూలంగా ఓటు వేశారు. విజయం సాధించిన అనంతరం ప్రసంగించిన షిండే.. తాను చాలాకాలంగా అణచివేతకు గురయ్యానని, అలాగని కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడనని అన్నారు. ‘‘నేను కరడుగట్టిన శివసైనికుణ్ని. ఎప్పటికీ అలాగే ఉంటాను. మా సొంత పార్టీ సభ్యులే మాపై దూషణలకు దిగినా ఎలాంటి కక్షసాధింపునకూ పాల్పడనని హామీ ఇస్తున్నా’’ అన్నారు. 2014-19 నాటి బీజేపీ-శివసేన సర్కారులో తనకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వజూపినా శివసేన తిరస్కరించిందని షిండే వెల్లడించారు. అప్పట్లోనే తాను రాజీనామా చేయాలనుకుంటే నాటి సీఎం ఫడణవీస్‌ ఆపారని గుర్తుచేసుకున్నారు. 2019లో మహావికాస్‌ అఘాడీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ముందు కూడా తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందని.. కానీ, అందుకు తన పార్టీనే అభ్యంతరం చెప్పిందని ఆవేదన వెలిబుచ్చారు. సభలో ప్రస్తుతం తనతో 50 మంది ఎమ్మెల్యేలున్నారని, బీజేపీకి 106 మంది సభ్యుల బలముందని, వచ్చే ఎన్నికల్లో తాము 200 సీట్లు గెలుస్తామని, అలా గెలవలేకపోతే తాను వెనక్కి వెళ్లిపోయి వ్యవసాయం చేసుకుంటానన్నారు. తిరుగుబాటు వల్ల తన కుటుంబం బెదిరింపులను ఎదుర్కొందని షిండే ఆందోళన వెలిబుచ్చారు. 


మధ్యంతర ఎన్నికలు..

షిండే సర్కారు 6 నెలల్లో కూలిపోతుందని, మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సోమవారం శివసేన శ్రేణులతో సమావేశమయ్యారు. ‘‘శివసేన పార్టీని అంతం చేయడానికి బీజేపీ పన్నిన కుట్ర ఇది. దమ్ముం టే మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని వారికి సవా ల్‌ చేస్తున్నా. మేం ప్రజా కోర్టుకే వెళ్తాం. తప్పు మాదైతే ప్రజలే మమ్మల్ని ఇంటికి పంపిస్తారు. తప్పు మీదైతే మిమ్మల్నే ఇంటికి పంపిస్తారు’’ అని ఉద్ధవ్‌ అన్నారు.


నాడు ఉద్ధవ్‌ కోసం ఏడ్చి.. నేడు పార్టీ మార్చి...

‘‘ఒపీనియన్స్‌ చేంజ్‌ చేస్తూ ఉంటేనే కానీ పొలిటీషియన్‌ కానేరడు’’.. గురజాడ కన్యాశుల్కం’ నాటకంలో గిరీశం పాత్రధారి చెప్పే డైలాగ్‌ ఇది! ఆ మాట అక్షర సత్యమని మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం సందర్భం గా మరోసారి రుజువైంది. ఆ కథేంటంటే జూన్‌ 24న ఉద్ధవ్‌ ఠాక్రేకు మద్దతుగా కెమెరాల ముందు ప్రసంగి స్తూ చేతులు జోడించి ఏడ్చిన ఎమ్మెల్యే సంతోష్‌ బంగ ర్‌.. విశ్వాసపరీక్షకు ముందురోజు రాత్రి, అంటే ఆదివారం నేరుగా ముంబైలో షిండే వర్గం బస చేస్తున్న హోటల్‌కు వెళ్లి ఆయన శిబిరంలో చేరిపోయారు. ‘‘బాలాసాహెబ్‌ ఠాక్రే, ఉద్ధవ్‌ జీ.. మీరు ముందుకు సాగండి. మేం మీతోనే ఉంటాం’’ అంటూ కన్నీటిని చేతిరుమాలుతో తుడుచుకుంటూ వాపోయిన ఆయనే షిండే పంచన చేరడంతో అంతా అవాక్కయ్యారు! ఆయనతోపాటు శ్యామ్‌సుందర్‌ షిండే అనే మరో ‘సేన’ ఎమ్మెల్యే కూడా చివరి నిమిషంలో షిండేకు అనుకూలంగా ఓటు వేయడం గమనార్హం.



అవును మాది ‘ఈడీ’ ప్రభుత్వమే: ఫడణవీస్‌

ఓటింగ్‌ జరిగే సమయంలో కొందరు సభ్యులు షిండే, బీజేపీ వర్గాన్ని ఉద్దేశించి ‘ఈడీ.. ఈడీ’ అనే నినాదాలతో హోరెత్తించారు.  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ బూచిని చూపి శివసేన ఎమ్మెల్యేలను లాగేసిందన్న ఉద్దేశంతో వారు అలా అరిచారు. అయితే, విశ్వాస పరీక్షలో విజయం అనంతరం సభలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ‘ఈడీ’ అనే పదానికి కొత్త నిర్వచనం ఇచ్చారు. ‘‘అవును, నిజమే. కొత్త ప్రభుత్వం ‘ఈడీ(ఏక్‌నాథ్‌-దేవంద్ర ఫడణవీ్‌స)’తోనే ఏర్పాటైంది’ అని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర కొన్నేళ్లుగా నాయకత్వ లేమి సమస్యను ఎదుర్కొందంటూ ఉద్ధవ్‌ ఠాక్రేను ఉద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సభలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకులు ఇద్దరు (తాను, షిండే) ఉన్నారని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-07-05T07:42:22+05:30 IST