Minister M. Subramaniam: జ్వర పీడిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు

ABN , First Publish Date - 2022-09-22T13:44:43+05:30 IST

రాష్ట్రంలో ప్రబలుతున్న జ్వరాలను అరికట్టేందుకు సిద్ధమైన ఆరోగ్యశాఖ.. బాధిత ప్రాంతాల్లో బుధవారం ప్రత్యేక శిబిరాలు ప్రారంభించింది. ఈ

Minister M. Subramaniam: జ్వర పీడిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు

- విద్యార్థులను పరీక్షించి, మందులిచ్చిన వైద్యులు

- విస్తృతవ్యాప్తి వదంతే 

- మంత్రి ఎం.సుబ్రమణ్యం


పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 21: రాష్ట్రంలో ప్రబలుతున్న జ్వరాలను అరికట్టేందుకు సిద్ధమైన ఆరోగ్యశాఖ.. బాధిత ప్రాంతాల్లో బుధవారం ప్రత్యేక శిబిరాలు ప్రారంభించింది. ఈ శిబిరాలు నగరంలో 100, రాష్ట్ర వ్యాప్తంగా 1000 ప్రాంతాల్లో ఈ శిబిరాలను ఏర్పాటు చేసిన ఆరోగ్యశాఖ.. వైద్యులతో ఎక్కడికక్కడ పరీక్షలు చేయించి తగిన మందుల పంపిణీ చేపట్టింది. స్థానిక పూందమల్లి కోలప్పన్‌చేరిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్యశిబిరాన్ని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...ఫ్లూజ్వరాలు విస్త్రతంగా వ్యాపిస్తున్నట్లు వస్తున్న వార్తలు వాస్తవం కాదన్నారు. అవి కేవలం వదంతులు మాత్రమేనని ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. వర్షాకాలంలో వైరల్‌ జ్వరాలు వ్యాపించడం సాధారణమన్నారు. గతంలో జ్వర బాధితుల సంఖ్య 1 శాతం ఉండగా, ప్రస్తుతం 1.3 శాతంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 353 మంది ఈ జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు. వారిలో ఐదేళ్లలోపున్న వారు 53 మంది, 5-14 ఏళ్లలోపున్న వారు 61 మంది, 15-65 ఏళ్లలోపున్న వారు  167 మంది, 65 ఏళ్లు పైబడిన వారు 72 మంది చికిత్సలు పొందుతున్నారని అన్నారు. గత జనవరి నుంచి ఇప్పటివరకు ఈ జ్వరంతో మృతిచెందినట్లుగా భావిస్తున్న 11 మందికి ఇతర అనారోగ్య కారణాలున్నాయని అన్నారు. ఫ్లూ జ్వరం సాధారణంగా మూడు రోజుల్లో తగ్గిపోతుందని, ఒకవేళ అధిక లక్షణాలుంటే ఐదు రోజులు పడుతుందన్నారు. ఈ జ్వరంతో ప్రాణాపాయం సంభవించే అవకాశం లేదన్నారు. బాధితులకు చికిత్సలందించేలా ప్రభుత్వాసుపత్రుల్లో పడకలు, మందులు సిద్ధం చేశామన్నారు. ముందస్తు జాగ్రత్తల కింద జ్వరం వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటుచేస్తున్నామని, 388 సంచార వైద్య బృందాలు గ్రామాలకు వెళ్లి వైద్యపరీక్షలు చేపట్టనున్నాయని తెలిపారు. సోషల్‌ మీడియాలో వస్తున్న విధంగా జ్వరతీవ్రత ఎక్కువగా లేదని, అందువల్ల పాఠశాలలకు సెలవులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జ్వరం లక్షణాలు కలిగిన పిల్లలను పాఠశాలలకు పంపరాదని విజ్ఞప్తి చేశారు. మూడు రోజుల తర్వాత కూడా జ్వర లక్షణాలుంటే ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా వైద్యపరీక్షలు చేయించుకోవాలని మంత్రి ప్రజలకు సూచించారు. 

Read more