‘రాష్ట్రంలోనే విద్యుదుత్పత్తి పెంచే పథకం’

ABN , First Publish Date - 2022-04-24T15:42:52+05:30 IST

రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసే పథకం రూపొందిస్తున్నట్లు విద్యుత్‌ శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజి పేర్కొన్నారు. స్థానిక అన్నాశాలైలోని

‘రాష్ట్రంలోనే విద్యుదుత్పత్తి పెంచే పథకం’

                         - మంత్రి సెంథిల్‌ బాలాజి


ప్యారీస్‌(చెన్నై): రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసే పథకం రూపొందిస్తున్నట్లు విద్యుత్‌ శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజి పేర్కొన్నారు. స్థానిక అన్నాశాలైలోని తమిళనాడు విద్యుత్‌ బోర్డు (టీఎన్‌ఈబీ) ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న వినియోగదారుల విద్యుత్‌ సేవా కేంద్రాన్ని మంత్రి సెంథిల్‌ బాలాజి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో గరిష్ఠంగా గత మార్చి 29వ తేదీ 17,196 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం జరిగిందని, వేసవి సీజన్‌లో విద్యుత్‌ అవసరాలు పెరిగినందువల్ల ముందు జాగ్రత్తల కింద ఏప్రిల్‌, మే నెలలకు అదనంగా 3 వేల మెగావాట్ల విద్యుత్‌ను టెండర్‌ విధానంలో కొనుగోలు చేసే చర్యలు చేపట్టామన్నారు. కేంద్రం వాటా నుంచి రాష్ట్రానికి సరఫరా చేయాల్సిన 796 మెగావాట్ల విద్యుత్‌ను రెండు రోజులుగా సరఫరా చేయలేదని, ఈ కారణం వల్ల 41 ప్రాంతాల్లో మాత్రమే విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని వివరించారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో 68 సార్లు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో ఉన్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు అవసరమైన బొగ్గు పూర్తిస్థాయిలో లభ్యం కాలేదని, ఒకరోజుకు 72 వేల టన్నుల బొగ్గు అవసరమన్నారు. ఇందులో 48 వేల నుంచి 55 వేల టన్నుల బొగ్గు మాత్రమే దిగుమతి అవుతోందని, అవసరమైన బొగ్గు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఢిల్లీ పర్యటన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని కోరారని తెలిపారు. రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసే విధంగా పథకాలు సిద్ధం చేశామని, గత సంవత్సరంలో 5 శాతం ఉత్పత్తి పెరిగిందని, తప్పకుండా రాష్ట్రాన్ని విద్యుత్‌ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దతామని మంత్రి తెలిపారు.

Read more