MGR statue : ఎంజీఆర్‌ విగ్రహం ధ్వంసం

ABN , First Publish Date - 2022-09-28T12:52:12+05:30 IST

స్థానిక తేనాంపేటలోని మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌(Former Chief Minister Mgr) విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

MGR statue : ఎంజీఆర్‌ విగ్రహం ధ్వంసం

                                - పెరియార్‌, అన్నాదురై విగ్రహాలకు భద్రత


చెన్నై, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): స్థానిక తేనాంపేటలోని మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌(Former Chief Minister Mgr) విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మంగళవారం వేకువజామున జరిగిన ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీస్ శాఖ.. నగరంలోని పెరియార్‌, అన్నాదురై(Periyar, Annadurai) విగ్రహాల వద్ద భద్రత ఏర్పాటు చేసింది. 2006లో జీఎన్‌ చెట్టి రోడ్డులో ఎంజీఆర్‌ విగ్రహాన్ని అన్నాడీఎంకే స్థానిక నాయకులు పెట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం వేకువజాము గుర్తు తెలియని వ్యక్తులు ఆ విగ్రహంపై రాళ్లు రువ్వి పారిపోయారు. ఈ సంఘటనలో విగ్రహం ముఖం, పీఠం కాస్త దెబ్బతింది. ఈ విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు ఆ ప్రాంతంలో నిరసన ప్రదర్శన జరిపారు. విగ్రహంపై దాడి చేసినవారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనను విరమింపజేశారు. ఇదిలా ఉండగా మాజీ సీఎం పన్నీర్‌సెల్వం, ఆయన అనుచరులు ధ్వంసమైన ఎంజీఆర్‌ విగ్రహాన్ని మధ్యాహ్నం పరిశీలించారు. రాష్ట్రంలో నేతల విగ్రహాలకు కూడా భద్రతలేదని ఆయన ఆరోపించారు.


విగ్రహాలకు పోలీసుల కాపలా...

విల్లుపురంలో పెరియార్‌ విగ్రహం, తేనాంపేటలో ఎంజీఆర్‌ విగ్రహంపై దాడులు జరిగిన నేపథ్యంలో నగరంలోని పెరియార్‌, అన్నాదురై విగ్రహాల వద్ద పోలీసులతో భద్రత కల్పించారు. నగరంలో 47 చోట్ల పెరియార్‌ విగ్రహాలు, 17 చోట్ల అన్నాదురై విగ్రహాలున్నాయి. ఈ విగ్రహాల వద్ద విగ్రహానికి ఒకరు చొప్పున కానిస్టేబుళ్లు కాపలా కాస్తున్నారు. ఇదే రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నేతల విగ్రహాలకు పోలీసు భధ్రత కల్పిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Updated Date - 2022-09-28T12:52:12+05:30 IST