ప్రభుత్వ పాఠశాలల్లో 9 లక్షల మంది విద్యార్థులు

ABN , First Publish Date - 2022-07-03T15:20:16+05:30 IST

ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో 9 లక్షల మంది విద్యార్థులు చేరారని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ తెలిపారు. చెన్నై జిల్లా

ప్రభుత్వ పాఠశాలల్లో 9 లక్షల మంది విద్యార్థులు

                              - మంత్రి అన్బిల్‌ మహేష్‌


పెరంబూర్‌(చెన్నై), జూలై  2: ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో 9 లక్షల మంది విద్యార్థులు చేరారని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ తెలిపారు. చెన్నై జిల్లా స్థాయిలో ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదివి టెన్త్‌, ప్లస్‌ టూ పబ్లిక్‌ పరీక్షల్లో పాఠశాల స్థాయిలో తొలి మూడు స్థానాలు పొందిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదు, బహమతులు అందజేసే కార్యక్రమం శుక్రవారం స్థానిక గ్రీన్‌వేస్‌ ప్రాంతంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి అన్బిల్‌ మహేష్‌ 350 మంది విద్యార్థులకు తలా రూ.3 వేల నగదు, బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో కొత్త పార్టీ అధికారం చేపట్టిన అనంతరం విద్యారంగంలో పలు మార్పులు చేయడం సహజమన్నారు. కానీ, గత అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రతి పౌరుడి తలపై రూ.75 వేల అప్పులుంచి వెళ్లిందని విమర్శించారు. నిధుల కొరత ఉన్నా పాఠశాల విద్యకు రూ.38 వేల కోట్లు కేటాయించడంతో పాటు ‘ఎన్నుమ్‌ ఎళుత్తుమ్‌’, ‘నాన్‌ ముదల్‌వన్‌’ తదితర పథకాలు, ఉచిత విద్యా సామగ్రి పంపిణీ తదితరాలను ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రారంభించారని తెలిపారు. పాఠశాల విద్య ముగించిన విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించేందుకు సహాయం చేయడం ప్రభుత్వ కర్తవ్యమన్నారు. అందుకోసమే ప్రోత్సాహక నగదు అందించే పథకం ప్రారంభించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపడంతో, ఈ విద్యా సంవత్సరం 9 మంది లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారన్నారు. విద్యార్థుల చేరికతో విద్యారంగానికి డీఎంకే ప్రభుత్వం అందిస్తున్న ప్రాధాన్యత నిరూపితమైందని మంత్రి తెలిపారు.

Read more