డీఎంకే వైపు సూలూరు MLA చూపు ?

ABN , First Publish Date - 2022-09-19T17:19:54+05:30 IST

కోయంబత్తూరు జిల్లా సూలూరు నియోజకవర్గం అన్నాడీఎంకే శాసనసభ్యుడు వీపీ దురైసామి డీఎంకే ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తున్నారు

డీఎంకే వైపు సూలూరు MLA చూపు ?

Chennai: కోయంబత్తూరు జిల్లా సూలూరు నియోజకవర్గం అన్నాడీఎంకే శాసనసభ్యుడు వీపీ దురైసామి డీఎంకే ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేకించి డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ప్రశంసిస్తూ వరుసగా ప్రకటనలు  చేస్తుండటంతో త్వరలో ఆయన సొంత పార్టీకి గుడ్‌ బై చెబుతారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. శనివారం సూలూరు సమీపం పల్లపాళయం ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘వరుమున్‌ కాప్పోమ్‌’ ప్రత్యేక శిబిరం జరిగింది. ఆ శిబిరంలో దురైసామి పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో వైద్యశాఖ అభివృద్ధిపై మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, కరుణానిధి ప్రత్యేక శ్రద్థ చూపేవారని, వారి బాటలోనే ప్రస్తుతం ముఖ్యమంత్రి స్టాలిన్‌ కూడా వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నారని ప్రశంసించారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. అంతటితో ఆగకుండా పల్లపాళయం నగరపంచాయతీ అధ్యక్షుడు (డీఎంకే) ఏ పథకాన్ని తీసుకువచ్చినా తాను మద్దతునిస్తానంటూ సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రజా ప్రతినిధులు పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని దురైసామి స్పష్టం చేశారు. ఇంతకు ముందు కూడా ఆయన స్టాలిన్‌ ప్రశంసిస్తూ ప్రకటనలు చేశారు.


ఈ నేపథ్యంలో దురైసామి త్వరలో డీఎంకే తీర్థం పుచ్చుకోనున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ఆయన ప్రసంగించిన వీడియో అదేపనిగా ప్రసారమవుతోంది. ఈ విషయమై దురైసామిని మీడియా  ప్రశ్నించగా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న అన్నాడీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రశంసించడం తప్పుకాదని, ఆ కోవలోనే తాను వైద్యరంగం అభివృద్ధికి స్టాలిన్‌ తీసుకుంటున్న చర్యలను పొగిడానని, అంతమాత్రానికే తాను డీఎంకేలో చేరనున్నట్లు పుకార్లు పుట్టించడం గర్హనీయమన్నారు. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి వర్గంలోనే తాను కొనసాగుతానని స్పష్టం చేశారు.

Read more