Mission 2024: నితీశ్ ఫార్ములాకు మమత సై

ABN , First Publish Date - 2022-09-08T21:52:49+05:30 IST

న్యూఢిల్లీ: కేంద్రం నుంచి మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో విపక్షాలు ఐక్యం కావాలన్న జేడియూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్,

Mission 2024: నితీశ్ ఫార్ములాకు మమత సై

న్యూఢిల్లీ: కేంద్రం నుంచి మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో విపక్షాలు ఐక్యం కావాలన్న జేడియూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునకు తృణమూల్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సానుకూలంగా స్పందించారు. కేసీఆర్ గతంలోనే తన కుమార్తె కవిత, సీనియర్ నేత కె.కేశవరావుతో కలిసి కోల్‌కతా వెళ్లి మరీ మమతతో సమావేశమయ్యారు. విపక్షాల ఐక్యపోరు ప్రాధాన్యతను, బీజేపీయేతర పక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన ఆవశ్యకతను వివరించారు. దానికి నాడు మమత సానుకూలంగానే స్పందించినా నేడు నితీశ్ కూడా రంగంలోకి దిగడంతో ఆమె తన వైఖరిని పూర్తిగా వెల్లడించారు. 


అసలు ఆట పశ్చిమబెంగాల్ నుంచే ప్రారంభమౌతుందని, తాను నితీశ్, అఖిలేష్, హేమంత్ సొరేన్, ఇతర మిత్రులంతా చేతులు కలిపితే ఇక బీజేపీ ఎలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మమత ప్రశ్నించారు. అసలు బీజేపీ ప్రభుత్వమే అవసరం లేదన్నారామె. కోల్‌కతాలో గురువారం జరిగిన తృణమూల్ సభలో ఆమె మాట్లాడుతూ బీజేపీ విధానాలను తీవ్రంగా విమర్శించారు. బంగ్లాదేశ్ ప్రధాని హసీనా భారత్ వచ్చినా కోల్‌కతా రాకుండా బీజేపీ అడ్డుకుందని మమత ఆరోపించారు. అంతటితో ఆగని ఆమె ఢిల్లీలో నేతాజీ విగ్రహావిష్కరణకు రావాలని సెక్రటరీతో లేఖ పంపారని, తానేమీ బీజేపీకి బానిసను కాదని మమత మండిపడ్డారు.  


వాస్తవానికి నితీశ్ ఇంకా మమతను కలవనే లేదు. ఈలోగానే ఆమె తమ మనసులోని మాటను బయటపెట్టేశారు. నితీశ్ అతి త్వరలో మమతను కలవనున్నారు. బీజేపీయేతర పోరును మరో స్థాయికి తీసుకెళ్లాలని కోరనున్నారు. ప్రతిపక్షాలను ఐక్యం చేయడంలో చురుగ్గా పావులు కదుపుతున్న నితీశ్ మమతతో పాటు ఉత్తరాది, దక్షిణాది నేతలందరినీ ఒకేతాటిపైకి తెచ్చేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. నితీశ్ ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, జేడీఎస్ అధినేత కుమారస్వామిలను కలుసుకున్నారు. సోనియా గాంధీ సహా మిగతా నేతలనూ అతి త్వరలో కలుసుకోనున్నారు. విపక్షాల ప్రధాని అభ్యర్ధిపై తర్వాత తేల్చుకుందామని, ముందుగా అన్ని పార్టీల నేతలూ ఒక్కతాటిపైకి రావాలని నితీశ్ కోరుతున్నారు. నితీశ్ పిలుపునకు విపక్ష నేతలంతా సానుకూలంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్‌తో కలిసి పోరాడే విషయంలో కేసీఆర్ సహా ఒకరిద్దరికి అభ్యంతరాలున్నా పార్లమెంట్ ఎన్నికల సమయానికి అంతా ఏకాభిప్రాయానికి రావొచ్చని పరిశీలకులు చెబుతున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికలు బీజేపీకి నల్లేరుమీద నడక కాదనే విషయాన్ని తాజా పరిణామాలు సూచిస్తున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 

Read more